
జస్టిస్ కథావాలా
ముంబై: వేసవి సెలవుల నేపథ్యంలో ముంబై హైకోర్టు జడ్జీలంతా సాయంత్రం ఐదింటికి విధులు ముగించుకుని ఇళ్లకు వెళ్లిపోగా ఒక్కరు మాత్రం తెల్లవారేదాకా కేసుల పరిష్కారంలో తలమునకలై ఉన్నారు. ఆయన.. జస్టిస్ షారుఖ్ జె కథావాలా..! జస్టిస్ కథావాలా శుక్రవారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరై, శనివారం వేకువజాము 3.30 గంటల దాకా కోర్టులో ఉండి, అత్యవసర మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన దాదాపు 100 పిటిషన్లను విచారించారని జడ్జి ఒకరు చెప్పారు. గత వారం కూడా ఆయన అర్ధరాత్రి దాకా కేసులు విచారించారని చెప్పారు.
‘జస్టిస్ కథావాలా 3.30దాకా పనిచేసినా ఆయన ముఖంలో ఎలాంటి అలసటా కనిపించలేదు.ఆఖరుగా విచారించిన పిటిషన్‌లలో నాది కూడా ఒకటి. నా వాదనలను ఆయన చాలా ప్రశాంతంగా, ఓపిగ్గా విని ఉత్తర్వులు జారీ చేశారు’ అని న్యాయవాది ప్రవీణ్ సందాని చెప్పారు. తెల్లవారుజాము దాకా అత్యవసర ఉత్తర్వులను జారీ చేసి వెళ్లిన ఆయన.. తిరిగి శనివారం ఉదయం తన కార్యాలయానికి వచ్చి పెండింగ్ పనులు పూర్తి చేశారని చెప్పారు. మిగతా జడ్జీల కంటే గంట ముందుగా ప్రతిరోజూ ఆయన ఉదయం 10 గంటలకే కోర్టు విధులను ప్రారంభిస్తారు. కోర్టు వేళలు ముగిసేదాకా తన సీటులోనే ఉంటారని కోర్టు సిబ్బంది తెలిపారు. కాగా, ముంబై హైకోర్టుకు ఈనెల 7వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు వేసవి సెలవులున్నాయి.