సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు భారీ ఊరట | SC Panel Gives Clean Chit to CJI Gogoi in Sexual Harassment Case | Sakshi
Sakshi News home page

సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు భారీ ఊరట

Published Mon, May 6 2019 5:30 PM | Last Updated on Mon, May 6 2019 6:20 PM

 SC Panel Gives Clean Chit to CJI Gogoi in Sexual Harassment Case - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌కు భారీ ఊరట లభించింది.  ఆరోప‌ణ‌ల్లో వాస్తవం లేద‌ని ముగ్గురు స‌భ్యుల అంతర్గత క‌మిటీ  సోమవారం తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన  ఈ  కేసులో ఇది కీలక పరిణామం.

సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని దాఖలు చేసిన అఫిడవిట్‌పై నియమించిన 'ఇన్ హౌజ్’ కమిటీ  గొగోయ్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జస్టిస్‌  రంజన్‌  గొగోయ్‌పై  వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేదంటూ తన నివేదికను సుప్రీంకోర్టు సమర్పించింది. గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలను అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చిందంటూ  సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన జారీ చేశారు.  అంతేకాదు  ఈ రిపోర్టును బహిర్గతం చేయలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. 

గొగోయ్‌కు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన మహిళా ఉద్యోగి సీజేఐ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19న ఆమె లేఖ రాశారు. గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని ఆమె సంచలన  ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా దీనిలో సభ్యులుగా ఉన్నారు.

కాగా విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వక్తం చేసిన బాధితురాలు, ఇన్-హౌజ్ కమిటీ ప్రక్రియను గానీ, విశాఖ మార్గదర్శకాలను గానీ ఆ విచారణ కమిటీ పాటించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరుగుతుందున్న నమ్మకం లేదంటూ విచారణకు హాజరు కానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement