అంతర్జాతీయ సైబర్ మోసాల నెట్ వర్క్, మనీ లాండరింగ్, అక్రమ ఆస్తుల ఆరోపణల వల్ల మెట్ టెక్నాలజీస్ యజమాని కునాల్ గుప్తా, తన సహచరుడు పవన్ జైస్వాల్‌కు చెందిన రూ.5.23 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ చర్యల్లో భాగంగా కేజీ స్టడ్ ఫామ్ ఎల్‌ఎల్‌పీకి చెందిన 37 గుర్రాలను సైతం ఈడీ అటాచ్ చేసింది. వీటి విలువ రూ.3.98 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది. గ్రీన్‌లీఫ్ కాంప్లెక్స్, బాగుయాటి, కోల్‌కతాలోని రూ.1.08 కోట్ల విలువైన ఫ్లాట్లను కూడా ఈడీ జప్తు చేసింది. ఈ కేసు ఈ కేసులో ఈడీ చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు, నవంబర్ 2023లో ఏజెన్సీ రూ.67.23 కోట్లు, జులై 2024లో రూ.85 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది.
మోసపూరిత వ్యాపార ఒప్పందాలు
కునాల్ గుప్తా, అతని సహచరులు యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియాలోని ప్రజలను లక్ష్యంగా చేసుకుని మోసపూరిత కాల్ సెంటర్‌లను నడుపుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. టెక్నాలజీని ఉపయోగించి నకిలీ యాప్‌ల ద్వారా తప్పుడు రుణ ఆఫర్‌లు, మోసపూరిత వ్యాపార ఒప్పందాలు చేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్‌ఎల్‌పీ, జీడీ ఇన్ఫోటెక్‌తో సహా పలు సంస్థల ద్వారా అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
రేసింగ్‌లో వచ్చిన డబ్బు పెట్టుబడిగా..
కునాల్‌గుప్తా, పవన్ జైస్వాల్ నిబంధనలకు విరుద్ధంగా తమ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌కు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరిపింది. ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ఆస్తులను, గుర్రాలను అటాచ్ చేసింది. సమగ్ర విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేజీ స్టడ్ ఫార్మ్ ఎల్‌ఎల్‌పీ గుర్రాలను కొనుగోలు చేయడం, వాటికి శిక్షణ ఇవ్వడం, అమ్మడం వంటి చేస్తోంది. ఈ క్రమంలో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా నిధులను దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. నేరారోపణలతో ముడిపడి ఉన్న గుర్రాల ద్వారా రేస్‌లో సంపాదించిన డబ్బును తిరిగి పెట్టుబడి పెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో 37 గుర్రాలను ఈడీ అటాచ్ చేసింది. వీటిని వివిధ రేస్ క్లబ్‌లు, రైడింగ్ పాఠశాలల్లో ఉంచుతున్నట్లు పేర్కొంది.
ఇదీ చదవండి: అధికంగా అమ్ముడైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు
లెక్కల్లోలేని లావాదేవీలు
జీడీ ఇన్ఫోటెక్ ద్వారా పవన్ జైస్వాల్ గ్రీన్‌లీఫ్ కాంప్లెక్స్‌లో అక్రమంగా ఆస్తులను సంపాదించినట్లు ఈడీ తెలిపింది. లెక్కల్లోలేని ఆర్థిక లావాదేవీలు, నగదు డిపాజిట్లు, చట్టబద్ధమైన ఆదాయ వనరులు లేకుండా నగదు బదిలీ చేయడం ద్వారా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఈడీ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment