ఈడీ కేసు ఎలా పెడుతుంది? | ED registers case against Siddaramaiah in MUDA case | Sakshi
Sakshi News home page

ఈడీ కేసు ఎలా పెడుతుంది?

Published Wed, Oct 2 2024 4:28 AM | Last Updated on Wed, Oct 2 2024 4:28 AM

ED registers case against Siddaramaiah in MUDA case

కోల్పోయిన భూమికి పరిహారంగా ప్లాట్లు కేటాయించారు 

మనీలాండరింగ్‌కు ఆస్కారం ఎక్కడిది: సిద్ధరామయ్య

బెంగళూరు: మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) ప్లాట్ల కేటాయింపు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరెక్టరేట్‌ (ఈడీ) తనపై మనీలాండరింగ్‌ కేసు నమోదు చేయడంలో ఔచిత్యం ఏమిటని కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రశ్నించారు. ‘దేని ఆధారంగా మనీలాండరింగ్‌ కేసు పెట్టారో నాకైతే అర్థం కావడం లేదు. మా నుంచి సేకరించిన భూమికి పరిహారంగా ప్లాట్లు కేటాయించారు. అలాంటపుడు మనీలాండరింగ్‌ కేసుకు ఆస్కారం ఎక్కడిది? నాకు తెలిసి మనీలాండరింగ్‌ దీనికి వర్తించదు’ అని సిద్ధరామయ్య మంగళవారం అన్నారు.

మైసూరులో సిద్ధరామయ్య భార్య పార్వతికి చెందిన 3.16 ఎకరాల భూమిని సేకరించిన ముడా పరిహారంగా 50:50 నిష్పత్తిలో ఖరీదైన ప్రాంతంలో 14 ప్లాట్లకు ఆమెకు కేటాయించింది. ఇందులో అధికార దురి్వనియోగం, అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చాయి. కోర్టు ఆదేశాల మేరకు సిద్ధరామయ్య, పార్వతిలపై లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా ఈడీ సోమవారం సిద్ధరామయ్యపై మనీలాండరింగ్‌ కేసును నమోదు చేసిన విషయం విదితమే. ఈడీ కేసు నమోదైన కొద్దిగంటల్లోనే 14 ప్లాట్లను వెనక్కి ఇచ్చేస్తానని పార్వతి ముడా కమిషనర్‌కు లేఖ రాశారు. తన భర్త పరువుప్రతిష్టలు, మానసిక ప్రశాంతత కంటే ఏ ఆస్తి కూడా తనకు ఎక్కువ కాదని ఆమె పేర్కొన్నారు. తనపై ద్వేష రాజకీయాలకు పార్వతి బాధితురాలుగా మారారని సిద్ధరామయ్య అన్నారు. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదన్నారు.

14 ప్లాట్లు వెనక్కితీసుకున్న ముడా 
మైసూరు: పార్వతి అభ్యర్థన మేరకు ఆమెకు కేటాయించిన 14 ప్లాట్లను మైసూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ముడా) మంగళవారం వెనక్కి తీసుకుంది. పార్వతితో చేసుకున్న సేల్‌డీడ్లను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్వతి తనయుడు, ఎమ్మెల్సీ డాక్టర్‌ యతీంద్ర తమకు లేఖను అందించారని, దాన్ని పరిశీలించి ప్లాట్లను స్వా«దీనం చేసుకోవాలని నిర్ణయించామని ముడా కమిషనర్‌ ఎ.ఎన్‌.రఘునందన్‌ వెల్లడించారు. ఎవరైనా స్వచ్ఛందంగా ప్లాట్లను వదులుకుంటే.. వెనక్కి తీసుకోవచ్చనే నిబంధన ముడా చట్టంలో ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement