
అలరారే ప్రకృతి అందాలకు నిలయం
మినీ ఊటీని తలపించేలా సుందర దృశ్యాలు
జింకల వీక్షణం.. బోటు షికారు ప్రత్యేకం
వేసవి సెలవుల్లో ఓ రోజు గడిపేందుకు అద్భుతమైన ప్రదేశం
పాల్వంచ రూరల్: వేసవి సెలవులు వచ్చాయి. చిన్నారులు, పెద్దలు, మహిళలు వెళ్లేందుకు కిన్నెరసాని ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చదనాన్ని పంచే అడవులు, స్వచ్ఛమైన ప్రాణవాయువును అందించే చెట్లు.. చెంగుచెంగున ఎగిరే వన్యప్రాణులు, గలగలా పారే సెలయేర్లు.. పక్షుల కిలకిలారావాలకు కిన్నెరసాని డీర్‌పార్కు చిరునామాగా నిలుస్తోంది. అడుగడుగునా ఆహ్లాదాన్ని పంచే జీవ వైవిధ్యం గల అటవీ అందాలతో మినీ ఊటీగా మారుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం.
కొండకోనలు, పచ్చని చెట్లు, జలాశయం, వన్యప్రాణులతో చూడచక్కని ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెరసానిలో పర్యాటకులను ఆకట్టుకునేలా పచ్చని పొదరిళ్లు, ఎత్తయిన కొండలు, గుట్టలు, జలాశయం, చూడచక్కని ద్వీపాలు కనిపిస్తాయి. పర్యాటకుల ఊహకు ఏమాత్రం తగ్గని రీతిలో ఇక్కడి ప్రకృతి సోయగాలు ప్రతీ ఒక్కరిని అలరిస్తాయి. ఈ సుందర దృశ్యాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ముఖ్యంగా వేసవి సెలవుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు.
పర్యాటకులను ఆకర్షించేలా కాటేజీలు..
భద్రాద్రి కొత్తగూడెం జిలê్ల పాల్వంచ మండలంలోని కిన్నెరసాని పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో నీతి ఆయోగ్ పథకం కింద రూ.3.24 కోట్లు, ఎకో టూరిజం అభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.7.53 కోట్లు మంజూరు చేశాయి. ఆయా నిధులతో కిన్నెరసానిలో తొమ్మిది కాటేజీలు, అద్దాలమేడ నిర్మాణం చేపడుతున్నారు. కిన్నెరసాని రిజర్వాయర్‌లో పర్యాటకుల కోసం బోటు షికారు ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు డీర్‌పార్క్‌లోని చుక్కల జింకలు, జలాశయం అందాలను చూసి.. మరోసారి రావడానికి ఉత్సాహం చూపుతుంటారు.
అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యం
కిన్నెరసాని పర్యాటక ప్రాంతంలో ఒకప్పుడు అద్దాలమేడకు ఎంతో ప్రాముఖ్యత ఉండేది. 1978లో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో అద్దాలమేడతో పాటు పలు కాటేజీలు నిర్మించారు. అయితే ఆ తర్వాత అద్దాలమేడను మావోయిస్టులు ధ్వంసం చేయడంతో కళావిహీనంగా తయారైంది. కాగా, కిన్నెరసానిని పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో భాగంగా అద్దాలమేడ పునరుద్ధరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన రూ,10.77 కోట్లు ఖర్చు చేశారు. శిథిలావస్థకు చేరిన అద్దాలమేడతో పాటు కాటేజీలను కూల్చి వాటి స్థానంలో కొత్తవి నిర్మించారు. రిజర్వాయర్ చుట్టూ ఎత్తయిన గుట్టపై రెండంతస్తుల్లో 9 కాటేజీలు, అద్దాల మేడ, ఫుడ్ కోర్టు నిర్మించారు.
కిన్నెరసానికి ఎలా చేరుకోవాలంటే..
ఖమ్మం నుంచి భద్రాద్రి జిల్లా పాల్వంచకు 90 కిలోమీటర్లు ఉంటుంది. ఈ పట్టణానికి చేరుకున్నాక అంబేడ్కర్ సెంటర్ నుంచి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే కిన్నెరసాని ప్రాజెక్టు వస్తుంది. అక్కడ ప్రకృతి అందాలతో నిండిన జలాశయం, జింకల పార్కు ఉంటాయి. కిన్నెరసానికి సమీపంలోని మందెరకలపాడు సమీప అటవీ ప్రాంతంలో జలపాతం ఉంది. ఇక్కడ నుంచి తిరిగి భద్రాచలం వెళ్లే మార్గంలో పెద్దమ్మతల్లి ఆలయం ఉంది.
కాగా, కిన్నెరసాని చేరడానికి బస్ సౌకర్యం లేక ఆటోలను ఆశ్రయించాల్సిందే. వేసవి సెలవుల్లోనైనా బస్సు సౌకర్యం కల్పిస్తే కిన్నెరసానికి పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతుంది. ఇక వరంగల్ జిల్లా లక్నవరంలో ఏర్పాటు చేసినట్లుగా కిన్నెరసానిలో కూడా నీళ్ల మధ్య వంతెన నిర్మించి, ప్రత్యేక హోటళ్లు, వసతి గృహాలను నిర్మిస్తే పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవచ్చు.
