చేయని నేరానికి శిక్ష
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పెదవేగి మండలం అంకన్నగూడెం బాధితులకు పోలీసుల చెర ఎట్టకేలకు విముక్తి లభించింది. దాదాపు రెండువారాల పాటు తమ అదుపులో ఉన్న ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు విడుదల చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఎం.గోపాలరావును ఈనెల 11న బంధువుల వెంట పంపించిన పోలీసులు, మొరవినేని భాస్కరరావు, చంద్రశేఖర్‌లను సోమవారం వేకువజామున విడిచిపెట్టారు. గ్రామ సర్పంచ్ చిదిరాల రాజేష్‌పై హత్యాయత్నం కేసు విచారణ ఇంకా కొలిక్కి రాలేదని, అవసరమైతే మళ్లీ ఆ ముగ్గురినీ పిలుస్తామని చెప్పి బంధువులకు అప్పగించారు. సరిగ్గా రెండువారాల కిందట పెదవేగి మండలం అంకన్నగూడెం సర్పంచ్, టీడీపీ నేత రాజేష్ రోడ్డు ప్రమాదానికి గురికావడం.. దరిమిలా టీడీపీ కార్యకర్తలు గ్రామంలో దాడులకు తెగబడటం, ప్రాణరక్షణ పేరిట ముగ్గురు వైఎస్సార్ సీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలిసిందే.
అప్పటినుంచి ఈ ముగ్గురిని తమ నిర్బంధంలోనే పెట్టుకుని రోజుకో స్టేషన్ తిప్పుతూ వచ్చిన పోలీసులు ఈ వ్యవహారంపై ‘సాక్షి’ వరుస కథనాలతో దిగొచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ సర్పంచ్ మొరవనేని గోపాలరావును గత శుక్రవారం ఆయన బంధువులకు అప్పగించారు. మిగిలిన వారిని కూడా మరుసటి రోజే వదిలేస్తామన్నారు. ఆ తరువాత మాటమార్చి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన ముగిసిన తర్వాత విడుదల చేస్తామని చెప్పారు. ఈనేపథ్యంలో వైఎస్సార్ సీపీ నేతలు పోలీసు అధికారులతో చర్చించటంతో మొరవినేని భాస్కరరావు, చంద్రశేఖర్‌లకు సోమవారం వేకువజామున ఎట్టకేలకు విముక్తి కల్పించారు. గ్రామంలో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు ఊళ్లోకి వెళ్లొద్దని పోలీసులు సూచించారు.
కేసుల సంగతేంటి?
పోలీసుల చెరనుంచి విడుదలైన మాజీ ఎంపీటీసీ భాస్కరరావు సోమవారం ఏలూరులో తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. చేయని తప్పునకు రెండువారాల పాటు నరకం అనుభవించానని గోడు వెళ్లబోసుకున్నారు. ‘రాజేష్‌తో రాజకీయపరంగా మాకు భేదాభిప్రాయూలు ఉండొచ్చు. ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నాం. అంతేకానీ హత్యాయత్నం చేసేంత విభేదాల్లేవు. అతను మా బంధువే. అయినా ఒకవేళ అటువంటి అఘాయిత్యానికే నేను పాల్పడి ఉంటే.. ఎటువంటి రక్షణ లేకుండా ఆ ఊళ్లోనే ఎందుకుంటాం. టీడీపీ వర్గాలు మామధ్య ఘర్షణ పెట్టి లబ్ధి పొందాలని చూస్తున్నాయి’ అని చెప్పుకొచ్చారు. కేసు విషయంలో సహకరించాలని కోరుతున్న పోలీసులు ముందుగా తమ ఇళ్లపైన, తమపైన దాడి చేసిన దుండగులను అరెస్ట్ చేయాలని ఆయన కోరారు.