న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలో మార్పులు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలని కేంద్రం దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. దళితుల హక్కుల పరిరక్షణకు, ఆ వర్గాలపై దాడులకు పాల్పడే దోషులకు శిక్షలు విధించేందుకు 100 శాతం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. మార్చి 20 నాటి తన తీర్పును సమర్థించుకుంటూ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే ఆ ఉత్తర్వులు జారీచేసినట్లు వెల్లడించింది.
ఈ తీర్పు అనంతరం జరిగిన అల్లర్ల వల్ల ప్రాణ నష్టం జరిగినందున, తమ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కోర్టును కోరారు. పార్లమెంట్ రూపొందించిన చట్టాలను తోసిరాజని అత్యున్నత కోర్టు నిబంధనలు, మార్గదర్శకాలు జారీచేయరాదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై సమీక్ష కోరుతూ కేంద్రం ఏప్రిల్ 2న పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద నిందితులను తక్షణం అరెస్టు చేయకూడదంటూ సుప్రీంకోర్టు ప్రకటించిన తరువాత పాటించిన భారత్ బంద్‌లో హింస చెలరేగి 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment