న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ నియామక వివాదం మరో మలుపు తిరిగింది. జోసెఫ్ నియామకాన్ని ఆమోదించిన కేంద్రం.. తాజాగా శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆయన సీనియారిటీని తగ్గించింది. కొలీజియం తొలుత జస్టిస్ జోసెఫ్ పేరును, ఆతర్వాత జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌ల పేర్లను సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. కానీ కేంద్రం మాత్రం జోసెఫ్ పేరును జాబితాలో మూడోస్థానంలో ఉంచుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిబంధనల ప్రకారం మొదటగా కొలీజియం సిఫార్సు చేసిన పేర్లనే నోటిఫికేషన్‌లో ప్రాధాన్యతా క్రమంలో ప్రచురించాలి. దీంతో కేంద్రం చర్యపై కొలీజియం సభ్యులు సహా పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శాసన, న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న లక్ష్మణరేఖను ప్రభుత్వం దాటిందని మండిపడుతున్నారు. ఈ విషయమై జడ్జీలు సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాను సోమవారం కలసి ఫిర్యాదు చేయనున్నారు.
ముగ్గురు జడ్జీలు ప్రమాణస్వీకారం చేసేలోపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సీజేఐపై ఒత్తిడి తీసుకురానున్నారు. జడ్జీలతో పాటు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కూడా ఈ విషయమై దీపక్ మిశ్రాతో నేడు సమావేశమై ఈ విషయంలో తమ అభ్యంతరాలను సీజేఐ ముందు ఉంచనుంది. ప్రసుత్తం దేశవ్యాప్తంగా న్యాయమూర్తుల సీనియారిటీలో జస్టిస్ జోసెఫ్ 45వ స్థానంలో ఉన్నారు.
ఈ ఏడాది ఆరంభంలో జస్టిస్ జోసెఫ్ పేరును కొలీజియం సిఫార్సు చేయగా.. ఇతర రాష్ట్రాల నుంచి సుప్రీంకు తగిన ప్రాతినిధ్యం లేదంటూ ఆ ప్రతిపాదనను కేంద్రం తిప్పిపంపింది. దీంతో జోసెఫ్ పేరును కొలీజియం మరోసారి ఆమోదించి పంపడంతో మరో మార్గం లేక కేంద్రం ఆమోదించింది. అయితే మిగతా ఇద్దరు జడ్జీల కంటే ఆయన్ను జూనియర్‌గా చేస్తూ శనివారం నోటిఫికేషన్ ఇచ్చింది. అంతకుముందు ఆగస్టు 3న రాష్ట్రపతి కోవింద్ జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్‌లను సుప్రీం జడ్జీలుగా నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు.
దీంతో ఇద్దరు న్యాయమూర్తుల కంటే జస్టిస్ జోసెఫ్ జూనియర్‌గా మారారు. 2016లో ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఉత్తరాఖండ్‌లో విధించిన రాష్ట్రపతి పాలనను జోసెఫ్ ఉత్తరాఖండ్ హైకోర్టు జడ్జీగా కొట్టివేశారు. ఈ కారణంగానే ఆయన పదోన్నతికి ప్రభుత్వం అడ్డుతగులుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. కేంద్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. కాగా, జస్టిస్ జోసెఫ్, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ సరన్ మంగళవారం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment