మళ్లీ ఎన్డీయేనే.. కానీ..! | C-Voter and Republic TV Survey for General Election | Sakshi
Sakshi News home page

మళ్లీ ఎన్డీయేనే.. కానీ..!

Published Fri, Oct 5 2018 3:33 AM | Last Updated on Fri, Mar 29 2019 5:57 PM

C-Voter and Republic TV Survey for General Election - Sakshi

న్యూఢిల్లీ: 2019 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే అధికారంలోకి రానుందని తేలింది. అయితే 2014 లాగా ఈసారి కమలం పార్టీకి సొంతగా మెజారిటీ రాదని స్పష్టమైంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై రిపబ్లిక్‌ టీవీ, సీ–వోటర్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో మొత్తం 543 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమికి 276 చోట్ల గెలుపొందనుందని వెల్లడైంది. అటు కాంగ్రెస్‌ కాస్త పుంజుకున్నప్పటికీ యూపీఏ 112 స్థానాలకే పరిమితం కానుందని సర్వే పేర్కొంది.

అయితే ప్రాంతీయ పార్టీలే ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. ఈ పార్టీలన్నీ కలిసి 155 స్థానాల్లో విజయం సాధించి కీలకభూమిక నిర్వహించవచ్చని సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 335 స్థానాలు రాగా.. ఒక్క బీజేపీయే 282 చోట్ల విజయం సాధించింది. అయితే.. ఈసారి బీజేపీ సొంతంగా 230–240 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే ద్వారా వెల్లడైంది. కీలకమైన రాష్ట్రాల వారిగా పార్టీల విజయావకాశాలను ఓసారి గమనిస్తే..  

ఉత్తరప్రదేశ్‌: ఈ రాష్ట్రంలో మొత్తం 80 లోక్‌సభ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 71 చోట్ల విజయదుందుభి మోగించింది. ఇదే బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది. అయితే ఈసారి ఎన్డీయే కూటమికి ఇక్కడ ఎదురుగాలి వీయనుందని సర్వేలో వెల్లడైంది. మహాఘట్‌బంధన్‌ పేరుతో ఎస్పీ, బీఎస్పీ ఏకమైతే బీజేపీ సీట్లకు గండికొట్టడం ఖాయంగా కనబడుతోంది. రిపబ్లిక్‌ టీవీ–సీ వోటర్‌ సర్వే ప్రకారం, ఈసారి బీజేపీ 36 చోట్ల విజయం సాధించేందుకు అవకాశాలుండగా.. ఎస్పీ, బీఎస్పీ కూటమికి (కాంగ్రెస్‌ లేకుండా) 42 స్థానాల్లో గెలవొచ్చని తెలుస్తోంది. కాంగ్రెస్‌ కేవలం 3 చోట్ల గెలిచే అవకాశం ఉంది. అయితే మహాకూటమి నుంచి బీఎస్పీ విడిపోయి ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ మళ్లీ 70 చోట్ల గెలుపొందేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుందని పేర్కొంది.

రాజస్తాన్‌: ఇక్కడ మొత్తం 25 సీట్లున్నాయి. 2014లో మొత్తం సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. అయితే సీఎం వసుంధరా రాజేపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత కారణంగా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో కమలానికి కాస్తంత ఎదురుగాలి వీయడం ఖాయమని వెల్లడైంది. ఈసారి బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో గెలిచేందుకు అవకాశమున్నట్లు సర్వే తెలిపింది.

మధ్యప్రదేశ్‌: ఇక్కడ మొత్తం 29 సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ 27, కాంగ్రెస్‌ 2 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి బీజేపీకి కాస్తంత వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సర్వేలో వెల్లడైంది. దీని ప్రకారం బీజేపీ 23 చోట్ల, కాంగ్రెస్‌ 6 చోట్ల గెలవనున్నట్లు తెలిసింది. వచ్చే నెలలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.

బిహార్‌: బిహార్‌ ఎన్డీయేకు కీలక రాష్ట్రంగా మారింది. ఇక్కడ నితీశ్‌ కుమార్‌ నేతృత్వంలోని జేడీయూతో పొత్తు నేపథ్యంలో బీజేపీ ఎక్కువ సీట్లను వదులుకునేందుకు సిద్ధమైంది. ఇది బీజేపీకి కలిసొచ్చే అవకాశాలున్నాయి. ఇక్కడ మొత్తం 40 అసెంబ్లీ స్థానాలుండగా.. 2014లో బీజేపీ 22చోట్ల, ఎల్‌జేపీ 6 చోట్ల గెలవడంతో ఎన్డీయే కూటమికి 28 సీట్లు వచ్చాయి. అయితే అప్పుడు జేడీయూ రెండు సీట్లలో మాత్రమే గెలిచింది. అయితే ఈసారి జేడీయూ చేరికతో ఎన్డీయే బలం 31కి పెరుగుతుందని సర్వే పేర్కొంది. ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలన్నీ కలిసి 9 చోట్ల గెలిచే అవకాశం ఉంది.

కర్ణాటక: కర్ణాటక (28 సీట్లలో)లో కాంగ్రెస్, జేడీఎస్‌లు వేర్వేరుగా పోటీ చేస్తే.. సంయుక్తంగా 10 సీట్లు గెలుస్తాయని సర్వే పేర్కొంది. బీజేపీ 18 చోట్ల, కాంగ్రెస్‌ 7 స్థానాల్లో, జేడీఎస్‌ 3 చోట్ల గెలుస్తాయని వెల్లడైంది. ఇది కూటమి పార్టీలు వేర్వేరుగా కలిసి పోటీచేస్తే.. 15 స్థానాలు గెలవొచ్చనే ప్రజాభిప్రాయం వ్యక్తమైంది.

పశ్చిమబెంగాల్‌: మమత పోరాటగడ్డపై ఈసారి బీజేపీ నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకానుందని సర్వే తెలిపింది. మొత్తం 42 సీట్లలో బీజేపీ 16 చోట్ల గెలిచేందుకు వీలుందని తేలింది. 2014లో 34చోట్ల విజయం సాధించిన మమత ఈసారి 25 చోట్ల గెలుస్తారని వెల్లడైంది. యూపీలో జరిగే నష్టానికి ఇక్కడినుంచి కాస్తైనా ఉపశమనం పొందాలనే బీజేపీ వ్యూహం ఫలించే అవకాశం ఉందని తెలుస్తోంది.

తమిళనాడు: ఎప్పుడూ ఏకపక్షంగా ఒక పార్టీకి ఓట్లు వేసే తమిళ ఓటర్లు ఈసారి కూడా అదే పంథాను అనుసరించనున్నారు. గత ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని డీఎంకేకు అత్యధికంగా 28 చోట్ల గెలిపించనున్నారని సర్వే తెలిపింది. బీజేపీ రెండుస్థానాల్లో అన్నాడీఎంకే 9 చోట్ల విజయం సాధించొచ్చని పేర్కొంది.

గుజరాత్‌: ఈ రాష్ట్రంలోని మొత్తం 26 స్థానాలనూ 2014లో బీజేపీ గెలుచుకుంది. అయితే ఈసారి ఎదురుగాలి వీస్తుంది. కాంగ్రెస్‌తోపాటు పటేళ్ల ఉద్యమ నాయకుడి పోరాటం కారణంగా రెండు చోట్ల బీజేపీకి ఓటమి తప్పదని సర్వే వెల్లడించింది. ఈ రెండు చోట్ల కాంగ్రెస్‌ గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి ఎదురేలేదని ఉన్న 11 చోట్ల బీజేపీ ఘన విజయం సాధిస్తుందని పేర్కొంది.

మహారాష్ట్ర: బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారిన ప్రాంతం మహారాష్ట్ర. ఇక్కడున్న 48 స్థానాల్లో 2014లో బీజేపీ 23 చోట్ల గెలిచింది. శివసేన 18, యూపీఏ (కాంగ్రెస్‌+ఎన్సీపీ) 6 చోట్ల గెలిచాయి. అయితే ఈసారి ఒంటరిపోరు తప్పదని శివసేన ప్రకటించిన కాంగ్రెస్, ఎన్సీపీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. బీజేపీ 22 చోట్ల గెలుస్తుందని తెలిపింది. కూటమి నుంచి విడిపోతే శివసేన (7 చోట్ల మాత్రమే)కు నష్టం తప్పదని పేర్కొంది. ఇది కాంగ్రెస్, ఎన్సీపీలకు కలిపి 19 సీట్లు కట్టబెట్టే అవకాశం ఉంది. అయితే శివసేన ఓట్లను బీజేపీ రాబట్టుకోగలిగితే మరో ఐదారు చోట్ల గెలిచేందుకు వీలుంది.

ఒడిశా: నవీన్‌ పట్నాయక్‌ గడ్డపై ఈసారి బీజేపీ ఎక్కువసీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయని రిపబ్లిక్‌ టీవీ సర్వే పేర్కొంది. మొత్తం 21 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల, బీజేడీ 6 చోట్ల గెలవనుండగా.. కాంగ్రెస్‌ 2 స్థానాల్లో పాగా వేయొచ్చని వెల్లడించింది. ఇక్కడ గెలవడం బీజేపీకి అత్యంత ఆవశ్యకంగా మారింది. ఉత్తరభారతంలో కోల్పోయే సీట్లకు పశ్చిమబెంగాల్, ఒడిశాల్లో విజయంతో ఉపశమనం పొందనుంది. పంజాబ్‌లో మాత్రం ఎన్డీయేకే ఘోర పరాజయం తప్పదని స్పష్టమైంది. అకాలీదళ్‌పై ఉన్న వ్యతిరేకత బీజేపీకి పెనునష్టాన్ని మిగిల్చనుంది. ఈ సారి సిక్కుల గడ్డపై ఎన్డీయే ఒకే ఒక సీటు గెలుస్తుందని సర్వే తెలిపింది. కేంద్ర పాలిత ప్రాంతాల విషయానికొస్తే.. అండమాన్, దాద్రానగర్‌ హవేలీ, చండీగఢ్, డయ్యూడమన్‌లలో ఉన్న ఒక్కో సీటును, ఢిల్లీలోని 7 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుండగా.. పుదుచ్చేరి, లక్షద్వీప్‌లలోని ఒక్కో స్థానాన్ని కాంగ్రెస్‌ కైవసం చేసుకోనుందని సర్వే పేర్కొంది.

ఈశాన్య రాష్ట్రాలు: ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక ఎంపీ సీట్లున్న (13) అస్సాంలో బీజేపీ తన స్థానాన్ని మెరుగుపరుచుకోనుంది. 2014లో ఏడు సీట్లలో గెలిస్తే ఈసారి 9 చోట్ల విజయం సాధించొచ్చని సర్వే పేర్కొంది. కాంగ్రెస్‌ 4, స్వంతంత్రులు ఒక చోట గెలిచే వీలుందని తెలిపింది. ఈశాన్య రాష్ట్రాల్లోని మిగిలిన 11 స్థానాల్లో ఎన్డీయే 9 చోట్ల, యూపీఏ 2 చోట్ల గెలిచే అవకాశం ఉందని వెల్లడించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement