భారత్‌ అన్నింటా ఒక్కటిగానే.. | Narendra Modi Interacts With BJP Workers Via Video Conference | Sakshi
Sakshi News home page

భారత్‌ అన్నింటా ఒక్కటిగానే..

Published Fri, Mar 1 2019 1:58 AM | Last Updated on Fri, Mar 29 2019 5:33 PM

Narendra Modi Interacts With BJP Workers Via Video Conference - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌ ఐకమత్యంతో స్థిరంగా ముందుకు సాగుతూ అభివృద్ధి సాధిస్తుందనీ, పోరాడి గెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సైనిక బలగాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్లా కాదని నిరూపించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులతో మాట్లాడారు. ‘భారత్‌ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఒక్కటిగా నిలుస్తుంది. అభివృద్ధి చెందుతుంది. ఐకమత్యంతో పోరాడి విజయం సాధిస్తుంది’అని అన్నారు. పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై దాడుల అనంతరం ప్రజల్లో భావోద్వేగాలు మరింతగా పెరిగాయని పేర్కొన్న ప్రధాని.. మన జవాన్లు సరిహద్దులతోపాటు వెలుపల కూడా అసమాన ధైర్యాన్ని ప్రదర్శించారని, దేశం యావత్తూ వారి పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. సైనికుల త్యాగాలను బీజేపీ రాజకీయలబ్ధికి ఉపయోగించుకుంటోందంటూ ప్రతిపక్షాలు చేసి ఆరోపణలపై ఆయన స్పందించారు. ‘మన సైనికుల సామర్థ్యంపై నమ్మకం ఉంది. వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు గానీ, శత్రువు మన వైపు వేలెత్తి చూపే అవకాశం గానీ లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడుల ద్వారా అభివృద్ధిని అడ్డుకుని, దేశాన్ని అస్థిరం పరచడం శత్రువుకున్న లక్ష్యాల్లో ఒకటి’అని ఆయన తెలిపారు.
 
అది అవినీతిమయ కూటమి 
ప్రతిపక్షాలతో ఏర్పడిన మహాకూటమిని ప్రధాని మోదీ పూర్తిగా అవినీతిమయ (మహా మిలావత్‌)కూటమిగా అభివర్ణించారు. ‘దేశాన్ని ఈ కూటమి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌(ఐసీయూ)లోకి పంపుతుంది. మునిగిపోతున్న కాంగ్రెస్‌ను రక్షించేందుకే ఈ కూటమి ఏర్పడింది. బీజేపీ విరోధులతో చేతులు కలిపేందుకు కాంగ్రెస్‌ ఎంతకైనా దిగజారుతుందనేందుకు ఈ కూటమి ఒక ఉదాహరణ. ఇది నూనె, నీటి కలయిక వంటిది. దీనివల్ల వారికి ఎటువంటి ఉపయోగమూ లేదు. ఒకరినొకరు చూసుకునేందుకు ఇష్టపడని నేతల కలయికతో ఏర్పడిన కూటమి అది’అని ఆయన వాఖ్యానించారు. 2004లో మాదిరిగా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైతే.. దేశంలో అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలుగుతుందనీ, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ స్థానంలో ఈజ్‌ ఆఫ్‌ కరెప్షన్‌(అవినీతి) వస్తుందని వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలు దేశ ప్రజల అవసరాలను తీర్చడం లక్ష్యం కాగా, ప్రజల ఆకాంక్షలే ఎజెండా 2019 సాధారణ ఎన్నికలు రానున్నాయని తెలిపారు. దక్షిణాదిన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ గణనీయ ఫలితాలను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

రాజకీయ గిమ్మక్కు కాదు.. అది నా సంస్కారం 
అలహాబాద్‌ కుంభమేళాలో తను పారిశుధ్య కార్మికుల పాదాలను కడగడం రాజకీయ ప్రయోజనం కోసం కాదని, అది తనకున్న సంస్కారమని ప్రధాని చెప్పారు. పుణేకు చెందిన ఒక కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ‘యూపీలో జరుగుతున్న కుంభమేళాకు ఇటీవల వెళ్లాను. దాదాపు 22 కోట్ల మంది ప్రజలు సందర్శించుకున్న ప్రాంతమది. అయినప్పటికీ అక్కడ చాలా పరిశుభ్రంగా ఉంది. అక్కడ పనులు చేస్తున్న పారిశుధ్య కార్మికులదే ఈ గొప్ప తనమంతా. వాళ్లు నిజమైన కర్మయోగులు. అందుకే గౌరవభావంతో వారి కి కాళ్లు కడిగి కృతజ్ఞతలు తెలిపాను. ఇది తెలియని వారు రాజకీయ తమాషా అనుకున్నారు’అని తెలిపారు. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా అయినప్పుడు అధికార నివాసంలోకి గృహ ప్రవేశం ఎలా చేస్తారని అధికారులు నన్ను అడిగారు. నాలుగో తరగతి ప్రభు త్వ ఉద్యోగి ఒకరిని పిలిపించండి అని వారికి చెప్పా. ఒక దళిత ఉద్యోగిని వారు తీసుకువచ్చారు. అతని కుమార్తె చేతుల్లో కలశం ఉంచి గృహ ప్రవేశం చేయించా’అంటూ అప్ప టి అనుభవాన్ని వివరించారు.

అప్పుడు బ్యాట్‌మెన్‌.. ఇప్పుడు బాహుబలి
దేశం అభివృద్ధి బాటన సాగుతున్న ఈ సమయంలో ఎవరికి వారు తాము మరింత చురుకుగా ఉండాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ‘ఇది వరకు భారత్‌ అంటే పేదరికం. కానీ, ఇప్పుడు పెట్టుబడులకు స్వర్గధామం. పూర్వం భారత్‌ అంటే పాములను ఆడించే వారి దేశం. నేడు శాస్త్ర– సాంకేతిక రంగాలకు, ఉపగ్రహాలు, శాటిలైట్లకు పేరుగాంచింది. ఇదివరకు దేశంలో విద్యుత్తు కొరతతో చీకటి తాండవించేది. కానీ, భారత్‌ అంటే ఇప్పుడు ఎల్‌ఈడీ విప్లవం. ఇప్పటిదాకా బ్యాట్‌మెన్‌ను ప్రపంచం హీరోగా భావించేది. ఇప్పుడు బాహుబలి అంటే ఎవరో ప్రపంచానికి తెలిసింది’అని తెలిపారు. 

వీడియో కాన్ఫరెన్స్‌ రికార్డు
రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం ప్రధా ని మోదీ ‘మేరా బూత్‌ సబ్‌ సే మజ్‌బూత్‌’కార్యక్రమంలో భాగంగా ’దేశవ్యాప్తం గా 15వేల ప్రాంతాల్లోని కోటి మంది బీజేపీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రముఖులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. నమో యాప్‌ ద్వారా జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌ ప్రపంచంలోనే అతి పెద్దదని బీజేపీ మీడియా విభా గం అధిపతి అనిల్‌ బలూనీ ఒక ప్రకటనలో తెలి పారు. దాదాపు 85 నిమిషాల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో పాక్‌ సైన్యానికి చిక్కిన వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ గురించి మాత్రం ప్రధాని ఎక్కడా ప్రస్తావించకపోవ డం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement