జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు చరిత్ర పునరావృతం కానుంది. జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన మహిళా ధర్మాసనం కేసుల విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా 2013లో జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ల మహిళా ధర్మాసనం ఓ కేసుపై విచారణ జరిపింది.
ప్రస్తుత మహిళా జడ్జీల్లో సీనియర్ అయిన జస్టిస్ భానుమతి 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఆగస్టులో జస్టిస్ ఇందిరా బెనర్జీ రాకతో సుప్రీంకోర్టులో సిట్టింగ్ మహిళా జడ్జిల సంఖ్య మూడుకు చేరింది. ఏకకాలంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.
39 ఏళ్ల తర్వాత మహిళా జడ్జి..
1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టులో ఓ మహిళ జడ్జిగా నియమితురాలు కావడానికి 39 ఏళ్లు పట్టింది. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో జడ్జిగా సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాలంలో వరుసగా జడ్జీలు సుజాతా మనోహర్, రుమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్, ఆర్.భానుమతి, ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టులో జడ్జీలయ్యారు.
దిగువ కోర్టుల్లో 28 శాతమే!
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య 12 శాతమేనని ప్రభుత్వ గణాంల్లో తేలింది. 7 హైకోర్టుల్లో మహిళా జడ్జి ఒక్కరు కూడా లేరు. 33 శాతం మహిళా జడ్జీలతో సిక్కిం తొలిస్థానంలో ఉంది. ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత స్థానంలో (27 శాతం) ఉంది. దిగువ కోర్టుల్లో మరీ అన్యాయంగా ఉందనీ, మొత్తం జడ్జీల్లో స్త్రీలు ఇంచుమించు 28 శాతమని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నివేదించింది. బిహార్ (11.52%), జార్ఖండ్ (13.98%), గుజరాత్ (15.11%), కశ్మీర్ (18.68%), యూపీ(21.4%),ఏపీæ(37.54%)కోర్టుల్లో స్త్రీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉంది. తెలంగాణ లో 44.03 శాతం, పుదుచ్చేరి 41.66 శాతం మహిళా జడ్జీలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment