కేరళ వరద బాధితులకు నిధుల సేకరణ కార్యక్రమంలో పాటలు పాడుతున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ కురియన్ జోసెఫ్
న్యూఢిల్లీ: సంక్షోభ సమయాల్లో మానవీయంగా స్పందించగలమని, అందుకు అవసరమైతే మైక్ పట్టుకుని పాటలు కూడా పాడగలమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిరూపించారు. కేరళ వరద బాధితుల సహాయార్థం సోమవారం సుప్రీంకోర్టు జర్నలిస్ట్‌లు చేపట్టిన నిధుల సేకరణ కార్యక్రమంలో జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ కురియన్ జోసెఫ్ తమ గాత్ర ప్రావీణ్యాన్ని చూపారు. ఈ ఇద్దరు జడ్జీలు కేరళకే చెందినవారు కావడం గమనార్హం. మలయాళ క్లాసిక్ సినిమా ‘అమరం’లోని మత్స్యకారుల జీవనాన్ని వర్ణించే ఓ పాటను కేఎం జోసెఫ్ పాడారు.
‘కేరళలో వరద బాధితుల సహాయానికి ముందు స్పందించింది మత్స్యకారులే. అందుకే వారి కోసం ఈ పాట’ అని జస్టిస్ జోసెఫ్ అన్నారు. గాయకుడు మోహిత్ చౌహాన్‌తో కలిసి ‘వి షల్ ఓవర్‌కమ్ సమ్‌డే’ అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్ ఆలపించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, పలువురు ఇతర జడ్జీలు, జర్నలిస్ట్‌లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రూ. 10 లక్షలకు పైగా విరాళాలు వసూలయ్యాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరూ రూ. 25 వేల చొప్పున, కోర్టు ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని విరాళంగా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment