సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేరుకు కేంద్రం ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ నియామకానికి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదం తెలిపింది. సుప్రీం న్యాయమూర్తిగా జోసెఫ్ నియామకంపై కొద్ది కాలంగా కేంద్రం, సుప్రీం కొలీజియంల మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి 10న సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల నియామకంపై సుప్రీం కోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. అయితే మల్హోత్రా నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం జోసెఫ్‌ను సుప్రీం న్యాయమూర్తిగా ప్రమోట్ చేసేందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ జోసెఫ్ పేరును పున:పరిశీలించాలని కొలీజియంను కోరింది.
సుప్రీం న్యాయమూర్తిగా జోసెఫ్ నియామకాన్ని తిరిగి పరిశీలించాలని కొలీజియం జులై 16 కేంద్రానికి తేల్చిచెప్పింది. కొలీజియం నిర్ణయంతో వెనక్కితగ్గిన కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధాన న్యాయమూర్తిగా జస్టిస్ కేఎం జోసెఫ్ పేరును ఆమోదించింది. జోసెఫ్‌తో పాటు మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వినీత్ శరణ్‌లను కూడా సుప్రీం న్యాయమూర్తులుగా నియమించేందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది.
Comments
Please login to add a commentAdd a comment