ఇందిరా బెనర్జీ, వినీత్ శరణ్, కేఎం జోసెఫ్
న్యూఢిల్లీ: ముగ్గురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీచేశారు. పదోన్నతి పొందిన వారిలో ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వినీత్ శరణ్ ఉన్నారు. ఈ నియామకాలకు సంబంధించిన వారెంట్లపై కోవింద్ శుక్రవారం సంతకం చేయగా, శనివారం అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం జడ్జీల సంఖ్య 25కు పెరిగింది. మహిళా జడ్జీల సంఖ్య మూడుకు చేరింది. జస్టిస్ ఇందిరా బెనర్జీ కొత్తగా చేరబోతుండగా, జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రా ఇది వరకే జడ్జీలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మహిళలు సుప్రీంకోర్టు జడ్జీలుగా ఉండటం ఇదే తొలిసారి. సుప్రీంకోర్టు చరిత్రలో జస్టిస్ ఇందిరా బెనర్జీ 8వ మహిళా జడ్జి కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment