ఢిల్లీ: సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి.. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా మరోసారి బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గతంలోనూ అటార్నీ జనరల్‌గా సేవలందించిన ఆయన.. 2017లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆయన బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రోహత్గి తదనంతరం కేకే వేణుగోపాల్ ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే.. వేణుగోపాల్ పదవీకాలం సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో.. తర్వాతి అటార్నీ జనరల్‌గా మళ్లీ ముకుల్ రోహత్గినే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
వాజ్‌పేయి టైంలోనూ అదనపు సోలిసిటర్ జనరల్‌గానూ పని చేసిన రోహత్గిని.. తిరిగి అటార్నీ జనరల్‌గా నియమించడం దాదాపు ఖాయమైనట్లేనని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. వేణుగోపాల్(91) 2020లోనే బాధ్యతలు నుంచి తప్పుకోవాలనుకున్నారు. వయోభారం రిత్యా తనను తప్పించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం మాత్రం ఆయన్నే మరో దఫా కొనసాగాలని కోరింది. అయితే.. ఆ సమయంలోనే ఆయన రెండేళ్లపాటు మాత్రం ఉంటానని స్పష్టం చేశారు.
ఇక గతంలో.. గుజరాత్ అల్లర్ల కేసుతో పాటు ప్రముఖ కేసులకు ప్రభుత్వాల తరపున వాదించారు ముకుల్ రోహత్గి. 2014లో అధికారంలోకి రాగానే ఏరికోరి బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం, అటార్నీ జనరల్‌గా రోహత్గిని నియమించుకుంది. 2017లో అటార్నీ జనరల్ పదవి నుంచి ఆయన్ని తప్పించి.. జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370 రద్దు పరిశీలన కోసం, ఇంకా కొన్ని సున్నితమైన అంశాల కోసం ఆయన సేవల్ని వినియోగించుకుంది. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ వ్యవహారం కేసులో వాదించిన డిఫెన్స్ టీం బృందానికి నేతృత్వం వహించింది కూడా ఈయనే.
ఇదీ చదవండి: హింసాద్వేషాలు దేశ సమస్యలకు పరిష్కారం కాదు
Comments
Please login to add a commentAdd a comment