Case Inquiry
-
29న అయోధ్యపై విచారణ రద్దు
న్యూఢిల్లీ: అయోధ్య భూ వివాదం కేసులో మంగళవారం జరగాల్సిన విచారణను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారించాల్సి ఉండగా, వారిలో ఒకరైన జస్టిస్ ఎస్ఏ బాబ్డే మంగళవారం అందుబాటులో ఉండరనీ, కాబట్టి కేసు విచారణను ఆ రోజున రద్దు చేస్తున్నామంటూ సుప్రీంకోర్టు రిజస్ట్రీ ఓ నోటీసు విడుదల చేసింది. సీజేఐ రంజన్ గొగోయ్ ఈ ధర్మాసనానికి నేతృత్వం వహిస్తుండగా, జస్టిస్ బాబ్డేతోపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. ఈ ధర్మాసనాన్ని ఈ నెల 25న ఏర్పాటు చేశారు. అంతకుముందు ఈ కేసు విచారణలో పాలుపంచుకునేందుకు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ ఎన్వీ రమణలు విముఖత చూపారు. వారి స్థానంలో జస్టిస్ భూషణ్, జస్టిస్ నజీర్‌లు ధర్మాసనంలో చేరారు. -
కోర్టు విచారణ ప్రత్యక్ష ప్రసారం!
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేసే విషయమై తాము సానుకూలంగా ఉన్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. ఓపెన్ కోర్టు తరహా విధానంతో కోర్టులో ప్రజలు గుమిగూడటాన్ని తగ్గించవచ్చంది. కోర్టుల విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై మార్గదర్శకాల రూపకల్పన కోసం కేంద్రం తరఫున అటార్నీ జనరల్(ఏజీ) వేణుగోపాల్ సూచనలను సుప్రీంకు సమర్పించారు. తర్వాత ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. ఈ విషయమై సుప్రీంకోర్టు స్పందిస్తూ.. ‘ప్రత్యక్ష ప్రసారంతో ఇబ్బందులు ఉంటాయని మేం అనుకోవట్లేదు. ఈ విధానాన్ని మేమే తొలిసారి పరీక్షిస్తాం. అన్నిచోట్ల మొదటిసారిగా ప్రత్యక్ష ప్రసారాన్ని అమలుచేయడం సాధ్యం కాదు’ అని వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని కోర్టుల్లో జరిగే విచారణ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు వాటిని రికార్డు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాల(పిల్)పై సుప్రీంకోర్టు ఈ మేరకు స్పందించింది. రాజ్యాంగ అంశాలకే పరిమితం చేయండి: కేంద్రం తరఫున అటార్నీ జనరల్ వేణు గోపాల్ వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగ ప్రాధాన్యం ఉన్న కేసుల విచారణకే ప్రత్యక్ష ప్రసారాన్ని అనుమతించాలని కోరారు. దేశ భద్రత, భార్యాభర్తల గొడవలు, బాల నేరస్తులకు సంబంధించిన కేసులను దీని నుంచి మినహాయించాలని సూచించారు. కోర్టులో విచారణ సందర్భంగా లాయర్ తప్పుగా ప్రవర్తిస్తే.. 70 సెకన్ల పాటు ప్రసారాన్ని ఆపేసే ఏర్పాటు ఉండాలన్నారు. ఈసమయంలో ఆ లాయర్ మాటల్ని వినిపించకుండా శబ్దాన్ని ఆపేయాలన్నారు. విచారణ సందర్భంగా రద్దీ పెరిగిపోతున్నందున పిటిషనర్లు, జర్నలిస్టులు, లాయర్లు, సందర్శకులు, తదితరుల కోసం ‘మీడియా రూమ్’ను ఏర్పాటు చేయాలని వేణు గోపాల్ సుప్రీంకోర్టుకు సూచించారు. ప్రత్యక్ష ప్రసారాన్ని తాత్కాలికంగా నిలిపివేసే, పూర్తిగా ఆపేసే అధికారం జడ్జీలకు ఉండాలన్నారు న్యాయవాది వ్యాఖ్యలపై సుప్రీం సీరియస్.. కేసులను విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయడంపై సుప్రీంకోర్టులో శుక్రవారం వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఓవైపు ప్రత్యక్ష ప్రసారాన్ని రాజ్యాంగ ధర్మాసనాలు విచారించే అంశాలకే పరిమితం చేయాలని ఏజీ వేణు గోపాల్ చెప్పగా, పిటిషనర్ల తరఫు న్యాయవాది మాథ్యుస్ జె.నెడుంపర దీనికి అభ్యంతరం తెలిపారు. లైవ్ స్ట్రీమింగ్‌ను కేవలం రాజ్యాంగ అంశాలకే కాకుండా అన్ని కేసులకు వర్తింపజేయాలని కోరారు. అప్పుడే సుప్రీంకోర్టు ప్రజాప్రయోజన వ్యాజ్యాలను కేవలం 30 సెకన్లలోనే కొట్టివేస్తున్న విషయం ప్రజలకు తెలుస్తుందన్నారు. దీంతో మాథ్యుస్ వ్యాఖ్యలపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘ప్రజలు మా ఇళ్లకు వచ్చి ఓసారి చూడాలి. కోర్టుకు బయలుదేరేముందు ప్రతిరోజూ అరగంట పాటు ఈ పిల్ పిటిషన్లను మేం పరిశీలిస్తుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
వేకువజామున మూడింటిదాకా కేసుల విచారణ
ముంబై: వేసవి సెలవుల నేపథ్యంలో ముంబై హైకోర్టు జడ్జీలంతా సాయంత్రం ఐదింటికి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఒక్కరు మాత్రం తెల్లవారేదాకా కేసుల పరిష్కారంలో తలమునకలై ఉన్నారు. ఆయన.. జస్టిస్ షారుఖ్ జె కథావాలా..! జస్టిస్ కథావాలా శుక్రవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరై, శనివారం వేకువజాము 3.30 గంటల దాకా కోర్టులో ఉండి, అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన దాదాపు 100 పిటిషన్లను విచారించారని జడ్జి ఒకరు చెప్పారు. గత వారం కూడా ఆయన అర్ధరాత్రి దాకా కేసులు విచారించారని చెప్పారు. ‘జస్టిస్ కథావాలా 3.30దాకా పనిచేసినా ఆయన ముఖంలో ఎలాంటి అలసటా కనిపించలేదు.ఆఖరుగా విచారించిన పిటిషన్లలో నాది కూడా ఒకటి. నా వాదనలను ఆయన చాలా ప్రశాంతంగా, ఓపిగ్గా విని ఉత్తర్వులు జారీ చేశారు’ అని న్యాయవాది ప్రవీణ్ సందాని చెప్పారు. తెల్లవారుజాము దాకా అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి వెళ్లిన ఆయన.. తిరిగి శనివారం ఉదయం తన కార్యాలయానికి వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగతా జడ్జీల కంటే గంట ముందుగా ప్రతిరోజూ ఆయన ఉదయం 10 గంటలకే కోర్టు విధులను ప్రారంభిస్తారు. కోర్టు వేళలు ముగిసేదాకా తన సీటులోనే ఉంటారని కోర్టు సిబ్బంది తెలిపారు. కాగా, ముంబై హైకోర్టుకు ఈనెల 7వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులున్నాయి. -
హుందాగా డ్రెస్ చేసుకోండి: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో కేసుల సందర్భంగా హాజరయ్యే అధికారుల వస్త్రధారణ హుందాగా ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది. రాజస్తాన్ పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీ మంజిత్ సింగ్ బుధవారం ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టుకు సాధారణ దుస్తుల్లోనే హాజరయ్యారు. దీంతో జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్‌లతో కూడిన బెంచ్ ఆయన్ను మందలించింది. ఈ కేసు విచారణ గురువారం కూడా కొనసాగింది. నీలం రంగు సూట్‌తో కోర్టుకు హాజరైన మంజిత్ సింగ్.. బుధవారం సాధారణ దుస్తుల్లో వచ్చినందుకు న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నిబంధనలు ఉన్నా లేకున్నా ప్రభుత్వ అధికారులు కోర్టులకు వచ్చేటప్పుడు హుందాగా, మర్యాదపూర్వకంగా ఉండే వస్త్రాలనే ధరించాలని తెలిపింది. అధికారుల హోదాకు, బాధ్యతలకు దుస్తులు ప్రతీకలుగా నిలుస్తాయని వ్యాఖ్యానించింది. -
వర్మకు సీసీఎస్ పోలీసుల 10 ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: ‘గాడ్ సెక్స్ అండ్ ట్రూత్’ (జీఎస్టీ) వెబ్ సిరీస్ వివాదానికి సంబంధించి నమోదైన కేసు విచారణ కోసం ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మకు శనివారం సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా సీసీఎస్ పోలీసులు ఆయనకు 10 ప్రశ్నలు సంధించారు. జీఎస్టీ సినిమా ఎందుకు తీశారు. సినిమాకు పెట్టుబడి ఎక్కడిది, మహిళలను అశ్లీలంగా ఎందుకు చూపిస్తున్నారు?. ట్విటర్, ఫేస్బుక్లో పోస్టు చేసిన పోర్న్‌స్టార్ మియా మాల్కోవా ఫోటోలు ఎక్కడ నుంచి వచ్చాయి, ఆమెకు డబ్బులు ఎక్కడ నుంచి ఇచ్చారు. సినిమాకు వాడిన ఎక్విప్ మెంట్ ఎక్కడిది...అంటూ వర్మను విచారణలో ప్రశ్నించారు. సీఎస్ పోలీసులు గతంలో ఇచ్చిన నోటీసుకి వర్మ తాను ముంబైలో నాగార్జున సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నా అంటూ అడ్వాకేట్ ద్వారా సమాచారం పంపిన విషయం తెలిసిందే. అయితే ఈసారి విచారణకు హాజరు కాకపోతే అరెస్ట్ తప్పదని పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ విచారణకు వచ్చారు. కాగా అశ్లీలానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న జీఎస్టీ వెబ్ సిరీస్ వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనికితోడు ఈ చిత్రానికి సంబంధించిన ప్రచారం, చర్చల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ మహిళలను అగౌరవపరుస్తూ పలు వ్యాఖ్యలు చేయడంతో అనేక ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌కు సంబంధించి బాగ్‌లింగంపల్లికి చెందిన సామాజికవేత్త, మహిళా ఉద్యమ నాయకురాలు పీఏ దేవి గత నెల 25న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై అదే రోజు పోలీసులు ఐపీసీలోని 506తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, నిందితుడిగా రాంగోపాల్ వర్మ పేరు పొందుపరిచారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించాల్సి ఉండటంతో విచారణకు హాజరుకావాల్సిందిగా సైబర్ క్రైమ్ పోలీసులు ముంబైలో ఉన్న రాంగోపాల్ వర్మకు గతంలో నోటీసులు పంపారు. వీటిలో పేర్కొన్న గడువు ప్రకారం వర్మ గత గురువారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుస్టేషన్‌కు వచ్చి, దర్యాప్తు అధికారి ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే తనకు నోటీసులు అందాయని, విచారణకు హాజరుకాలేకపోతున్నానంటూ రాంగోపాల్ వర్మ తన లాయర్ ద్వారా వర్తమానం పంపారు. ముంబైలో ఓ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో హాజరుకావడం సాధ్యం కాలేదంటూ వివరణ ఇచ్చారు. మరోసారి నోటీసులు ఇస్తే వచ్చే వారం విచారణకు వస్తానంటూ లాయర్ ద్వారా పేర్కొన్నారు. దీంతో రాంగోపాల్ వర్మకు సైబర్ క్రైమ్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. -
కాళేశ్వరంపై విచారణ జనవరికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తోందని జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వివరించారు. దీనిపై కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన కేసు విచారణ జరపాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకట్‌రెడ్డి కల్పించుకుని ప్రాజెక్టుకు కీలకమైన స్టేజ్–2 అటవీ అనుమతులు వచ్చాయని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును త్వరితగతిన విచారించాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. హైకోర్టు ప్రశ్నించినట్లు ఈ కేసును విచారించే పరిధి ట్రిబ్యునల్‌కు ఉందా లేదా అనేది ఆ రోజు తేలుస్తామని తెలిపింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువులు నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువుల తవ్వకానికి స్టేజ్ –1 కింద రూ.13 కోట్లకు పరిపాలనపరమైన ఆమోదం లభించినట్టు నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భూసేకరణ తదితర చట్టపరమైన పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నామని ఆయన వివరించారు. భూసేకరణ పూర్తయ్యాక ఆయా చెరువుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను పంపాలని చిన్న నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల కలెక్టర్లు, ఇంజనీర్లను కోరామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 26 కొత్త చెరువులు తవ్వాలని ఇదివరకే నిర్ణయించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. వాటికి సంబంధించి స్టేజ్–1 అనుమతిని మంజూరు చేస్తూ ఈ మేరకు రూ.92 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. -
ఎన్నికల వేళ 'అమ్మ'కు షాక్!
రాజీవ్ హంతకుల విడుదలకు కేంద్రం నో సుప్రీంలో కేసు ఉందంటూ దాటవేత సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 1991 మే 21వ తేదీన ఎన్నికల ప్రచారం నిమిత్తం తమిళనాడులోని శ్రీపెరంబుదూరుకు చేరుకున్న సమయంలో ఎల్టీటీఈ మానవబాంబు చేతిలో దారుణహత్యకు గురైన సంగతి పాఠకులకు విదితమే. సంవత్సరాల తరబడి సాగిన ఈ కేసు విచారణలో చివరకు ఏడుగురికి ఉరిశిక్ష పడగా రాష్ట్రపతి క్షమాభిక్షతో యావజ్జీవంగా మారింది. మురుగన్, పేరరివాళన్, శాంతన్, నళిని, జయకుమార్, రవిచంద్రన్, రాబర్ట్ బయాస్ ఈ ఏడుగురు గత 20 ఏళ్లుగా వేలూరు సెంట్రల్ జైలు జీవితం గడుపుతున్నారు. యావజ్జీవ శిక్ష పడిన ఖైదీలు 14 ఏళ్లకు పైగా జైలు జీవితాన్ని గడిపిన పక్షంలో రాష్ట్రప్రభుత్వమే స్వతంత్రంగా నిర్ణయం తీసుకుని విడుదల చేయవచ్చని చట్టం చెబుతోంది. రెండేళ్ల క్రితం అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి. సదాశివం సైతం ఇదే విషయాన్ని ఆనాడు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జయలలిత సైతం సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని దీపావళి కానుకగా ఏడుగురిని విడుదల చేయాలని నిర్ణయించినట్లు 2014లో ప్రకటించారు. ఇందుకోసం అవసరమైన తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి అనుమతి కోసం కేంద్రానికి పంపారు. అయితే కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం ఇందుకు అభ్యంతరం తెలిపింది. మాజీ ప్రధాని హత్య కేసుకే ఈ గతా అంటూ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. అంతేగాక హంతకుల విడుదలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు చేపట్టిన విచారణలో శిక్షపడినందున వారిని విడుదల చేసే హక్కు రాష్ట్రప్రభుత్వానికి లేదని గత ఏడాది డిశంబరు 2 వ తేదీన తీర్పుచెప్పింది. దీంతో ఏడు మంది హంతకుల విడుదల అంశంపై అప్పటికి అటకెక్కేసింది. అయితే, 24 ఏళ్లుగా జైలులో ఉన్న ఏడు మంది అర్హులు కాబట్టి వెంటనే విడుదల చేయాల్సిందిగా రాష్ట్రంలోని అనేక ప్రజా సంఘాలు, పార్టీలు డిమాండ్ చేయడంతోపాటు నిరసనలు వ్యక్తం చేశాయి. ఈ పరిణామంతో సీఎం జయలలిత ఆదేశాల మేరకు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్ గత నెల 2వ తేదీన ఇటీవల కేంద్రహోంశాఖకు ఉత్తరం రాశారు. 24 ఏళ్లగా జైలులో ఉన్న ఏడుగురు రాజీవ్ హంతకులను విడుదల చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ అంశంలో కే ంద్రం అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా కోరారు. మేమేమీ చెప్పలేం తమిళనాడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి స్పందించిన కేంద్ర హోంశాఖ ఓ ఉత్తరం రాసింది. ఏడుగురు ఖైదీల విడుదల అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉన్నందున తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించలేమని పేర్కొంది. రాష్ట్రప్రభుత్వం నుంచి అందిన ఉత్తరంపై న్యాయనిపుణులను సంప్రదించగా తమ నిర్ణయాన్నే సమర్థించినట్లు కేంద్రం తెలిపింది. ఏడుగురు ఖైదీలను విడుదల చేసే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని సైతం న్యాయనిపుణులు స్పష్టం చేశారని తెలిపింది. ఎన్నికల వేళ ఎదురుగాలి రాష్ట్రంలో దాదాపుగా ప్రతి అంశానికి రాజకీయాలు ముడిపడి ఉండగా, రాజీవ్ హంతకుల అంశానికి సైతం రాజకీయ రంగు పులుముకుంది. తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన దీపావళి రోజున ఏడు మంది హంతకులను విడుదల చేయడం ద్వారా మార్కులు కొట్టేయాలని సీఎం జయలలిత భావించారు. అయితే అనుకోని అవాంతరాలు వచ్చిపడటంతో నిరాశచెందారు. ఎన్నికల సమయంలో ఏడుమందిని విడుదల చేయడం ద్వారా సానుభూతిపరులను ఓట్లు రాబట్టుకోవాలని అన్నాడీఎంకే ప్రభుత్వం సహజంగానే ఆశించి ఉండవచ్చు. అందుకే సరిగ్గా ఎన్నికల ప్రకటన వెలువడే సమయంలో కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. అయితే ఇదే సానుభూతిని పొందాలని ఎదురుచూస్తున్న బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు కోసం అర్రులుచాచి భంగపడింది. రెండుపార్టీల మధ్య పొత్తు చర్చలు ప్రారంభం కాక ముందే బెడిసికొట్టాయి. హంతకుల విడుదల అంశం తమ చేతుల్లో లేదని బీజేపీ ప్రభుత్వం తెలివిగా తప్పుకున్నట్లు భావించవచ్చు. తాజా పరిణామంతో సీఎం జయ, ఏడు మంది హంతకుల ఆశ నిరాశగా మిగిలిపోయింది. -
జయకు ఊరట!
ఆదాయపు పన్ను దాఖలు కేసు నుంచి అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు ఊరట లభించనుంది. సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకునేందుకు ఆదాయపు పన్ను శాఖ నిర్ణరుుంచింది. సుమారు 18 ఏళ్లుగా జయలలిత చుట్టూ తిరుగుతున్న ఈ కేసు మరో వారంలో కొలిక్కి రానుంది. సాక్షి, చెన్నై: జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ పై ఆదాయపు పన్ను శాఖ దాఖలు చేసిన కేసు విచారణ ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో చెన్నై ఎగ్మూర్ కోర్టులో సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు రావాలంటూ పలు మార్లు ఆ ఇద్దరికి సమన్లు జారీ అయ్యూరుు. అరుుతే ఏదో ఒక కారణంతో వాయిదాలతో డుమ్మా కొడుతూ వచ్చారు. ఈ కేసు విచారణ ముగింపునకు సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సైతం ముగిసింది. దీంతో విచారణను త్వరితగతిన ముగించే విధంగా న్యాయమూర్తి దక్షిణామూర్తి కార్యచరణ సిద్ధం చేశారు. ఈ పరిస్థితుల్లో జయలలితకు జైలు శిక్ష పడడంతో కేసు మళ్లీ వాయిదాలతో సాగుతోంది. తదుపరి విచారణ మరో వారంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖతో సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు జయలలిత తరపు న్యాయవాదులు చేపట్టిన ప్రయత్నాలు ఫలించాయి. ఇది వరకే ఆదాయపన్ను శాఖ కేంద్ర కమిషన్ వద్ద జయలలిత తరుపున విజ్ఞాపన పెండింగ్‌లో ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకున్న ఆ కమిషన్ సామరస్య పూర్వక పరిష్కారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జరిమానా కట్టేందుకు సిద్ధం ఆదాయపు పన్నును జరిమానాతో కలిపి కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని జయలలిత తరపున ఆదాయపన్ను శాఖకు స్పష్టమైన సంకేతం వెళ్లింది. దీంతో ఈ కేసు కొలిక్కి వచ్చినట్టేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి. జయలలిత తరపు విజ్ఞప్తిని అంగీకరించిన ఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖ ప్రత్యేక కమిషన్ సానుకూలత వ్యక్తం చేసింది. చెల్లించాల్సిన మొత్తాన్ని చెన్నైలోని ఆదాయపు పన్ను శాఖ ప్రకటిస్తుందని పేర్కొంది. ఆదాయపు పన్నును జరిమానాతో కలిపి కట్టేందుకు జయలలిత తరపు ప్రతినిధులు సిద్ధమయ్యారు. సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కారం కావడంతో ఇక ఈ విషయాన్ని కోర్టు దృష్టికి ఆదాయపన్ను శాఖ తేనుంది. మరో వారంలో ఎగ్మూర్ కోర్టు ముందు తమ వాదన వినిపించనుంది. తర్వాత జయలలితకు ఊరట కలిగించే విధంగా కోర్టు ఆదేశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. -
చేయని నేరానికి శిక్ష
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెదవేగి మండలం అంకన్నగూడెం బాధితులకు పోలీసుల చెర ఎట్టకేలకు విముక్తి లభించింది. దాదాపు రెండువారాల పాటు తమ అదుపులో ఉన్న ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు విడుదల చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఎం.గోపాలరావును ఈనెల 11న బంధువుల వెంట పంపించిన పోలీసులు, మొరవినేని భాస్కరరావు, చంద్రశేఖర్‌లను సోమవారం వేకువజామున విడిచిపెట్టారు. గ్రామ సర్పంచ్ చిదిరాల రాజేష్‌పై హత్యాయత్నం కేసు విచారణ ఇంకా కొలిక్కి రాలేదని, అవసరమైతే మళ్లీ ఆ ముగ్గురినీ పిలుస్తామని చెప్పి బంధువులకు అప్పగించారు. సరిగ్గా రెండువారాల కిందట పెదవేగి మండలం అంకన్నగూడెం సర్పంచ్, టీడీపీ నేత రాజేష్ రోడ్డు ప్రమాదానికి గురికావడం.. దరిమిలా టీడీపీ కార్యకర్తలు గ్రామంలో దాడులకు తెగబడటం, ప్రాణరక్షణ పేరిట ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే. అప్పటినుంచి ఈ ముగ్గురిని తమ నిర్బంధంలోనే పెట్టుకుని రోజుకో స్టేషన్ తిప్పుతూ వచ్చిన పోలీసులు ఈ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలతో దిగొచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ మొరవనేని గోపాలరావును గత శుక్రవారం ఆయన బంధువులకు అప్పగించారు. మిగిలిన వారిని కూడా మరుసటి రోజే వదిలేస్తామన్నారు. ఆ తరువాత మాటమార్చి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. ఈనేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు పోలీసు అధికారులతో చర్చించటంతో మొరవినేని భాస్కరరావు, చంద్రశేఖర్లకు సోమవారం వేకువజామున ఎట్టకేలకు విముక్తి కల్పించారు. గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ఊళ్లోకి వెళ్లొద్దని పోలీసులు సూచించారు. కేసుల సంగతేంటి? పోలీసుల చెరనుంచి విడుదలైన మాజీ ఎంపీటీసీ భాస్కరరావు సోమవారం ఏలూరులో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. చేయని తప్పునకు రెండువారాల పాటు నరకం అనుభవించానని గోడు వెళ్లబోసుకున్నారు. ‘రాజేష్‌తో రాజకీయపరంగా మాకు భేదాభిప్రాయూలు ఉండొచ్చు. ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నాం. అంతేకానీ హత్యాయత్నం చేసేంత విభేదాల్లేవు. అతను మా బంధువే. అయినా ఒకవేళ అటువంటి అఘాయిత్యానికే నేను పాల్పడి ఉంటే.. ఎటువంటి రక్షణ లేకుండా ఆ ఊళ్లోనే ఎందుకుంటాం. టీడీపీ వర్గాలు మామధ్య ఘర్షణ పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు. కేసు విషయంలో సహకరించాలని కోరుతున్న పోలీసులు ముందుగా తమ ఇళ్లపైన, తమపైన దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. -
సామరస్యమేనా?
సాక్షి, చెన్నై:రాష్ర్ట ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, ఆమె నెచ్చిలి శశికళపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు , ఆదాయపు పన్ను ఎగవేత కేసుల విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. ఆస్తులు గడించిన కేసు బెంగళూరు ప్రత్యేక న్యాయస్థానంలో, పన్ను ఎగవేత కేసు చెన్నై ఎగ్మూర్ కోర్టులోనూ ఏళ్ల తరబడి సాగుతోంది. ఆదాయపు పన్ను ఎగవేత : జయలలిత, శశికళ భాగస్వామ్యంలోని శశి ఎంటర్ ప్రెజైస్కు సంబంధించి 1991-92,1992-93 సంవత్సరానికి గాను ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేయలేదు. అలాగే, 1993-94కు గాను జయలలిత, శశికళ వ్యక్తిగతంగా తమ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయలేదు. దీన్ని గుర్తించిన డీఎంకే సర్కారు కేసులు దాఖలు చేసింది. ఆదాయపు పన్ను ఎగవేత వ్యవహారం చెన్నై ఎగ్మూర్ ప్రధాన మేజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో ఆర్థిక నేరాల విచారణ కోర్టులో సాగుతోంది. ఏళ్ల తరబడి వాయిదాల మీద వాయిదాలతో విచారణ సాగుతోంది. విముక్తి : ఈ కేసు నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు చుక్కెదురు కావడంతో జయలలిత, శశికళ చివరకు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను నాలుగు నెలల్లో ముగించి తీర్పు ఇవ్వాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించింది. దీంతో ఎగ్మూర్ కోర్టు న్యాయమూర్తి దక్షిణా మూర్తి నేతృత్వంలో విచారణ వేగం పెరిగింది. నిర్విరామంగా వాయిదాలతో విచారణ సాగుతోంది. ఈ సమయంలో పలు మార్లు కోర్టుకు రావాలంటూ జయలలిత, శశికళకు కోర్టు నోటీసులు పంపింది. అయితే, వారు డుమ్మాల పర్వం కొనసాగించారు. దీంతో విచారణను తుది దశకు చేర్చేందుకు న్యాయమూర్తి దక్షిణామూర్తి నిర్ణయించారు. మలుపు : సోమవారం విచారణ సందర్భంగా కేసు మలుపు తిరిగింది. జయలలిత, శశికళ తరపున కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆదాయపు పన్ను శాఖకు జయలలిత, శశికళలను ఓ విజ్ఞప్తి చేసుకున్నట్టు వివరించారు. సామరస్య పూర్వకంగా, జరిమానాలతో సమస్యను పరిష్కరించుకుందామని అందులో సూచించినట్టు పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి దక్షిణామూర్తి ఆదాయపు పన్ను శాఖ తరపు న్యాయవాది రామస్వామికి ప్రశ్నల్ని సంధించారు. జయలలిత, శశికళ తరపు వచ్చిన విజ్ఞప్తి వాస్తవేమనని, ఆ విజ్ఞప్తి పరిశీలనలో ఉందని స్పష్టం చేశారు. ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు సామరస్య పూర్వకంగా సమస్యను పరిష్కరించుకునేందుకు వీలుందని గుర్తు చేశారు. అదే సమయంలో తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేయాలని, అంతలోపు సమస్య సామరస్య పూర్వకం అవుతుందంటూ జయలలిత తరపు న్యాయవాదులు వాదన వినిపించారు. దీంతో తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి నిర్ణయించారు. ఆదాయపు పన్ను ఎగవేత కేసు సామరస్యంగా పరిష్కారమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో అధికారంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉన్న దృష్ట్యా, ఇక జయలలిత తరపున సామరస్య పూర్వక పరిష్కార విజ్ఞప్తి వచ్చిన దృష్ట్యా, సానుకూలంగా జరిమానాలతో కేసును ముగించేయడం తథ్యం. -
కొన‘సాగుతున్న’ దర్యాప్తు
భీమవరం క్రైం : భీమవరంలోని రాయప్రోలు వారి వీధిలో 10 నెలల క్రితం జరిగినయువకుడి హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. స్థానిక మావుళ్లమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మానే పేరయ్య కుమారుడు ఆనంద్ భగవాన్ (24) గతేడాది ఆగస్టు 9 రాత్రి 8 గంటలకు స్నేహితుల దగ్గరికి వెళుతున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత అతను నిర్జీవంగా కనిపించా డు. అతనిపై మోటార్ సైకిల్ పడి ఉంది.దీంతో బైక్ అదుపుతప్పి పడటంతో అతను మరణించి ఉంటాడని పోలీసులు భావించారు. భగవాన్ ముఖంపై బైక్ ముందు చక్రం డిస్క్ దిగిపోయి ఉంది. డిస్క్‌ను అతని ముఖంపై పెట్టి నొక్కినట్లు ఉందని పోలీసులు గ్రహించారు. అతని శరీరంపై ఇసుక కనిపించింది. దీంతో అతడిని ఎక్కడో హత్యచేసి ఇక్కడ పడేశారని పోలీసు లు నిర్ధారణకు వచ్చి హత్య కేసు నమోదు చేశారు. సీసీఎస్‌కు అప్పగించినా పురోగతి లేదు : భగవాన్ హత్య కేసును భీమవరం సీసీఎస్ సీఐ జగన్మోహన్రావుకు అప్పగించినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. చోరీ కేసుల్లో రికవరీలు బాగా చేస్తారనే పేరున్న జగన్మోహన్రావు అయితే ఈకేసును వేగవంతంగా ఛేదిస్తారని ఉన్నతాధికారులు ఆయనకు ఈ కేసు అప్పగించారని తెలిసింది. హత్య జరిగిన కొన్ని నెలలకు ఆయన బదలీపై వె ళ్లిపోయారు. దీంతో ఆ కేసు నత్తనడకన సాగుతోంది. పోలీసులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు తన కుమారుడిని హత్య చేసిన వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారా అని భగవాన్ తండ్రి పేరయ్య ఎదురు చూస్తున్నారు. అనేక సార్లు ఆయన పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కుమారుడి హత్యను జీర్ణించుకోలేని అతని తల్లి బెంగ పెట్టుకుని మంచమెక్కారు. పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన కోరుతున్నారు. ఎస్పీ హరికృష్ణ దీనిపై దృష్టి సారించాలని అభ్యర్థిస్తున్నారు.