ప్రమాదంలో ‘న్యాయ’ స్వతంత్రత | Harassment allegations against CJI Ranjan Gogoi | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో ‘న్యాయ’ స్వతంత్రత

Published Sun, Apr 21 2019 4:12 AM | Last Updated on Sun, Apr 21 2019 5:13 AM

Harassment allegations against CJI Ranjan Gogoi - Sakshi

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌

న్యూఢిల్లీ: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. సీజేఐ కార్యాలయాన్ని అస్థిరపరిచేందుకు ఓ బలీయమైన శక్తి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. జస్టిస్‌ గొగోయ్‌ తనను లైంగికంగా వేధించారంటూ జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌(జేసీఏ)గా పనిచేసిన ఓ మహిళ(35) 22 మంది సుప్రీంకోర్టు జడ్జీలకు లేఖ రాయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు.  ఈ ఆరోపణల నేపథ్యంలో తన సారథ్యంలో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటుచేసిన గొగోయ్‌.. అత్యవసరంగా విచారణను చేపట్టారు. మరోవైపు జస్టిస్‌ గొగోయ్‌కు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా, సుప్రీంకోర్టు బార్‌ కౌన్సిల్, జాతీయ హరిత ట్రైబ్యునల్‌ బార్‌ కౌన్సిల్‌ సహా పలు న్యాయవాదుల సంఘాలు మద్దతు ప్రకటించాయి.

నాకంటే నా ప్యూన్‌ ఆస్తులే ఎక్కువ..
ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ గొగోయ్‌ మాట్లాడుతూ.. ‘జడ్జీలకు గౌరవం ఒక్కటే ఉంటుంది. నిరాధార ఆరోపణలతో ఏకంగా దానిపైనే దాడి జరిగితే బుద్ధి ఉన్నవారెవరూ జడ్జీ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకురారు. ఇలాంటి ఘటనలు జరిగితే ఏ జడ్జీ తీర్పులను వెలువరించరు. కోర్టులోకి సావధానంగా వచ్చి విచారణను వాయిదా వేస్తారు. నేను 20 ఏళ్లకు పైగా న్యాయమూర్తిగా పనిచేస్తున్నా. నా బ్యాంకులో రూ.6.80 లక్షలు మాత్రమే ఉన్నాయి. మరో రూ.40 లక్షల ప్రావిడెంట్‌ ఫండ్‌ ఉంది. మరో బ్యాంకు ఖాతాలో రూ.21.80 లక్షలు ఉండగా, వాటిలో రూ.15 లక్షలను గువాహటిలో ఇంటి మరమ్మతు కోసం నా కుమార్తె అందజేసింది. నా మొత్తం ఆస్తులు ఇవే. నేను న్యాయమూర్తి కావాలనుకున్నప్పుడు నా దగ్గర ఇంతకంటే ఎక్కువ ఆస్తులు ఉండేవి. ఇప్పుడు నా కంటే నా ఫ్యూన్‌ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. డబ్బు విషయంలో నన్నెవరూ ఇబ్బంది పెట్టలేరు. అందుకే ఇలా తప్పుడు ఆరోపణలతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నాపై వచ్చిన అభియోగాలపై మరీ అంతగా దిగజారిపోయి ఖండించలేను’ అని స్పష్టం చేశారు.

మీడియా విజ్ఞతకే వదిలేస్తున్నాం..
గతంలో ఓ సుప్రీం జడ్జితో పాటు సీనియర్‌ న్యాయవాదిపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఇందుకు సంబంధించి ఎలాంటి వార్తలను ప్రచురించరాదని మీడియాను సుప్రీం ఆదేశించిన విషయాన్ని అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ గుర్తుచేశారు. తాజాగా లైంగికవేధింపులకు సంబంధించిన ఆరోపణలను పలు వెబ్‌సైట్లు ప్రచురించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వేణుగోపాల్‌ వాదనలపై జస్టిస్‌ గొగోయ్‌ స్పందిస్తూ..‘పరిస్థితులు చాలాదూరం పోవడంతోనే ఈ అసాధారణ విచారణను చేపట్టాల్సి వచ్చింది. ఈ విషయంలో బాధ్యతాయుతంగా, నియంత్రణతో వ్యవహరించే అంశాన్ని మీడియా విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. ఈ కేసులో ఉత్తర్వులు ఇచ్చే అధికారాన్ని సీనియర్‌ జడ్జి జస్టిస్‌ మిశ్రాకు వదిలిపెడుతున్నా. ఇందులో నేను భాగం కాబోను’ అని తెలిపారు.

సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతీ ఉద్యోగి పట్ల న్యాయంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. ఇలాంటి విషయాల్లో న్యాయవ్యవస్థ బలిపశువు కారాదని జస్టిస్‌ మిశ్రా వ్యాఖ్యానించారు. ఉద్యోగం నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టినప్పుడు మౌనంగా ఉన్న సుప్రీంకోర్టు ఉద్యోగిని, అకస్మాత్తుగా సీజేఐపై ఆరోపణలు చేస్తున్నారని జస్టిస్‌ ఖన్నా చెప్పారు. ఈ కేసును 30 నిమిషాలపాటు విచారించాక ఈ వ్యవహారంలో ఎప్పుడు అవసరమైతే అప్పుడు న్యాయపరమైన ఉత్తర్వులు జారీచేస్తామని కోర్టు తెలిపింది. ఇలాంటి ఆరోపణల వల్ల న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వసనీయత సడలిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది.

సుప్రీం ప్రధాన కార్యదర్శిæ సుధాకర్‌ మాట్లాడుతూ.. మాజీ జేసీఏ లేఖ కొన్ని మీడియా పోర్టల్స్‌లో ఉదయం 8–9 గంటల మధ్యలో రాగా, తమకు 9.30 గంటల ప్రాంతంలో తెలిసిందని వ్యాఖ్యానించారు. సీజేఐ మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అనీ, ఆయన ఏ బెంచ్‌ను ఏర్పాటుచేస్తే వారే కేసును విచారిస్తారని స్పష్టం చేశారు. కాగా, ప్రత్యేకబెంచ్‌లో సీజేఐ జస్టిస్‌ గొగోయ్‌ సభ్యుడిగా ఉండొచ్చా? అన్న విషయమై లాయర్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇంతవరకూ స్పందించలేదు. కాగా, నవీన్‌ అనే వ్యక్తికి సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.50,000 వసూలుచేసిన కేసులో ఈ మాజీ జేసీఏకు మంజూరుచేసిన బెయిల్‌ను రద్దుచేయాలని ఢిల్లీ పోలీసులు ట్రయల్‌కోర్టును శనివారం ఆశ్రయించారు.

ఆమెపై 3 ఎఫ్‌ఐఆర్‌లున్నాయ్‌..
తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన మాజీ జేసీఏకు నేరచరిత్ర ఉందని జస్టిస్‌ గొగోయ్‌ తెలిపారు. ‘కోర్టులో చేరేనాటికే ఆమెపై ఓ ఎఫ్‌ఐఆర్‌ పెండింగ్‌లో ఉంది. బెయిల్‌పై విడుదలయ్యాక ఓ సాక్షిని బెదిరించడంతో ఆమెపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల సంఖ్య మూడుకు చేరింది. ఎఫ్‌ఐఆర్‌లు పెండింగ్‌లో ఉన్నప్పుడు అసలు సుప్రీంకోర్టు సిబ్బందిగా ఆమెను ఎలా ఎంపికచేశారు? నేరచరిత్ర కారణంగా ఆమె నాలుగురోజుల పాటు జైలులో గడిపారు. ప్రస్తుతం స్వతంత్ర న్యాయవ్యవస్థ అదిపెద్ద ప్రమాదంలో ఉంది. దీన్ని నేను అనుమతించను. నా పదవీకాలం ఉన్న మరో 7 నెలల పాటు ఈ కుర్చీలో పక్షపాతంలేకుండా ధైర్యంగా తీర్పులను వెలువరిస్తా’ అని వెల్లడించారు.

లేఖలో ఏముంది?
‘‘నేను సుప్రీంకోర్టులో జేసీఏగా లైబ్రరీలో టైపింగ్, డాక్యుమెంటేషన్‌ పనులను చేసేదాన్ని. జస్టిస్‌ గొగోయ్‌ వద్ద పనిచేసే జేసీఏ.. సెలవుపై వెళ్లడంతో ఆయన స్థానంలో నన్ను 2016, అక్టోబర్‌లో నియమించారు. 2018 ఆగస్టులో తన రెసిడెన్స్‌ ఆఫీస్‌లో నన్ను ఆయన చేరమన్నారు. ఓరోజు ఆఫీస్‌లో ఉన్నపుడు ‘నా భార్య, నా కూతురు తర్వాత నువ్వు నా మూడో ఆస్తివి’ అని అన్నారు. తాను సీజేఐ అయ్యాక తప్పకుండా సాయం చేస్తామని పదేపదే చెప్పేవారు. అయితే మా బావ దివ్యాంగుడనీ, ఆయనకు ఉద్యోగమేదీ లేదని చెప్పా. సీజేఐగా బాధ్యతలు చేపట్టగానే మా బావను జూనియర్‌ కోర్ట్‌ అటెండెంట్‌గా నియమించారు. తర్వాత నన్ను ఆఫీస్‌కు పిలిచి నా తలను, వీపును, వెనుకభాగాన్ని తడిమారు. 2018, అక్టోబర్‌ 11న ఆఫీసులో గొగోయ్‌ నా పక్కకు వచ్చి నిలబడి నా నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కున్నారు. వెంటనే నేను ఆయన్ను వెనక్కి తోసి భయంతో డెస్క్‌లో కూర్చుండిపోయాను. ఇది జరిగిన కొద్దిరోజులకే తాను క్రమశిక్షణను ఉల్లంఘించినట్లు మెమో ఇచ్చారు. అక్టోబర్, నవంబర్‌ మధ్యలో నన్ను మూడుసార్లు బదిలీ చేశారు. అధికారుల నిర్ణయాన్ని ప్రశ్నించాననీ, అధికారులను ప్రభావితం చేసేందుకు యత్నించాననీ, చెప్పకుండా విధులకు గైర్హాజరయ్యానని నాపై 3 అభియోగాలు నమోదుచేశారు. డిసెంబర్‌ 21న నన్ను విధుల నుంచి తొలగించారు’’ అని ఆమె లేఖలో పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement