సాక్షి, అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ అంత దుర్మార్గమైన రాజకీయ నాయకుణ్ణి చరిత్రలో చూడలేదని గతంలో నిప్పులు చెరిగిన చంద్రబాబు.. ఇప్పుడు హఠాత్తుగా నాలుక మడతపెట్టి మోదీ అంత గొప్ప నాయకుడు లేరని.. మోదీ వల్లే దేశానికి గుర్తింపు వచ్చిందని, ఆయనకే తన సంపూర్ణ మద్దతు అని చంద్రబాబు పేర్కొనటంపై సామాజిక మాధ్యమాల్లో సెటైర్లు వైరల్ అవుతున్నాయి.
రోజుకో వేషం.. పూటకో మాటతో ప్రజలను మభ్యపెట్టడం చంద్రబాబుకు అలవాటేనని పలువురు పేర్కొంటున్నారు. మాట మార్చటం.. ప్రజలను ఏమార్చటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని పేర్కొంటున్నారు. గతంలో ప్రధాని మోదీపై చేసిన విమర్శలు.. తాజాగా రిపబ్లిక్ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల్ని చూసి నవ్వుకుంటున్నారు.
నాడు మోదీని ఉద్దేశించి చంద్రబాబు ఏమన్నారంటే..
మోదీ హార్డ్‌కోర్ టెర్రరిస్ట్
‘ప్రధాని నరేంద్రమోదీ హార్డ్‌కోర్ టెర్రరిస్ట్. ఆయన మంచి వ్యక్తి కాదు. 2002లో గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోదీ రాజీనామా చేయాలని మొదట నేనే డిమాండ్ చేశా. ఆ తర్వాత చాలా దేశాలు ఆయనను తమ దేశంలోకి రావడంపై నిషేధం విధించాయి. ప్రధాని అయ్యాక మైనారిటీలపై మరోసారి దాడి చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు.’ (ఏప్రిల్ 3, 2019న చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన మైనారిటీల సభలో చంద్రబాబు)
పెళ్లాన్ని చూసుకోలేని వాడు.. దేశాన్ని ఏం చూసుకుంటాడు
‘నువ్వు భార్యను వదిలేశావు. కుటుంబ వ్యవస్థపై నమ్మకం ఉందా? ప్రధానికి కుటుంబం లేదు. కొడుకు లేడు. దేశంలోని అన్ని వ్యవస్థలను నాశనం చేశాడు. పెళా్లన్ని చూసుకోలేని వాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు?’ (ఫిబ్రవరి 10, 2019న గుంటూరు సభలో..)
ఇడ్లీ తిన్నా పన్ను కట్టించుకుంటున్నారు
‘దేశానికి ఏం చేశారో చెప్పే దమ్ము కేంద్రానికి ఉందా? నల్లధనం నియంత్రణ కోసం నోట్ల రద్దు అని చెప్పి ప్రజల డబ్బును బ్యాంకు నుంచి తీసుకోవడానికి ఇబ్బందులు పెడుతున్నారు. జీఎస్టీ అని కొత్త చట్టాన్ని తెచ్చారు. ఇడ్లీ తిన్నా పన్ను కట్టించుకుంటున్నారు. దేశంలో రైతులు దివాళా తీసే పరిస్థితి తీసుకువచ్చారు.’
(జూన్ 19, 2018న కర్నూలు జిల్లా నాయుడుపేట మహాసంకల్ప సభలో..)
బోఫోర్స్ కంటే అతిపెద్ద కుంభకోణం రాఫెల్
‘కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అన్నివిధాలా ఘోరంగా విఫలమైంది. నోట్ల రద్దుతో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేశారు. ఈ చర్యతో బ్యాంకులన్నీ దివాళా తీశాయి. అభివృద్ధి ఆగిపోయింది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. రూపాయి విలువ పడిపోయింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు కుదేలయ్యాయి. రక్షణ శాఖలో భారీ అవినీతి జరిగింది. బోఫోర్స్ కంటే అతిపెద్ద కుంభకోణం రాఫెల్ డీల్. దీనిపై సమగ్ర విచారణ చేయాలి.’ (అక్టోబర్ 11, 2018న కళ్యాణదుర్గం బహిరంగ సభలో..)
మోదీవన్నీ విఫల కార్యక్రమాలు
‘ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి, బ్రిటిష్ వాళ్లకి తేడా ఏమీ లేదు. అమిత్‌షాకు నాయకుడికి ఉండాల్సిన లక్షణాలేమీ లేవు. బీజేపీ నేతల్ని కృష్ణా నదిలో ముంచితే వారి పాపపు ఆలోచనలన్నీ పోతాయి. ప్రధాని నరేంద్ర మోదీవన్నీ విఫల కార్యక్రమాలు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి వాటిని సరైన పరిష్కారం చూపకుండానే తీసుకువచ్చారు. దీనివల్ల దేశంలో అభివృద్ధి రేటు తగ్గిపోయింది. అదృష్టం కలిసి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. ఆయన కంటే నేనే సీనియర్.’ (సెప్టెంబర్ 12, 2018న అసెంబ్లీలో..)
మోదీ వచ్చాక అభివృద్ధి ఆగిపోయింది
‘ప్రధాని మోదీ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేశారు. మోదీ వచ్చాక దేశంలో అభివృద్ధి ఆగిపోయింది. రూపాయి విలువ పడిపోయింది. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగిపోయాయి. నోట్ల రద్దుతో ప్రజలంతా ఇబ్బందులు పడ్డారు.’ (సెప్టెంబర్ 21, 2018న విజయవాడ జ్ఞాన భేరి సభలో..)
సిగ్గు, లజ్జ, గౌరవం లేని వ్యక్తి మోదీ
‘ప్రధాని నరేంద్ర మోదీకి సిగ్గు కూడా లేదు. సిగ్గు, లజ్జ, ఒక గౌరవం లేని వ్యక్తి. నా జీవితంలో చాలామంది వ్యక్తుల్ని చూశాను. ఇలాంటి వ్యక్తిని చూడలేదు. గ్రామాల్లో ఉండే చిన్న కార్యకర్త నరేంద్ర మోదీ కంటే వెయ్యి రెట్లు బెటర్. అది ఆయన స్తోమత.’ (ఏప్రిల్, 2, 2019వ తేదీన)
నేడు రిపబ్లిక్ టీవీ చర్చా వేదికలో..
‘మోదీ వల్లే దేశానికి గుర్తింపు.. ఆయనకే నా సంపూర్ణ మద్దతు
పధాని నరేంద్ర మోదీ వల్లే ప్రపంచంలో భారతదేశానికి గుర్తింపు వచ్చిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. రిపబ్లిక్ టీవీ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన చర్చా వేదికలో మంగళగిరి నుంచి ఆయన వర్చువల్‌గా పాల్గొని మాట్లాడారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ విధానాలు, కార్యక్రమాలను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పారు. ఆయన చెప్పిన ‘విజన్ 2047’తో తాను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. దాన్ని అమలు చేసేందుకు తాను, తన ప్రజలు ఆయనతో కలిసి పనిచేస్తామన్నారు.
మోదీ వల్లే భారతదేశ శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి తెలిశాయన్నారు. గతంలో కూడా తాను ఎప్పుడూ మోదీ విధానాలను వ్యతిరేకించలేదన్నారు. కేవలం ప్రత్యేక హోదా, విభజన అంశాలు వంటి రాష్ట్ర ప్రజల మనోభావాల అంశాలపైనే కేంద్రంపై పోరాడాను తప్ప వారి విధానాలను విమర్శించ లేదన్నారు. మోదీ ప్రపంచంలోని అన్ని దేశాలు తిరిగి భారత్‌ను బ్రాండింగ్ చేస్తున్నారని, ప్రస్తుతం అది చాలా అవసరమని చంద్రబాబు పేర్కొన్నారు.
ఇందుకు ఆయన్ను తాను పూర్తిగా అభినందిస్తున్నట్టు తెలిపారు. ఆయనకు పూర్తిగా మద్దతు ఇస్తానన్నారు. మోదీ నెట్‌వర్కింగ్ ద్వారా ప్రపంచ స్థాయిలో దేశానికి గుర్తింపు తెచ్చారని, ఆయన విజన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నానని తెలిపారు. అభివృద్ధి విషయంలో ప్రధాని ఆలోచనే తన ఆలోచన కూడానన్నారు. ఎన్డీఏకు మద్దతిచ్చే విషయంపై సమయానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రధాని చేసే పనులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment