సుప్రీంలో అర్నాబ్‌కు చుక్కెదురు.. | Supreme Court Rejects Arnab Goswami Plea | Sakshi
Sakshi News home page

సుప్రీంలో అర్నాబ్‌కు చుక్కెదురు..

Published Tue, May 19 2020 2:18 PM | Last Updated on Tue, May 19 2020 2:18 PM

Supreme Court Rejects Arnab Goswami Plea - Sakshi

న్యూఢిల్లీ : రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ అర్నాబ్‌ గోస్వామికి సుప్రీం కోర్టులో చుక్కెదురయింది. తనపై నమోదైన ఓ కేసుకు సంబంధించిన విచారణను సీబీఐకి బదిలీ చేయాలనే అర్నాబ్‌ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు దర్యాప్తు కొనసాగించడానికి అనుమతించింది. అయితే అర్నాబ్‌కు మరో మూడు వారాల పాటు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలని ముంబై పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. 

వివరాల్లోకి వెళితే.. పాల్ఘర్‌ మూకదాడికి సంబంధించి అర్నాబ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని దేశవ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్‌లో కాంగ్రెస్‌ శ్రేణులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో అర్నాబ్‌ సుప్రీంను ఆశ్రయించగా అన్ని కేసులపైనా స్టే విధించిన ధర్మాసనం.. ఒక్క నాగ్‌పూర్‌లో దాఖలైన కేసుపై స్టే విధించకుండా ముంబైకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మూడు వారాల పాటు అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించింది. (చదవండి : అర్నాబ్‌ గోస్వామిపై కేసు నమోదు )

అయితే తాజాగా ఈ కేసు విచారణ సందర్భంగా అర్నాబ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తనపై రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తనపై దాఖలైన కేసుకు సంబంధించి ముంబై పోలీసులు 12 గంటలపాటు విచారించారని తెలిపారు. తనను విచారించిన ఇద్దరు అధికారులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని అన్నారు. మరోవైపు ఇందుకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంను ఆశ్రయించింది. అర్నాబ్‌ తనకు సుప్రీం ఇచ్చిన రక్షణను దుర్వినియోగం చేస్తున్నారని తెలిపింది. పోలీసుల్లో భయాందోళన కలిగించేలా అర్నాబ్‌ తీరు ఉందని.. కేసుపై అతని ప్రభావం పడకుండా తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరింది.

మరోవైపు బాంద్రా రైల్వే స్టేషన్‌ వద్ద వలస కూలీలు గుమిగూడటంపై ప్రసారం చేసిన కథనానికి సంబంధించి దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని వేసిన క్వాష్‌ పిటిషన్‌ కూడా సుప్రీం ధర్మాసనం తిరస్కరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement