న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాలు ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో దేశ ప్రజల ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) నవ్వులపాలయిందని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య కీచులాటతో సీబీఐ ప్రతిష్ట దెబ్బతిందని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌ల ధర్మాసనానికి విన్నవించుకున్నారు. సీబీఐపై చెదిరిన ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడమే కేంద్రప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ పేర్కొన్నారు.
తనను సీబీఐ డైరెక్టర్‌గా తొలగించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ సందర్భంగా వేణుగోపాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలోక్ వర్మ, అస్తానాల గొడవతో సీబీఐలో అసాధారణ పరిస్థితి నెలకొందనీ, ఇద్దరు పిల్లుల్లా కొట్లాడుకోవడంతో కేంద్రం జోక్యం చేసుకోవడం మినహా మరే ప్రత్యామ్నాయం లేకపోయిందని ఈ సందర్భంగా వేణుగోపాల్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాము కల్పించుకోకుంటే ఏం జరిగేదో ఆ దేవుడికే తెలుసన్నారు. చట్టానికి లోబడే ఇద్దరు ఉన్నతాధికారులపై కేంద్రం చర్యలు తీసుకుందన్నారు. సీబీఐలో పరస్పరం అవినీతి ఆరోపణలు గుప్పించుకున్న అలోక్ వర్మ, అస్తానాలను కేంద్రం సెలవుపై పంపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment