Bhanumati
-
నా కూతురితో అలా ఉంటాను కాబట్టే...భానుమతి గారు నన్ను అలా చేసేసరికి నాకు
-
ప్రభుత్వంపై ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటున్నా
సాక్షి, అమరావతి: హైకోర్టు ఇచ్చిన వ్యతిరేక తీర్పులను రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా ఆమోదించలేకపోతోందంటూ తాను కౌంటర్లో పేర్కొన్న విషయాలను ఉపసంహరించుకుంటున్నట్లు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ) బీఎస్ భానుమతి బుధవారం హైకోర్టుకు నివేదించారు. విశ్రాంత న్యాయమూర్తి, ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ చైర్మన్ జస్టిస్ వంగా ఈశ్వరయ్య గురించి పొందుపరిచిన విషయాలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. స్పీకర్ తమ్మినేని సీతారాంపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్‌కు సంబంధించి తాను దాఖలు చేసిన కౌంటర్లోని 13వ పేరా మొత్తాన్ని వెనక్కి తీసుకుంటానని తెలిపారు. అలా అయితే దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ కన్నెగంటి లలితలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ► కోవిడ్ వ్యాప్తి నిరోధానికి కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల అమలులో హైకోర్టు విఫలమైందని, అందువల్ల కోర్టు ప్రాంగణాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించేలా ఆదేశించాలంటూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యుడు జె.లక్ష్మీనరసయ్య ఇటీవల పిల్ దాఖలు చేయడం తెలిసిందే. ఈ వ్యాజ్యం విచారణార్హతపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బీఎస్ భానుమతి ప్రాథమిక కౌంటర్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించాలా?వద్దా? అన్న అంశంపై నిర్ణయాన్ని కోర్టు వాయిదా వేసింది. దీనిపై బుధవారం ఉత్తర్వులు జారీ చేసేందుకు సిద్ధం కాగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ స్పందిస్తూ రిజిస్ట్రార్ జనరల్ కౌంటర్లో పేర్కొన్న అంశాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ► హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఓ న్యాయమూర్తి పేరును సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన తరువాత ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదన్నట్లు రిజిస్ట్రార్ జనరల్ కౌంటర్లో పేర్కొన్నారని, ఇది ఏమాత్రం సబబు కాదని ఏజీ కోర్టు దృష్టికి తెచ్చారు. ► న్యాయస్థానాన్ని ఉద్దేశించి స్పీకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై కోర్టు ధిక్కార ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో ఉన్నాయని రిజిస్ట్రార్ జనరల్ కౌంటర్లో పేర్కొన్నారు. మాకు తెలిసినంత వరకు స్పీకర్‌పై ఎలాంటి ప్రొసీడింగ్స్ పెండింగ్‌లో లేవు. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి ఇలాంటి కౌంటర్‌ను ఎవరూ ఆశించరని ఏజీ పేర్కొన్నారు. ► ఈ సమయంలో హైకోర్టు తరఫు న్యాయవాది ఎన్.అశ్వినీకుమార్ స్పందిస్తూ తమ కౌంటర్లోని 13వ పేరా మొత్తాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు నివేదించారు. -
అన్న జనసేన.. తమ్ముడు టీడీపీ!
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మాడుగుల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్న జనసేన నుంచి, తమ్ముడు టీడీపీ నుంచి బరిలో నిలువడం పలు అనుమానాలకు తావిచ్చేలా ఉంది. ఈ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ జి రామానాయుడును తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది. అయితే రామానాయుడు తమ్ముడు సన్యాసినాయుడుకు జనసేన టికెట్ కేటాయించింది. ఈ పరిణామాలపై జనసేనలోని కొందరు నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మాజీ ఎమ్మెల్యే, జనసేన నాయకురాలు అల్లు భానుమతి మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, టీడీపీ టై అప్ అని.. జనసేనలో టీడీపీ కోవర్టులున్నారని ఆరోపించారు. ఎన్నికల ముందుగానీ, తరువాత గానీ ఇద్దరు అభ్యర్థులు కలిసిపోతారని అన్నారు. ప్రజలు అమాయకులని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. జనసేన నిర్ణయం తీవ్ర క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పలు నియోజకర్గాల్లో టీడీపీ, జనసేన టికెట్ల కేటాయింపు గమనిస్తే ఇరు పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందనే విషయం అర్ధమవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానాన్ని జనసేన పొత్తులో భాగంగా వామపక్షాలకు కేటాయించడం టీడీపీ, జనసేనల మధ్య మైత్రికి నిదర్శనమని వారు చెబుతున్నారు. -
సుప్రీం చరిత్రలో మొదటిసారి ముగ్గురు మహిళా జడ్జీలు
-
నేడు సుప్రీంలో మహిళా బెంచ్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో నేడు చరిత్ర పునరావృతం కానుంది. జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన మహిళా ధర్మాసనం కేసుల విచారణ జరపనుంది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా 2013లో జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్‌ల మహిళా ధర్మాసనం ఓ కేసుపై విచారణ జరిపింది. ప్రస్తుత మహిళా జడ్జీల్లో సీనియర్ అయిన జస్టిస్ భానుమతి 2014 ఆగస్టు 13న సుప్రీంకోర్టు జడ్జి అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జస్టిస్ ఇందూ మల్హోత్రా, ఆగస్టులో జస్టిస్ ఇందిరా బెనర్జీ రాకతో సుప్రీంకోర్టులో సిట్టింగ్ మహిళా జడ్జిల సంఖ్య మూడుకు చేరింది. ఏకకాలంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉండటం సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. 39 ఏళ్ల తర్వాత మహిళా జడ్జి.. 1950లో ఏర్పాటైన సుప్రీంకోర్టులో ఓ మహిళ జడ్జిగా నియమితురాలు కావడానికి 39 ఏళ్లు పట్టింది. కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన జస్టిస్ ఫాతిమా బీవీ 1989లో జడ్జిగా సుప్రీంకోర్టులో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత కాలంలో వరుసగా జడ్జీలు సుజాతా మనోహర్, రుమా పాల్, జ్ఞాన్ సుధా మిశ్రా, రంజనా ప్రకాశ్ దేశాయ్, ఆర్.భానుమతి, ఇందూ మల్హోత్రా సుప్రీంకోర్టులో జడ్జీలయ్యారు. దిగువ కోర్టుల్లో 28 శాతమే! సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో మహిళా జడ్జీల సంఖ్య 12 శాతమేనని ప్రభుత్వ గణాంల్లో తేలింది. 7 హైకోర్టుల్లో మహిళా జడ్జి ఒక్కరు కూడా లేరు. 33 శాతం మహిళా జడ్జీలతో సిక్కిం తొలిస్థానంలో ఉంది. ఢిల్లీ హైకోర్టు ఆ తర్వాత స్థానంలో (27 శాతం) ఉంది. దిగువ కోర్టుల్లో మరీ అన్యాయంగా ఉందనీ, మొత్తం జడ్జీల్లో స్త్రీలు ఇంచుమించు 28 శాతమని విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ నివేదించింది. బిహార్ (11.52%), జార్ఖండ్ (13.98%), గుజరాత్ (15.11%), కశ్మీర్ (18.68%), యూపీ(21.4%),ఏపీæ(37.54%)కోర్టుల్లో స్త్రీల ప్రాతినిధ్యం అతి తక్కువగా ఉంది. తెలంగాణ లో 44.03 శాతం, పుదుచ్చేరి 41.66 శాతం మహిళా జడ్జీలు ఉన్నారు. -
ఇంగ్లిష్‌లో మాట్లాడితే... ఆయనకు కోపం వచ్చేది
నేడు బాపు జయంతి ఆ ఇంట్లోకి అడుగు పెట్టగానే బాపు రమణల ఫొటోతో పాటు, ‘వెంకటేశ్వర స్వామి, వినాయకుడు’,‘అర్ధనారీశ్వరులుగా ఉన్న పార్వతి చేతిలో వినాయకుడు’,‘జానకితో జనాంతికం’ కవర్ పేజీ... ఇలా పురాణ గాథల చిత్ర కథల సమాహారంప్రత్యక్షమవుతుంది.ఆయనలాగే ఆయన ఇల్లు కూడా మౌనంగా... మనోహరంగా కనిపిస్తుంది.నేడు బాపు పుట్టిన రోజు సందర్భంగా ఆయన కుమార్తె భానుమతి, చిన్నకుమారుడు వెంకటరమణ, సోదరుడు శంకరనారాయణ సాక్షికి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూ... నాన్న చాలా సెన్సిటివ్ నాన్న పోయినప్పుడు అంతిమయాత్రలో అందరూ చెయ్యివేస్తుంటే, నాన్న ఎంత సెలబ్రిటీనో అనిపించింది. ఏదైనా స్తోత్రం చదువుతుంటే, నాన్న వేసిన అమ్మవారు, వైకుంఠం అన్నీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తాయి. అన్నీ నాన్న చెప్పినవే. చిన్నప్పుడు సెలవుల్లో అందరి భోజనాలు అయ్యాక, అందర్నీ చుట్టూ కూర్చోబెట్టుకుని, రామాయణం కథలు చెప్పేవారు. వాస్తవానికి నాన్న చాలా సరదాగా ఉంటారు. అయితే ఆయన బొమ్మలు వేసుకుంటూ ఉండటం వల్ల ఆయన్ను డిస్టర్బ్ చేసేవాళ్లం కాదు. మా చిన్నమ్మాయి లాస్య అంటే నాన్నకు ఎంతో ఇష్టం. డిస్నీ కార్టూన్ వేసి మరీ చూపించేవారు. మా అందరిలోకీ పెద్ద తమ్ముడు కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. నేను, చిన్న తమ్ముడు మాత్రం నాన్నతో మాట్లాడటం బాగా తక్కువ. నాన్న కూడా ఇంటి విషయాలన్నీ మా పెద్ద తమ్ముడితోనే షేర్ చేసుకునేవారు.నాన్న చాలా సెన్సిటివ్. తనతో మాట్లాడేవారి గొంతులో కొంచెం తేడా వచ్చినా చాలా బాధపడేవారు. ఆయన పని ఆయనే చేసుకోవాలి. కనీసం భోజనం చేసేటప్పుడు మేం వడ్డిద్దామన్నా ఆయనకు నచ్చేది కాదు. ఆయనకు కావలసింది ఆయనే వేసుకుంటారు. ఏదైనా బొమ్మ వేస్తుంటే ఆ ఫీలింగ్ ఆయన ముఖంలో కనిపించేది.‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి. వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడాలి. బాగా బోల్డ్‌గా ఉండాలి’ అనేవారు. మగపిల్లలనయినా ఎప్పుడైనా కొట్టేవారేమో కాని, నన్ను ఎప్పుడూ ఏమీ అనేవారు కాదు. అందరూ కలిసిమెలిసి ఉండాలనేవారు. ఎవరైనా ఇంగ్లిషులో మాట్లాడితే ఆయనకు కోపం వచ్చేది. తెలుగు, చదువు, సంగీతం... ఈ మూడే మనం పెద్దవాళ్లమయినప్పుడు మనతో ఉంటాయి అనేవారు. తిరుపతిలో జరిగే నాన్న జన్మదిన వేడుకలకి 15 మంది వెళ్తున్నాం. గతంలో భద్రాచలం వెళ్లినప్పుడు కూడా సుమారు 15 మంది దాకా వెళ్లాం. - భానుమతి, కూతురు మంచి కథలు చెప్పేవారు నాన్న దగ్గర మాకు చనువు బాగా తక్కువ. ఆయన ఎప్పుడూ ఏవో బొమ్మలు వేసుకుంటూ, చదువుకుంటూ ఉండేవారు. అందుకని ఆయనను డిస్టర్బ్ చేయొద్దని అమ్మ చెబుతుండేది. కాని... మా చిన్నతనంలో నాన్న మంచి మంచి కథలు చెప్పేవారు. ముఖ్యంగా రామాయణం చెప్పేవారు. చెన్నైలో షూటింగ్ ఉంటే అయిపోయాక ఇంటికి వచ్చి మాతోనే గడిపేవారు. నాన్న ఆఖరి రోజుల్లో మాత్రం కొంచెం దగ్గరగా ఉన్నాను. నాన్న ప్రతి సినిమా ప్రివ్యూకీ మా అందరినీ తీసుకువెళ్లేవారు. రాజమండ్రి లాంటి ప్రదేశాల్లో షూటింగ్ జరుగుతుంటే మేము, మామ (ముళ్లపూడి వెంకట రమణగారిని మామా అని పిలుస్తారు) పిల్లలు మొత్తం ఆరుగురం, అమ్మ (భాగ్యవతి), అత్త (రమణగారి శ్రీమతి శ్రీదేవి) అందరం కలిసివెళ్లేవాళ్లం. అయితే అక్కడ షూటింగ్ స్పాట్లో కాకుండా, మేమంతా వేరేచోట ఉండేవాళ్లం. నాన్న ఏది పెట్టినా మాట్లాడకుండా తినేవారు. ‘ఎప్పుడూ అందరూ కలిసి ఉండాలే కానీ విడిపోకూడదు’ అని చెప్పేవారు నాన్న. విడివిడిగా ఉండటమంటే నాన్నకి నచ్చదు. ఏదైనా పని మొదలుపెడితే ఆ పని పూర్తయ్యేవరకు ఆయనకు తోచదు. ఎవరైనా ఫలానా టైమ్‌కి ఇంటికి వస్తామంటే ఆ టైమ్‌కి రెడీ అయిపోయి మేడ మీద నుంచి, కిందకు దిగి కూర్చునేవారు. వస్తామన్న వాళ్లు కనుక ఆ టైమ్‌కి రాకపోతే, చాలా అసహనంగా ఉండేవారు. అంతా పంక్చువల్‌గా, పర్ఫెక్ట్గా అయిపోవాలి ఆయనకు. నాన్న, మామ మాట్లాడుతుంటే అందరం కూర్చుని సరదాగా వింటుండేవాళ్లం. నాన్నకి పుట్టినరోజు, షష్టిపూర్తి వంటి వేడుకలు చేసుకోవడమంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఇంట్లో మాత్రం అందరం కలిసి సరదాగా పండగలా చేసుకునేవాళ్లం. - వెంకటరమణ, చిన్నకుమారుడు కొత్త పుస్తకం వస్తే చాలు... మా నాన్నగారికి గాంధీజీ అంటే ఇష్టం. అందుకే మా అన్నయ్యని చిన్నతనం నుంచీ బాపు అని పిలిచేవారు. అన్నయ్య చిన్నప్పటి నుంచీ చాలా సెలైంట్. మా తాతగారు చిన్నతనంలోనే పోయారు. దాంతో నా బాధ్యత బాపు అన్నయ్య మీదే పడింది. అన్నయ్యే నన్ను డిగ్రీలో వివేకానంద కాలేజీలో చేర్పించాడు. అన్నయ్యకి చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. అన్నయ్య, రమణ అన్నయ్య కలిసి ఎన్ని సినిమాలు చూశారో లెక్కలేదు. అంతేకాదు, ఎక్కడ ఏ పుస్తకం కనిపించినా సరే అది కొని చదవాల్సిందే. పాత పుస్తకాల కోసం మూర్ మార్కెట్‌కి వెళ్లేవారు. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తుంటే, కార్టూన్ బుక్స్ తీసుకురమ్మని చెప్పేవారు. హిగిన్ బాథమ్స్ షాపుకి వెళ్లి ఖరీదైన పుస్తకాలు కొనేవారు. కొన్నాళ్లయ్యాక వాళ్లకి బాగా అలవాటైపోయి, ఏ కొత్త పుస్తకం వచ్చినా, ఎంత ఖరీదైనదైనా సరే మా ఇంటికి పంపేవారు. పుస్తకాలు కొనడానికి ఎంత డబ్బు ఖర్చుచేయడానికైనా వెనకాడడు అన్నయ్య. నేను ఒకసారి భద్రాచలం వెళ్లినప్పుడు ఒక రాములవారి బొమ్మ కొనితెచ్చి ఇచ్చాను. ఆ బొమ్మను అన్నయ్య తన మందిరంలో పెట్టుకున్నాడు.ఎవరిదైనా మంచి కథ చదివినప్పుడు, మంచి బొమ్మ చూసినప్పుడు వాళ్ల అడ్రస్ కనుక్కుని వాళ్లకి ఫోన్ చే సి అభినందించేవారు. ఎవరికైనా కొరియర్ పంపించాలన్నా ఎంతో నీట్‌గా ప్యాక్ చేసి, ముత్యాల లాంటి అక్షరాలతో రాసేవారే కానీ, చెత్తచెత్తగా చేయడమంటే ఆయనకు నచ్చదు. మా నాన్నగారికి ఉన్న కోపమే అన్నయ్యకూ వచ్చింది. అయితే వచ్చిన కోపం హారతి కర్పూరంలా వెంటనే కరిగిపోయేది. ఎవరైనా సన్మానం చేసి సన్మానపత్రం ఇచ్చి ఫోటో స్టిల్ ఇవ్వమంటే, ముఖానికి అడ్డంగా సన్మానపత్రం ఉంచుకునేవారు. వాళ్లు ‘అయ్యా కాస్త కిందకి దించండి’ అనేవారు. అన్నయ్య కారు చాలా స్పీడ్‌గా నడుపుతారు. నా బొమ్మలు చూసి లోపాలు సరిచెప్పేవారు. మా ఇంట్లో శుభకార్యాలన్నీ అన్నయ్య ఇంట్లోనే జరిగేవి. నేను అన్నయ్య, రమణ ముగ్గురం సొంత అన్నదమ్ముల్లా ఉండేవాళ్లం. - శంకర నారాయణ, తమ్ముడు ప్రాతః స్మరణీయుడు మన తెలుగుజాతి వైభవాన్ని, సంస్కృతిని, మన విభిన్న కళారూపాల విస్తృత సౌరభాన్ని వేవేల కోణాల్లో, వెల కట్టలేని అందాలతో, అవకాశమున్న అన్ని మాధ్యమాల్లోనూ, దాదాపు ఏడు దశాబ్దాల పాటు అవిశ్రాంతంగా ఆవిష్కరించిన మహనీయ కళాకారుడు బాపు, నిస్సందేహంగా మనందరికీ ప్రాతః స్మరణీయుడే. మన తెలుగు భాష నుడికారాన్ని మహిమాన్విత మణిహారంగా తీర్చిదిద్ది, మరే భారతీయ భాషకూ అబ్బని అపురూప సౌరభాన్ని, సొగసును మన భాషకు కూర్చిన బాపుకి మరెవరైనా దీటు రాగలరా! అనుక్షణం మన ముందు కదలాడే అతి సాధారణ వ్యక్తుల్నీ, పెద్దగా కంటికానని పరిసర వాతావరణాన్ని, మరే కెమేరా పట్టలేని తనదైన ప్రత్యేక దృక్కోణంలో, పరమాద్భుత మనిపించేలా, పటం కట్టిన పంచవర్ణ చిత్రాలుగాను, సృష్టికందని సజీవ చలన చిత్రాలుగానూ మలచిన బాపుని మరెవరైనా తోసిరాజనగల రా! అసలు సిసలు తెలుగందాలు, మన అతివల చీరకట్టులోనూ, కాటుక బొట్టులోనూ, వారి ముద్దొచ్చేవాల్జడల్లోనూ, మురిపించే మూతి విరుపుల్లోనూ, ముంగిట్లో ముగ్గేస్తున్న మన ముద్దరాళ్ల భంగిమల్లోనూ... అసలుకన్నా మధురంగా చూపిస్తూ సమ్మోహనపరచే బాపులాంటి అద్భుతం మనకే స్వంతం - అంటే ఎవరైనా కాదనగలరా! వెనక నుంచి భజంత్రీలు వినబడుతున్నాయి... కాబట్టి బాపు అనగానే శ్రీరాముడూ, శ్రీరాముణ్ణి తలిస్తే బాపు స్ఫురించేంత లోతుగా ఆ పరమాత్ముడితో మమేకమైన బాపు మనకి నిత్య ప్రాతః స్మరణీయుడు కాక మరింకేవిటి... - శంకు, ప్రముఖ కార్టూనిస్టు -
వెండితెరకు వజ్రాన్ని అందించిన వరవిక్రయం
ఆత్మాభిమానానికి, అఖండ కళా వైభవానికి పర్యాయపదం భానుమతి రామకృష్ణ. కళ అనేది దైవదత్తమైన వరం. అయితే... భానుమతికి దైవం వరమివ్వలేదు. వరాలిచ్చాడు. నటన, నర్తన, రచన, గానం, స్వరసారథ్యం, దర్శకత్వం, నిర్మాణం, స్టూడియో నిర్వహణ... ఇవన్నీ భానుమతికి దేవుడిచ్చిన వరాలే. అందుకే... ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. మనదేశంలో తొలి భారతీయ మహిళా దర్శకురాలు భానుమతి రామకృష్ణ. దక్షిణాదిన ద్విత్రాభినయం చేసిన తొలి కథానాయిక భానుమతి రామకృష్ణ. ఒకేసారి మూడు భాషల్లో చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించి అఖండ విజయాన్ని అందుకున్న తొలి సూపర్‌స్టార్ భానుమతి రామకృష్ణ. భిన్న రంగాల్లో ప్రతిభను కనబరచి మేధావుల్ని సైతం విస్తుపోయేలా చేసిన ఘనాపాటి భానుమతి రామకృష్ణ. ఇలా... సినీరంగంలో భానుమతి సృష్టించిన చరిత్రలెన్నో. ఈ రోజు భానుమతి వర్ధంతి కాదు, జయంతి అంతకన్నా కాదు. మరి ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఎందుకంటే... ఆ మహానటి తొలిచిత్రం ‘వరవిక్రయం’ విడుదలై నేటికి 75 ఏళ్లు. 1939 ఏప్రిల్ 14న విడుదలైందీ సినిమా. అప్రతిహతమైన సినీ ప్రస్థానాన్ని సాగించి, తనకు ప్రత్యామ్నాయమే లేనంత ఎత్తుకు ఎదిగిన భానుమతి తొలి అడుగు ఎలా పడిందో తెలుపడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఇది. భానుమతి పుట్టింది ప్రకాశం జిల్లా దొడ్డవరం గ్రామంలో. తల్లి పేరు సరస్వతమ్మ. అంటే భౌతికంగా కూడా భానుమతి సరస్వతీ పుత్రురాలే. తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్య రంగస్థల నటుడు. ఓ విధంగా కళలు తండ్రి నుంచే భానుమతికి సంక్రమించాయని చెప్పాలి. బాల్యంలోనే భానుమతి బాగా పాడేవారు. కుమార్తెలోని ప్రజ్ఞను గమనించి సంగీత పాఠశాలలో చేర్పించారు వెంకటసుబ్బయ్య. ఎలాగైనా... తన కుమార్తెను ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అంత గాయనిని చేయాలని ఆయన ఆకాంక్ష. అయితే... ఆయన ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచాడు. వెంకటసుబ్బయ్యకు ప్రసిద్ధ నటుడు గోవిందరాజుల సుబ్బారావు మంచి మిత్రుడు. ఓ సారి పనిమీద ఆయన ఇంటికొచ్చారు. యుక్తవయసులో పుత్తడిబొమ్మలా మెరిసిపోతున్న భానుమతిని చూశారు. గానం ఆమెకు ఆభరణం అని తెలుసుకొని, ఈ వజ్రం వంటింటికే పరిమితం కాకూడదనుకున్నారు. నేరుగా వెళ్లి దర్శకుడు సి.పుల్లయ్యను కలిశారు. భానుమతి గురించి, ఆమె ప్రజ్ఞ గురించి వివరించారు. అంతే... తన ప్రొడక్షన్ మేనేజర్ని దొడ్డవరం పంపించారు పుల్లయ్య. తన కుమార్తెకు సి.పుల్లయ్య అంతటి వారి నుంచి కబురు రావడంతో వెంకటసుబ్బయ్య కూడా కాదనలేకపోయారు. భానుమతి మాత్రం అందుకు ససేమిరా అన్నారు. నటించడం ఇష్టం లేదని కరాఖండీగా చెప్పేశారు. వెంకటసుబ్బయ్య కుమార్తెను వారించారు. ‘సి.పుల్లయ్య అంతటి వారు కబురు చేస్తే కాదనకూడదు’ అని నచ్చజెప్పి, ఆ ప్రొడక్షన్ మేనేజర్ వెంట భానుమతిని తీసుకొని నడిచారు. ఇంతకీ ఆ ప్రొడక్షన్ మేనేజర్ ఎవరో చెప్పలేదు కదూ.. తను ఎవరో కాదు ‘పద్మశ్రీ రేలంగి వెంకట్రామయ్య’. ఎట్టకేలకు పుల్లయ్య ఎదుట నిలబడ్డారు భానుమతి. తనకు అవకాశం రాకూడదని అప్పటికే ఇష్టదైవాలందరికీ మొక్కారామె. కానీ అంతకు ముందే దైవం డిసైడ్ అయిపోయాడు. భారతీయ సినిమాకు అది నిజంగా ఓ చారిత్రాత్మక ఘట్టం. భానుమతిని ఓ పాట పాడమన్నారు పుల్లయ్య. భానుమతికి ఓ వైపు భయం, మరోవైపు సిగ్గు. అందుకే... తన తండ్రి వైపే చూస్తూ... ఓ కీర్తనను ఆలపించారు. అక్కడున్న వారందరూ ఆ గానానికి ముగ్ధులైపోయారు. పాడుతున్నప్పుడు ఆమె హావభావాలనే గమనించారు పుల్లయ్య. ‘ఎస్... నాకు కావాల్సింది కచ్చితంగా ఇలాంటి అమ్మాయే.. కాదు కాదు, ఈ అమ్మాయే’ అనేశారు. భానుమతి షాక్. అంటే... సెలక్ట్ అయిపోయానా? అని బాధ. ఈస్టిండియా కంపెనీవారు సి.పుల్లయ్య దర్శకత్వంలో ‘వరవిక్రయం’ అనే సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో ‘కాళింది’ అనే పాత్ర భానుమతిని వరించింది. నెలకు 150 రూపాయలు జీతం. మొత్తానికి అయిష్టంగానే అంగీకరించారు భానుమతి. కోల్‌కత్తాలో షూటింగ్. దర్శకుడు ‘లైట్స్ ఆన్’ అనగానే ఒక్కసారి చుట్టూ లైట్లు. ఆ కాంతి చూసి భానుమతి తెగ భయపడిపోయేవారు. భయం భయంగానే ఆ పాత్ర పోషించారు. సినిమా విడుదలైంది. అఖండ విజయం సాధించింది. భానుమతి పేరు తెలుగు నేలంతా ప్రతిధ్వనించింది. ఇక వరుస అవకాశాలు... అఖండ విజయాలు. రాత్రికి రాత్రి సూపర్‌స్టార్ అయిపోయారు భానుమతి. ఇక ఆ తర్వాత ఆమె సాధించిన ఘనత అందరికీ తెలిసిందే. తడబడుతూ వేసిన ఆ తొలి అడుగే... తర్వాత కాలంలో తన సరసన నటించే మహా మహా నటులను కూడా తడబడేట్లు చేస్తుందని ‘వరవిక్రయం’ సెట్లో ఎవరూ ఊహించి ఉండరు. దటీజ్ భానుమతి రామకృష్ణ. భౌతికంగా ఆ మహానటి మన మధ్య లేకపోయినా.. సినిమా ఉన్నంతవరకూ మానసికంగా ఆమె బ్రతికే ఉంటారు. - బుర్రా నరసింహ -
గీత స్మరణం
పల్లవి : సన్నజాజి తీవలోయ్... సంపంగి పూవులోయ్... చిలిపి సింగారులోయ్... పాపలు సిరులొలికే చిన్నారులోయ్... ॥ చరణం : 1 కన్నుల విందులోయ్ వెన్నెల చిందులోయ్ పచ్చని బ్రతుకులో పన్నీటి జల్లులోయ్ బాలల సందడే పరువూ వేడుకా ఇలు వాసికి మరో పేరు ఈ చిన్నారులే ॥ చరణం : 2 లోగిలి బలిమే బాలల నవ్వులూ ఇల్లాలి కలిమే పిల్లల కిలకిలా ఊరికి పండుగే ఇంటను ఊయలా సిరిసంపద మరో పేరు ఈ చిన్నారులే ॥ చరణం : 3 దాగుడుమూతలాడితే సూరీడు మెచ్చేను చెమ్మచెక్కలాడితే చందమామ మెచ్చేను చెమ్మ చెక్క చారెడేసి మొగ్గ ఇల్లుదీసి పందిరేసి పకపకలాడితే పిల్లలున్న లోగిలిని దేవుడే మెచ్చేను ॥ చిత్రం : అనురాగం (1963) రచన : మల్లాది రామకృష్ణశాస్త్రి సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు గానం : భానుమతి సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు), పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034, మెయిల్: sakshi.features@gmail.com