రిపబ్లిక్ టీవీ: లాలూకు ఆడియో టేపు షాక్
తన చానెల్ రిపబ్లిక్ టీవీని శనివారం ప్రారంభించిన అర్ణబ్ గోస్వామి బాంబు పేల్చారు. రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్(ఆర్‌జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్, తీహార్ జైల్లో జీవితఖైదులో అనుభవిస్తున్న షహబుద్దీన్‌తో మాట్లాడుతున్న ఆడియో టేప్‌ను రిపబ్లిక్ టీవీ బయటపెట్టింది. జైలు నుంచి లాలూకు, షహబుద్దీన్ సూచనలు ఇస్తున్నట్లు అందులో ఉంది.
లాలూ తనయుడు తేజ్ ప్రతాప్‌యాదవ్‌కు పాట్నాలో ఓ పెట్రోల్ పంపును 2011లో అక్రమంగా కేటాయించారని బీహార్‌కు చెందిన బీజేపీ నేత సుశీల్‌కుమార్ మోదీ ఆరోపణలు చేసిన కొద్ది గంటలకే ఆడియో క్లిప్పింగ్ బయటకు రావడంతో విపక్షాలు లాలూ, అధికార బీజేడీలపై దుమ్మెత్తిపోస్తున్నాయి. క్లిప్పింగ్‌పై మాట్లాడిన సుశీల్.. లాలూ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
క్లిప్పింగ్‌పై మాట్లాడిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆడియో టేపును విన్న దేశం నివ్వెరవపోయిందని అన్నారు. ప్రారంభంతోనే నాయకుల అక్రమాలను బయటపెట్టడం మొదలుపెట్టిన అర్ణబ్‌ను పలువురు నాయకులు ప్రశంసించారు. కాగా, ఆడియో క్లిప్పింగ్‌పై ఆర్జేడీగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ఇంకా స్పందించలేదు.