సీజేగా ఇందిరా బెనర్జీ
► ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్
► బాధ్యతల స్వీకరణ
► అందరి ఎదురుచూపుల మేరకు విధులు నిర్వర్తిస్తా
► కొత్త సీజే వ్యాఖ్య
► తమిళం నేర్చుకోవాలని ఆశ
మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (సీజే) ఇందిరా బెనర్జీ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలో ఆమె చేత రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అందరి ఎదురు చూపుల మేరకు విధుల్ని నిర్వర్తిస్తానని, చట్ట నిబంధనలు, శాసనాల మేరకు నడుచుకుం టానని ఇందిరా బెనర్జీ వ్యాఖ్యానించారు.
సాక్షి, చెన్నై : మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సంజయ్ కిషన్ కౌల్ ఫిబ్రవరిలో పదోన్నతిపై సుప్రీం కోర్టుకు వెళ్లారు. అప్పటి నుంచి ఆ పదవి ఖాళీగానే ఉంది. తాత్కాళిక ప్రధాన న్యాయమూర్తిగా సీనియర్ న్యాయవాది రమేష్ వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో కోలకతాకు చెందిన ఇందిరా బెనర్జీని మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. మద్రాసు హైకోర్టులో రెండు దశాబ్దాల అనంతరం మహిళా ప్రధాన న్యాయమూర్తి నియమించ డంతో సర్వత్రా ఆహ్వానించారు.
1992లో శాంతాకుమారి పట్నాయక్ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ప్రస్తుతం రెండో మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన ఇందిరా బెనర్జీ కోల్‌కతాలో పుట్టి పెరిగారు. 1985లో న్యాయవాద వృత్తిలో అడుగు పెట్టారు. 2002లో కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. గత నెల సీనియర్ హోదాను దక్కించుకున్నారు. ప్రస్తుతం మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై నియమితులయ్యారు.
ప్రమాణ స్వీకారం : కొత్త సీజే ప్రమాణ స్వీకారం రాజ్ భవన్‌లో ఉదయం జరిగింది. రాష్ట్రపతి ఆమోదంతో వచ్చిన సీజే నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ ఈ వేడుకలో చదివి వినిపించారు. తదుపరి కొత్త సీజే ఇందిరా బెనర్జీకి రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పుష్పగుచ్ఛం అందించి శుభాకంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడపాడి కే పళనిస్వామి, న్యాయ శాఖ మంత్రి సీవీ షణ్ముగం, సీనియర్ న్యాయమూర్తి రమేష్, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ అధికారులు, అడ్వకేట్ జనరల్ ముత్తుకుమార స్వామి, అదనపు అడ్వకేట్ జనరల్ మణి శంకర్, సీనియర్ న్యాయవాదులు ఈ వేడుకకు హాజరై కొత్త సీజేకు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
అందరి ఎదురు చూపుల మేరకు విధులు : ప్రమాణ స్వీకారం అనంతరం హైకోర్టుకు చేరుకున్న ఇందిరా బెనర్జీ బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆమెకు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతు ప్రసంగాలు సాగాయి. అనంతరం ఇందిరా బెనర్జీ ప్రసంగిస్తూ, సంస్కృతి సంప్రదాయాలకు నెలవుగా ఉన్న తమిళనాడులో, చరిత్ర ప్రసిద్ధి చెందిన మద్రాసు హైకోర్టులో పనిచేసే అవకాశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రాచీన తమిళ భాషను నేర్చుకోవాలన్న ఆశ కల్గుతుందని, నేర్చుకుంటానని వ్యాఖ్యానించారు.
పర్యాటకా ప్రాంతాల్లో చూసేందుకు తమిళనాడుకు ఇది వరకు వచ్చానని, ఇప్పుడు జీవన పయనంలో విధులు నిర్వర్తించేందుకు వచ్చానని పేర్కొన్నారు. అందరి ఎదురు చూపులు మేరకు, శాసనాలు, చట్టాలకు లోబడి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానన్నారు. మద్రాసు హైకోర్టు తీర్పులు ఎన్నో హైకోర్టులకు మార్గదర్శకంగా, ఆదర్శంగా ఉన్నాయని, అలాంటి ఈ కోర్టులో పూర్తి స్థాయిలో తన విధులు, బాధ్యతల్ని నిర్వర్తించేందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరం అని, అందరూ సహకరిస్తాన్న నమ్మకంతో ఉన్నట్టు ముగించారు.