న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయమై తాము సానుకూలంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఓపెన్ కోర్టు తరహా విధానంతో కోర్టులో ప్రజలు గుమిగూడటాన్ని తగ్గించవచ్చంది. కోర్టుల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై మార్గదర్శకాల రూపకల్పన కోసం కేంద్రం తరఫున అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్ సూచనలను సుప్రీంకు సమర్పించారు.
తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ విషయమై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘ప్రత్యక్ష ప్రసారంతో ఇబ్బందులు ఉంటాయని మేం అనుకోవట్లేదు. ఈ విధానాన్ని మేమే తొలిసారి పరీక్షిస్తాం. అన్నిచోట్ల మొదటిసారిగా ప్రత్యక్ష ప్రసారాన్ని అమలుచేయడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని కోర్టుల్లో జరిగే విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు వాటిని రికార్డు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది.
రాజ్యాంగ అంశాలకే పరిమితం చేయండి:
కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణు గోపాల్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ ప్రాధాన్యం ఉన్న కేసుల విచారణకే ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించాలని కోరారు. దేశ భద్రత, భార్యాభర్తల గొడవలు, బాల నేరస్తులకు సంబంధించిన కేసులను దీని నుంచి మినహాయించాలని సూచించారు. కోర్టులో విచారణ సందర్భంగా లాయర్ తప్పుగా ప్రవర్తిస్తే.. 70 సెకన్ల పాటు ప్రసారాన్ని ఆపేసే ఏర్పాటు ఉండాలన్నారు.
ఈసమయంలో ఆ లాయర్ మాటల్ని వినిపించకుండా శబ్దాన్ని ఆపేయాలన్నారు. విచారణ సందర్భంగా రద్దీ పెరిగిపోతున్నందున పిటిషనర్లు, జర్నలిస్టులు, లాయర్లు, సందర్శకులు, తదితరుల కోసం ‘మీడియా రూమ్’ను ఏర్పాటు చేయాలని వేణు గోపాల్ సుప్రీంకోర్టుకు సూచించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని తాత్కాలికంగా నిలిపివేసే, పూర్తిగా ఆపేసే అధికారం జడ్జీలకు ఉండాలన్నారు
న్యాయవాది వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్..
కేసులను విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఓవైపు ప్రత్యక్ష ప్రసారాన్ని రాజ్యాంగ ధర్మాసనాలు విచారించే అంశాలకే పరిమితం చేయాలని ఏజీ వేణు గోపాల్ చెప్పగా, పిటిషనర్ల తరఫు న్యాయవాది మాథ్యుస్ జె.నెడుంపర దీనికి అభ్యంతరం తెలిపారు.
లైవ్ స్ట్రీమింగ్‌ను కేవలం రాజ్యాంగ అంశాలకే కాకుండా అన్ని కేసులకు వర్తింపజేయాలని కోరారు. అప్పుడే సుప్రీంకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కేవలం 30 సెకన్లలోనే కొట్టివేస్తున్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నారు. దీంతో మాథ్యుస్ వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘ప్రజలు మా ఇళ్లకు వచ్చి ఓసారి చూడాలి. కోర్టుకు బయలుదేరేముందు ప్రతిరోజూ అరగంట పాటు ఈ పిల్ పిటిషన్లను మేం పరిశీలిస్తుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం!
Published Sat, Aug 25 2018 3:24 AM | Last Updated on Sun, Sep 2 2018 5:18 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment