న్యూఢిల్లీ: వివాదాస్పద రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం విషయంలో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం బుధవారం సంచలన వ్యాఖ్యలు చేసింది. రఫేల్ డీల్‌కు సంబంధించిన పత్రాలు చోరీకి గురయ్యాయని, వీటిని ప్రభుత్వ ఉద్యోగులే దొంగలించి ఉంటారని పేర్కొంది.
రఫేల్ యుద్ధ విమానాలను ఎంతకు కొనుగోలు చేశారు? వాటి ధర ఎంత? అన్నది రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్న నేపథ్యంలో రఫేల్ ధరలకు సంబంధించిన పత్రాలు రక్షణ మంత్రిత్వశాఖ నుంచి దొంగలించబడ్డాయని, ప్రచురణ కోసం ఈ పత్రాలను ‘ది హిందూ’ న్యూస్‌పేపర్‌కు అందించారని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.
రఫేల్ ఒప్పందంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌లో.. దొంగలించిన పత్రాల నుంచి సేకరించిన విషయాలు ఉన్నాయని, కాబట్టి ఆయన పిటిషన్ కొట్టివేయాలని వేణుగోపాల్ సుప్రీంకోర్టును అభ్యర్థించారు. పత్రాలు దొంగలించిన వారు.. అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు దోషులుగా మారుతారని ఆయన తెలిపారు. అయితే, ఈ విషయంలో చట్టపరమైన ఉల్లంఘనలేమీ లేవని, ఈ పత్రాల్లోని సమాచారం సమాచార హక్కు చట్టం పరిధిలోనేదేనని ప్రశాంత్ భూషణ్ కోర్టుకు స్పష్టం చేశారు. ఫ్రెంచ్ నుంచి యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన రఫేల్ ఒప్పందంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వాగ్యుద్ధం కొనసాగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment