బీసీ నేతల మధ్య చంద్రబాబు చిచ్చు
కేవీ రావుకు వ్యతిరేకంగా యనమల లేఖాస్త్రం
దీనిపై రెడ్డి సుబ్రహ్మణ్యం ఘాటు వ్యాఖ్యలు
ఇదంతా సీఎం సూచనల మేరకే అంటున్న నేతలు
యనమల టార్గెట్‌గా సోషల్ మీడియాలోనూ పోస్టులు
సాక్షి, అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా తెగించే చంద్రబాబు ఇప్పుడు పార్టీలోని ఇద్దరు బీసీ నేతల మధ్చ చిచ్చు పెట్టారు. సుదీర్ఘ కాలం నుంచి తనకు బలమైన మద్ధతుదారుగా ఉన్న సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలను జీర్ణించుకోలేక ప్రశ్నించడంతో ఆయనపైకి మరో సీనియర్ నేత, శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యంను ఉసిగొల్పినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
అంతేకాకుండా టీడీపీ సోషల్ మీడియా కూడా యనమలకు వ్యతిరేకంగా తీవ్ర స్థాయి ఆరోపణలతో ట్రోల్ చేస్తోంది. దీనికంతటికీ కాకినాడ పోర్టు వ్యవహారంలో చంద్రబాబు వైఖరికి విరుద్ధంగా యనమల రామకృష్ణుడు ఆయనకు లేఖ రాయడమే కారణం. కాకినాడ పోర్టుకు చెందిన కేవీ రావు చౌదరికి చంద్రబాబు మద్దతు పలుకుతూ రాజకీయంగా ఆయన్ను పావులా వాడుకుంటున్నారు.
కానీ యనమల మాత్రం తాను రాసిన లేఖలో కేవీ రావు చౌదరి కాకినాడ సెజ్ భూముల ద్వారా వేల కోట్ల లబ్ధి పొందారని.. బీసీ, మత్స్యకార రైతులకు అన్యాయం చేశారని ఆరోపించారు. తనను ధిక్కరిస్తూ లేఖ రాయడంతో చంద్రబాబు.. యనమలను ప్రశ్నించకుండా ఇతర బీసీ నేతలను ఆయనపైకి ప్రయోగించినట్లు ప్రచారం జరుగుతోంది.
అందులో భాగంగానే రెడ్డి సుబ్రహ్మణ్యం బహిరంగంగా యనమల రామకృష్ణుడిపై ఆరోపణలు గుప్పించారు. 40 ఏళ్లుగా యనమల బీసీల గురించి పట్టించుకోలేదని, ఇప్పుడు తనకు పదవి ఇవ్వలేదనే కారణంతో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆయనకు తోడుగా మరికొందరు కింది స్థాయి నేతలు కూడా యనమలపై విమర్శలు చేశారు. టీడీపీ సోషల్ మీడియా అయితే యనమల పార్టీలో ఉన్న విషయాన్ని కూడా మరచిపోయి ఆడేసుకుంటోంది.
చంద్రబాబుకు తెలియకుండానే తిడతారా?
పార్టీలో తన స్థాయి ఉన్న ఒక సీనియర్ బీసీ నాయకుడిని, మరో సీనియర్ బీసీ నాయకుడు బహిరంగంగా తిట్టారంటే అందుకు చంద్రబాబు పరోక్ష అనుమతి కచ్చితంగా ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యనమలకు వ్యతిరేకంగా పార్టీలోనే ఇంత జరుగుతున్నా, చంద్రబాబు స్పందించక పోవడాన్ని బట్టి ఆయన అభిమతం ప్రకారమే ఇదంతా జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
మరోవైపు కొందరు బీసీ నేతలు యనమలకు మద్దతుగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు ఆది నుంచి తోడు, నీడగా ఉన్న నాయకుడిని ఇలా అవమానించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలా పార్టీలోనే బీసీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడినా, చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీడీపీలో జరుగుతున్న పరిణామాల పట్ల యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనలాంటి సీనియర్లను పూర్తిగా పక్కన పెట్టేయడంతో ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీనికితోడు కాకినాడ పోర్టు, సెజ్ విషయంలో కేవీ రావు చౌదరికి అనుకూలంగా వ్యవహరించడం, రాజ్యసభ స్థానాలను లాబీయిస్టులకు కట్టబెడుతుండడంతో తట్టుకోలేక ఆయన తొలిసారిగా చంద్రబాబును ధిక్కరించి లేఖ రాసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడం నుంచి చంద్రబాబుతో కలిసి పని చేసిన యనమల లాంటి నాయకుడు తిరుగుబాటు స్వరం వినిపించడంతో పార్టీలో గందరగోళం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment