సాక్షి, న్యూఢిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు కేసు విచారణను జాతీయ హరిత ట్రిబ్యునల్ జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తోందని జస్టిస్ స్వతంత్రకుమార్‌తో కూడిన ధర్మాసనానికి పిటిషనర్ల తరఫు న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వివరించారు. దీనిపై కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన కేసు విచారణ జరపాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వెంకట్‌రెడ్డి కల్పించుకుని ప్రాజెక్టుకు కీలకమైన స్టేజ్–2 అటవీ అనుమతులు వచ్చాయని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కేసును త్వరితగతిన విచారించాల్సిన అవసరం లేదని ట్రిబ్యునల్ పేర్కొంది. హైకోర్టు ప్రశ్నించినట్లు ఈ కేసును విచారించే పరిధి ట్రిబ్యునల్‌కు ఉందా లేదా అనేది ఆ రోజు తేలుస్తామని తెలిపింది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువులు
నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: నాలుగో విడత మిషన్ కాకతీయలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువుల తవ్వకానికి స్టేజ్ –1 కింద రూ.13 కోట్లకు పరిపాలనపరమైన ఆమోదం లభించినట్టు నీటి పారుదలశాఖ మంత్రి టి.హరీశ్‌రావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. భూసేకరణ తదితర చట్టపరమైన పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నామని ఆయన వివరించారు. భూసేకరణ పూర్తయ్యాక ఆయా చెరువుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ప్రతిపాదనలను పంపాలని చిన్న నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించినట్టు తెలిపారు. ఈ చెరువుల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని స్థానిక ఎమ్మెల్యేలు, మూడు జిల్లాల కలెక్టర్లు, ఇంజనీర్లను కోరామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో 26 కొత్త చెరువులు తవ్వాలని ఇదివరకే నిర్ణయించిన విషయాన్ని హరీశ్ గుర్తు చేశారు. వాటికి సంబంధించి స్టేజ్–1 అనుమతిని మంజూరు చేస్తూ ఈ మేరకు రూ.92 కోట్ల నిధులను మంజూరు చేసినట్టు ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment