నూతన అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్!
- దాదాపుగా ఖరారైన పేరు.. త్వరలో నోటిఫికేషన్
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయాధికారి(అటార్నీ జనరల్)గా సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ పేరును కేంద్ర ప్రభుత్వం ఖరారుచేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు అతిత్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. పదవీ కాలాన్ని పొడిగించినా ఏజీగా కొనసాగేందుకు ముకుల్ రోహత్గీ నిరాకరించడంతో ఆయన వారసుడి ఎంపిక అనివార్యమైంది. ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనకు వెళ్లడానికి ముందే వేణుగోపాల్‌ను పిలిపించుకుని మాట్లాడారని జాతీయ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
86ఏళ్ల వేణుగోపాల్ స్వస్థలం కేరళ. దేశంలో హై-ప్రొఫైల్ కేసులు వాదించే లాయర్లలో అగ్రగణ్యుడిగా పేరుపొందిన ఆయన బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ నాయకుల తరుఫున, 2జీ స్పెక్ట్రం కేసులో ప్రాసిక్యూషన్ తరఫున ఆయన బలమైన వాదనలు వినిపించారు.
కాగా, ఏజీగా పేరు ఖరారైందన్న వార్తలపై వేణుగోపాల్ ఆచితూచి స్పందించారు. ‘నియామకపు నోటిఫికేషన్ వెలువడిన తర్వాతే అన్ని విషయాలు మాట్లాడతా’నని తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అన్నారు. న్యాయరంగంలో చేసిన కృషికిగానూ 2015లో వేణుగోపాల్‌కు రెండో అత్యున్నత పౌరపురస్కారం ‘పద్మ విభూషణ్’ను అందించారు.