న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు అందే నిధుల్లో పారదర్శకత పెంచే లక్ష్యంతో జారీ చేస్తున్న ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేదెవరో తెలియనప్పుడు ఎన్నికల్లో నల్లధనాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ ప్రయత్నాలు వృథా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్టోరల్ బాండ్ల జారీని నిలిపివేయాలి లేదా బాండ్లను కొనుగోలు చేసే వారి వివరాలను బహిర్గతం చేయాలంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్(ఏడీఆర్) సంస్థ వేసిన పిటిషన్‌పై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఎన్నికల్లో నల్లధనం కట్టడికే ప్రభుత్వం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు అటార్నీ జనరల్(ఏజీ) కేకే వేణుగోపాల్ తెలిపారు. ఈ సమయంలో సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోరాదని, ఎన్నికల తర్వాతే ఈ విధానం పనిచేస్తుందా లేదా అనేది పరిశీలించాలని కోరారు. అయితే, బాండ్ల కొనుగోలు దారుల వివరాలు బ్యాంకులకు తెలుస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి వేణుగోపాల్.. అతని వివరాలు తెలిసినప్పటికీ ఏ బాండ్ ఏ పార్టీకి అందిందో తెలపడం కష్టమని బదులిచ్చారు.
అలాంటప్పుడు, ఆదాయపన్ను చట్టాల్లో లొసుగుల ఆధారంగా నల్లధనాన్ని నియంత్రించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు వృథాయే కదా అని ధర్మాసనం పేర్కొంది. చెక్కులు, డిమాండ్ డ్రాఫ్టులు, ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా మాత్రమే అసలైన డబ్బు బాండ్ల కొనుగోలు దారుల ద్వారా బ్యాంకులకు చేరుతుందని ఏజీ వేణుగోపాల్ పేర్కొనగా దాతలు ఎవరో తెలియకపోతే బినామీ కంపెనీలు కూడా నల్లధనాన్ని ఈ మార్గంలో పార్టీల నిధులుగా మార్చుకునే అవకాశముందని ధర్మాసనం అభిప్రాయపడింది. కానీ, ఎన్నికల్లో తాము ఎన్నుకోబోయే అభ్యర్థులకు నిధులు ఎక్కడి నుంచి అందుతున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment