కొన‘సాగుతున్న’ దర్యాప్తు
భీమవరం క్రైం : భీమవరంలోని రాయప్రోలు వారి వీధిలో 10 నెలల క్రితం జరిగినయువకుడి హత్య కేసు మిస్టరీ ఇప్పటికీ వీడలేదు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. స్థానిక మావుళ్లమ్మ దేవస్థానం ఉత్సవ కమిటీ అధ్యక్షుడు మానే పేరయ్య కుమారుడు ఆనంద్ భగవాన్ (24) గతేడాది ఆగస్టు 9 రాత్రి 8 గంటలకు స్నేహితుల దగ్గరికి వెళుతున్నానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తరువాత అతను నిర్జీవంగా కనిపించా డు. అతనిపై మోటార్ సైకిల్ పడి ఉంది.దీంతో బైక్ అదుపుతప్పి పడటంతో అతను మరణించి ఉంటాడని పోలీసులు భావించారు. భగవాన్ ముఖంపై బైక్ ముందు చక్రం డిస్క్ దిగిపోయి ఉంది.
డిస్క్‌ను అతని ముఖంపై పెట్టి నొక్కినట్లు ఉందని పోలీసులు గ్రహించారు. అతని శరీరంపై ఇసుక కనిపించింది. దీంతో అతడిని ఎక్కడో హత్యచేసి ఇక్కడ పడేశారని పోలీసు లు నిర్ధారణకు వచ్చి హత్య కేసు నమోదు చేశారు.
సీసీఎస్‌కు అప్పగించినా పురోగతి లేదు : భగవాన్ హత్య కేసును భీమవరం సీసీఎస్ సీఐ జగన్మోహన్‌రావుకు అప్పగించినా ఎటువంటి పురోగతి కనిపించలేదు. చోరీ కేసుల్లో రికవరీలు బాగా చేస్తారనే పేరున్న జగన్మోహన్‌రావు అయితే ఈకేసును వేగవంతంగా ఛేదిస్తారని ఉన్నతాధికారులు ఆయనకు ఈ కేసు అప్పగించారని తెలిసింది. హత్య జరిగిన కొన్ని నెలలకు ఆయన బదలీపై వె ళ్లిపోయారు. దీంతో ఆ కేసు నత్తనడకన సాగుతోంది.
పోలీసులు చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు
తన కుమారుడిని హత్య చేసిన వారిని ఎప్పుడు అరెస్టు చేస్తారా అని భగవాన్ తండ్రి పేరయ్య ఎదురు చూస్తున్నారు. అనేక సార్లు ఆయన పోలీసుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. కుమారుడి హత్యను జీర్ణించుకోలేని అతని తల్లి బెంగ పెట్టుకుని మంచమెక్కారు. పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని ఆయన కోరుతున్నారు. ఎస్పీ హరికృష్ణ దీనిపై దృష్టి సారించాలని అభ్యర్థిస్తున్నారు.