అర్నబ్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు | Anvay Naik Wife Alleged On Arnab Goswami | Sakshi
Sakshi News home page

బకాయిలిస్తే నా భర్త బతికేవాడు

Published Thu, Nov 5 2020 7:58 AM | Last Updated on Thu, Nov 5 2020 9:58 AM

Anvay Naik Wife Alleged On Arnab Goswami - Sakshi

సాక్షి ముంబై : రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామి అప్పడే బకాయిలు చెల్లిస్తే ఈ రోజు తన భర్త బతికి ఉండేవారని అన్వయ్‌ నాయిక్‌ (53) భార్య అక్షత వ్యాఖ్యానించారు. అర్నబ్‌ గోస్వామిని అలీబాగ్‌ పోలీసులు అరెస్టు చేయడంతో తన భర్త, అత్తకు న్యాయం జరిగే దిశగా అడుగులు పడ్డాయన్నారు. బుధవారం అర్నబ్‌ అరెస్టు అనంతరం ఆమెతోపాటు ఆమె కూతురు ఆద్న్యా నాయిక్‌ సైతం విలేకరులతో మాట్లాడారు. టీవీ స్టూడియో పనులు చేయించుకున్న అర్నబ్‌ పూర్తి డబ్బులు చెల్లించలేదని అక్షత ఆరోపించారు. దీంతోనే అప్పుల్లో కూరుకుపోయిన ఆయన కొత్త పనులు చేయలేకపోయారని తెలిపారు. అందుకే తీవ్ర ఒత్తిడికి గురైన తన భర్త అన్వయ్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడని దీంతో ఆయన తల్లి కూడా ఆత్మహత్య చేసుకుందని విలపించారు. ఈ విషయానికి సంబంధించి అన్వయ్‌ సుసైడ్‌ నోట్‌ కూడా రాశారని గుర్తు చేశారు. అయితే పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయలేదన్నారు. దీనికి సంబంధించి చాలాసార్లు ముఖ్యంగా అర్నబ్‌ బెదిరించాడని ఆరోపించారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అర్నబ్‌ గోస్వామిని అరెస్టు చేయడంతో తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలుగుతుందని ఆమె అన్నారు. (అర్నబ్‌ గోస్వామి అరెస్ట్‌)


అసలు ఏం జరిగింది? 
ముంబైలో రిపబ్లిక్‌ టీవీ స్టూడియోకు సంబంధించిన ఇంటీరియర్‌ పనులు అలీబాగ్‌కు చెందిన డిజైనర్‌ అన్వయ్‌ నాయిక్‌(53) చేశాడు. అయితే కొద్దిరోజుల తర్వాత అలీబాగ్‌లోని తన ఇంట్లో 2018 మే 5వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఆయనతోపాటు అన్వయ్‌ తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. అయితే రిపబ్లిక్‌ చానెల్‌లో పనులు చేసిన అనంతరం అర్నబ్‌ డబ్బులు ఇవ్వలేదని సుమారు రూ. 83 లక్షలు బకాయిలు రావాల్సి ఉందని.. కానీ, ఆ డబ్బులు ఇవ్వకపోవడంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టు వారి కుటుంబీకులు ఆరోపించారు. కాగా, అన్వయ్‌ నాయిక్‌ సుసైడ్‌ నోట్‌లో కూడా అర్నబ్‌ గోస్వామి పేరుతోపాటు మరో ఇద్దరి పేర్లు రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేçసినప్పటికీ అనంతరం ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అయితే ఈ విషయంపై మళ్లీ అన్వయ్‌ నాయిక్‌ భార్య, కుమార్తెల ఫిర్యాదు మేరకు ఈ కేసుకు సంబంధించి అర్నబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా మరో ఇద్దరిని కూడా అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు.

ఎమర్జెన్సీని తలపిస్తోంది: ఫడ్నవిస్‌ 
రిపబ్లిక్‌ టీవి చీఫ్‌ ఎడిటర్‌ అర్నబ్‌ గో స్వామిని బుధవారం అరెస్టు చేయడంపై ఉద్దర్‌ ఠాక్రే నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వంపై బీజేపీ విరుచుకుపడింది. అర్నబ్‌ గొంతును మూగబోయేలా చేస్తున్నారని పేర్కొంది.  శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్‌ మాట్లాడుతూ.. 1977లో ఎమర్జెన్సీ విధించారనీ, కానీ అది ప్రస్తుతం కూడా కొనసాగుతోందని ట్విట్టర్‌ ద్వారా విమర్శించారు. ఎమర్జెన్సీ మద్దతుదారులు కాంగ్రెస్, శివసేనలపై గొంతెత్తి ప్రశ్నించేవారి స్వేచ్చకి భంగం కలిగిస్తున్నారని, ఇలాంటి వారితో దేశం పోరాటం చేస్తూ ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఫడ్నవిస్‌ ధ్వజమెత్తారు. ముంభైలో బీజేపీ ఎమ్మెల్యే ఆశీష్‌ శెలార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. అర్నబ్‌ వంటి జర్నలిస్టులు ప్రశ్నిస్తారని, సొంత ప్రయోజనాల కోసం ఉద్దవ్‌ ఠాక్రే ప్రభుత్వం వీరి గొంతును కట్టిపడేస్తూ, వారి స్వేచ్చకి భంగం కలిగిస్తుందని ఆరోపించారు. శివసేన నేతృత్వంలోని ఎంవీఎం ప్రభుత్వం జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తోందని, అర్నబ్‌ విషయంలోనూ ఇదే విధంగా ప్రవర్తిస్తూ, ఆత్మహత్య కేసు ఇప్పటికే పూర్తయిన, దానిని తిరిగి లేవనెత్తిందని అన్నారు. ప్రజాస్వామ్యానికి ఇదొక బ్లాక్‌ డే అని ఆశీష్‌ వ్యాఖ్యానించారు.

అర్నబ్‌పై దాడి చేశారు : న్యాయవాది 
రిపబ్లిక్‌ టీవీ ఛానెల్‌ ఎడిటర్‌ అర్నబ్‌ గోస్వామిని అరెస్టు చేసే సమయంలో ముంబైలోని ఆయన ఇంట్లో పోలీసులు చేయి చేసుకున్నట్లు అర్నబ్‌తోపాటు ఆయన న్యాయవాది గౌరవ్‌ పార్కర్‌లు ఆరోపించారు. పార్కర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన అరెస్టుకు సంబంధించి ఆయన భార్యకు కూడా తెలియపరచలేదని, ఇద్దరు పోలీసులు ఆయనపై భౌతికంగా దాడి చేశారని ఆరోపించారు. అంతేకాకుండా పోలీసులు కుటుంబ సభ్యులతో తోపులాటకు దిగినట్టు పేర్కొన్నారు. అర్నబ్‌ ఎడమ చేతికి గాయమైందని, వెన్నుపై చేయిచేసుకున్నారని గౌరవ్‌ ఆరోపించారు. ఇక ఎలాంటి పత్రాలు లేకుండా మూసి వేసిన కేసుకు సంబంధించి అరెస్టు చేయడాన్ని రిపబ్లిక్‌ టీవీ తప్పు బట్టింది. అర్నబ్‌ అరెస్టుతో శివసేన, బీజేపీ నాయకుల మధ్య రాజకీయ రగడ మొదలైంది. బీజేపీ నేతలు అర్నబ్‌ అరెస్ట్‌ అన్యాయమని, కక్ష పూరిత చర్యేనని శివసేన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదు
తప్పు ఎవరు చేసినా చట్టప్రకారం చర్యలు తీసుకుంటారని శివసేన నేత, ఎంపీ సంజయ్‌ రావుత్‌ పేర్కొన్నారు. అర్నబ్‌ గోస్వామిని ఆలీబాగ్‌ పోలీసుల అరెస్టు చేయడాన్ని సంజయ్‌ సమర్థించారు. ఆధారాలు లభించాయి కావచ్చు అందుకే అరెస్టు చేశారని, పోలీసులు ఎవరినీ ఊరికే అరెస్టు చేయరన్నారు. అలాగే తప్పు తను చేసినా చట్టం తనను విడిచిపెట్టదని తెలిపారు. ఇది రాజకీయపార్టీలు, ప్రభుత్వానికి సంబంధించి కాదని, ముఖ్యంగా పత్రికా స్వేచ్ఛకు సంబంధించి కూడా కాదని ఇది అన్వయ్‌ నాయిక్‌ ఆత్మహత్యకు సంబంధించిన కేసుగా పేర్కొన్నారు. శివసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ ఒక్కరిని ఉద్ధేశపూర్వకంగా అరెస్టు చేయలేదన్న విషయాన్ని గుర్తు చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement