gogoi
-
సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్‌కు భారీ ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు భారీ ఊరట లభించింది. ఆరోపణల్లో వాస్తవం లేదని ముగ్గురు సభ్యుల అంతర్గత కమిటీ సోమవారం తేల్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో ఇది కీలక పరిణామం. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని దాఖలు చేసిన అఫిడవిట్‌పై నియమించిన 'ఇన్ హౌజ్’ కమిటీ గొగోయ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ఎలాంటి సాక్ష్యం లేదంటూ తన నివేదికను సుప్రీంకోర్టు సమర్పించింది. గొగోయ్‌పై వచ్చిన ఆరోపణలను అంతర్గత విచారణ కమిటీ తోసిపుచ్చిందంటూ సుప్రీంకోర్టు ప్రధాన కార్యదర్శి ఒక ప్రకటన జారీ చేశారు. అంతేకాదు ఈ రిపోర్టును బహిర్గతం చేయలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. గొగోయ్‌కు జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన మహిళా ఉద్యోగి సీజేఐ తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ మొత్తం 22 మంది సుప్రీం కోర్టు జడ్జిలకు ఏప్రిల్ 19న ఆమె లేఖ రాశారు. గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, తర్వాత తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యులను బాధితులుగా మార్చారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ ఎస్ఏ బోబ్డే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రా దీనిలో సభ్యులుగా ఉన్నారు. కాగా విచారణ జరుగుతున్న తీరుపై అసంతృప్తి వక్తం చేసిన బాధితురాలు, ఇన్-హౌజ్ కమిటీ ప్రక్రియను గానీ, విశాఖ మార్గదర్శకాలను గానీ ఆ విచారణ కమిటీ పాటించడం లేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తనకు న్యాయం జరుగుతుందున్న నమ్మకం లేదంటూ విచారణకు హాజరు కానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. -
సీజేఐపై లైంగిక ఆరోపణల కేసు : కీలక పరిణామం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఆరోపణల విచారణకు త్రిసభ్య ధర్మాసనం ఏరాటైంది. సీజేఐ ఆదేశం మేరకు ఏర్పాటైన ముగ్గరు సభ్యుల ఇన్‌హౌస్ ప్యానెల్‌కు జస్టిస్ శరత్అ రవింద్ బోబ్డే అధ్యక్షత వహిస్తారు. ఇందులో సీనియర్ జడ్జి ఎన్వీ రమణతో పాటు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీ ఆరోపణలు చేసిన మహిళకు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని కోరింది. ఏప్రిల్ 26 న జరిగే కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అలాగే సంబంధిత అన్ని పత్రాలు, ఇతర మెటీరియల్‌తో సిద్ధంగా ఉండాలని కోర్టు సెక్రటరీని కూడా కోరింది. కాగా తనను జస్టిస్ గొగోయ్ లైంగిక వేధించడంతో పాటు, అకారణంగా ఉద్యోగంనుంచి తొలగించారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు 22మంది సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలకు సమర్పించిన అఫిడవిట్ కలకలం రేసింది. దీనిపై ఏప్రిల్ 26, శుక్రవారం తొలి వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా అంతర్గత విచారణకు ఆదేశించడంపై విమర్శలు చెలరేగాయి. అయితే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను జస్టిస్ గొగోయ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
సీజేఐ రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణల సంచలనం
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జస్టిస్ రంజన్ గోగొయ్ గతంలో తనను లైంగికంగా వేధించారని ఆరోపిస్తూ 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్‌గా పని చేసిన ఆమె 22మంది న్యాయమూర్తులకు సమర్పించిన అఫిడవిట్లో ఈ ఆరోపణలు చేశారు. 2018 అక్టోబర్ 10, 11 తేదీల్లో జస్టిస్ గొగోయ్ తన పట్ల అనుచితంగా ప్రవర్తించి, వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. ఆయన వేధింపులకు తిరస్కరించినందుకు తనను, తన కుటుంబాన్ని ఇబ్బందుల పాలు చేశారని, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనకు న్యాయం చేయాలని కోరుతో సుప్రీం జడ్జిలను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో నేడు (శనివారం, ఏప్రిల్20న) సిజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీజేఐ రంజన్ గొగోయ్ స్పందన ఈ ఆరోపణలను ఖండించిన ప్రధాన నాయ్యమమూర్తి ఇరవై ఏళ్లపాటు నిస్వార్థంగా సేవలందించిన తనపై ఇలాంటి ఆరోపణలు రావడం నమ్మలేకపోతున్నానన్నారు. తనను తొలగించాలనే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతోందన్నారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ప్రమాదం పొంచి వుందంటూ గొగోయ్ ఆవేదన వ్యక్తం చేశారు. అఫిడవిట్లో ఆమె చేసిన ఆరోపణలు ఆగష్టు 2018 లో ఆయన ఆఫీసులో నియామకం అనంతరం లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. ఈ వేధింపులను ప్రతిఘటించిన నేపథ్యంలో అనుమతి లేకుండా ఒక రోజు సాధారణ సెలవు తీసుకున్న కారణంగా డిసెంబర్ 21 న సర్వీసులనుంచి తొలగించారు. అంతేకాదు ఈ సెగ నా కుటుంబాన్ని కూడా చుట్టుముట్టింది. ఢిల్లీలో హెడ్ కానిస్టేబుల్స్‌గా పనిచేస్తున్న నా భర్త, సోదరుడు డిసెంబరు 28, 2018 (పరస్పరం అంగీకారంతో రద్దు చేసుకున్న 2012 నాటి కేసు ఆధారంగా) సస్పెన్షన్‌కు గురయ్యారు. జనవరి 11 న, ప్రధాన న్యాయమూర్తి, ఒక మహిళా పోలీసు అధికారి సమక్షంలో జస్టిస్ గొగోయ్ భార్యకు క్షమాపణలు చెప్పించారు. అలా ఎందుకు చేశారో అర్థంకానప్పటికీ, పై అధికారి సూచలను అనుసరించాను. ఆమె చెప్పినట్లే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాను. అయినా వేధింపుల పర్వం ఆగలేదు. టెంపరరీ జూనియర్ కోర్టు అటెండెంట్‌గా ఉన్న దివ్యాంగుడైన నాబంధువును సర్వీసు నుంచి తొలగిస్తూ జనవరి 14న ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తరువాత రాజస్థాన్‌లోని గ్రామానికి వెళ్లిన నన్ను, నా భర్తను, చీటింగ్ కేసులో విచారించాలంటూ మార్చి 9 న ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ( 2017లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ. 50 వేలు తీసుకుని మోసం చేసిందనేది ఆరోపణ). ఆ మరుసటి రోజు తనతోపాటు, భర్త, బావ, ఆయన భార్య, ఇతర బంధువును తిలక్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా 24 గంటల పాటు కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి, తిండి, నీళ్లు ఇవ్వకుండా శారీరకంగా హింసించడంతో పాటు దుర్భాషలాడారు. ఈ ఆరోపణలకు తోడు వీటికి సంబంధించి కొంత వీడియో ఫుటేజ్‌ను, ఫోటోలను ఆమె అఫిడవిట్లో పొందుపర్చారు. అటు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ ఈ ఆరోపణలను తిరస్కరించారు. ఇవి పూర్తిగా తప్పుడు, దురదృష్టకరమైన ఆరోపణలని పేర్కొన్నారు. సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని మండిపడ్డారు. ఆమెకు నేర చరిత ఉందని ఆమెపై ఇప్పటికే రెండు ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్నారు. -
లాయర్లపై నిషేధం ఎత్తివేతకు సీజేఐ నో
న్యూఢిల్లీ: సమ్మెకు దిగిన న్యాయవాదులపై ఉన్న నిషేధం తొలగించాలన్న సూచనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తిరస్కరించారు. అసలు సమ్మె ఎందుకు చేయాలని ఆయన ప్రశ్నించారు. నూతన సీజేఐ గౌరవార్థం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గొగోయ్ మాట్లాడారు. ‘అసలు ఇది ఒక సమస్యే కాదు. అలాంటప్పుడు చట్ట బద్ధమా కాదా అన్న విషయం ఎందుకు? సమ్మె ఎందుకు చేశారు? ఆ అవసరమే లేదని నా నమ్మకం’ అని అన్నారు. లాయర్లు లేకుంటే కోర్టులు పనిచేయవు.. సమ్మె వల్ల ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు భంగం వాటిల్లినట్లే అని అన్నారు. ఆయన అభిప్రాయంతో కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ అరుణ్ మిశ్రా ఏకీభవించారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడటం వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే సమ్మెకు బార్ అసోసియేషన్ మద్దతివ్వాలన్నారు. సమ్మెలో పాల్గొన్న లాయర్లపై ఉన్న 16 ఏళ్ల నిషేధాన్ని ఎత్తి వేయాలని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా చేసిన సూచనపై వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్ కూడా పాల్గొన్నారు. -
ఏ ర్యాంక్ అధికారి అయినా తప్పుచేస్తే శిక్ష తప్పదు
-
కామాఖ్య మాతను ప్రార్థించిన గోగోయ్!
గౌహతిః అసోం అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ముఖ్యమంత్రి తరుణ్ గోగోయ్ తెల్లవారుజాము కామాఖ్య దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అసోం ఎగ్జిట్ పోల్స్ సర్వేలను బట్టి బీజేపీకే విజయం కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో... వెనుకబడిపోతున్న కాంగ్రెస్ కు విజయాన్ని చేకూర్చాలని కోరుతూ గోగోయ్ కామాఖ్య మాతను దర్శించి ప్రార్థించారు. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలున్న అసోంలో పదిహేనేళ్ళుగా పాలనలో ఉన్న తమ పార్టీని ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ గట్టెంకించమని గోగోయ్ ఉదయం కామాఖ్య మాతను కోరుకున్నారు. ఫలితాల లెక్కింపు నేపథ్యంలో గురువారం ఉదయం ఆలయాన్ని దర్శించిన అనంతరం... ప్రజలే నిర్ణయాన్ని తీసుకుంటారని, ఫలితాలు ఎలా ఉన్నా శిరస్సావహించాల్సిందేనని అన్నారు. అయితే ప్రస్తుతం తమ విజయంతోపాటు, ప్రజలను రక్షించేందుకు కామాఖ్య మాత తప్పనిసరిగా సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
కేంద్ర బలగాల వైఫల్యం వల్లే..
కొహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్‌లోని దిమాపూర్‌లో రేప్ నిందితుడిని కొట్టి చంపిన ఘటన అస్సాం-కేంద్ర ప్రభుత్వం మధ్య చిచ్చుకు దారితీస్తోంది. జైలు కేంద్ర బలగాల అధీనంలో ఉందని, ఆందోళనకారులు కారాగారంపైకి దూసుకురాకుండా నిలువరించడంలో ఆ బలగాలు విఫలమయ్యాయని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ ఆరోపించారు. ఈ ఘటనకు కేంద్ర బలగాలే కారణమని మండిపడ్డారు. ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినందుకు అస్సాంకు చెందిన సయ్యద్ ఫరీద్ ఖాన్‌ను గురువారం రాత్రి దిమాపూర్‌లో స్థానికులు సెంట్రల్ జైలు నుంచి బయటకు లాక్కొచ్చి కొట్టి చంపడం తెలిసిందే. 'ఆ జైల్లోని ఖైదీల రక్షణ కేంద్రం బాధ్యత. కానీ కేంద్ర బలగాలు విఫలమవడం వల్లే ఈ ఘటన చోటుచేసుకుంది. నాగాలాండ్‌లోని అస్సాం ప్రజలకు తగిన భద్రత కల్పించాలి' అని గొగోయ్ శనివారం పేర్కొన్నారు. నాగాలాండ్‌లో అస్సామీల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆ రాష్ట్ర సీఎం టీఆర్ జెలియాంగ్కు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖలు రాశారు. అస్సాంలో నాగాలాండ్ వాసులపై ప్రతీకార దాడులు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అటు నాగాలాండ్‌లోనూ అస్సామీల భద్రత కోసం రాష్ట్ర సర్కారు పెద్దఎత్తున పారామిలటరీ బలగాలను మోహరించింది. దిమాపూర్‌లో పరిస్థితి అదుపులోనే ఉన్నా భద్రతా బలగాలు 144 సెక్షన్ కొనసాగిస్తున్నాయి. ఫరీద్‌ను కొట్టి చంపిన కేసులో పోలీసులు ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించి, దోషులను శిక్షించాలని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ భారత విభాగం డిమాండ్ చేసింది. అస్సాం అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఈ ఘటనను ప్రస్తావిస్తూ.. నాగాలాండ్‌లో రాష్ట్రవాసుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. మరోవైపు రాజ్‌నాథ్‌సింగ్... నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. నిందితుడిని కొట్టి చంపినవారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సొంతూరుకు నిందితుడి భౌతికకాయం దిమాపూర్‌లో స్థానికుల చేతిలో మరణించిన ఫరీద్ ఖాన్ మృతదే హాన్ని శనివారం అస్సాంలోని అతడి స్వస్థలం కరీంగంజ్‌కు తరలించారు. అస్సాం ప్రభుత్వం ప్రత్యేక హెలికాప్టర్లో మృతదేహాన్ని తీసుకువచ్చి ఆయన బంధువులకు అప్పగించింది. ఖాన్‌ను చంపేయడంపై నిరసన వ్యక్తం చేస్తూ కరీంగంజ్తోపాటు అస్సాంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు ప్రదర్శనలు నిర్వహించారు. మేం బంగ్లాదేశ్ నుంచి వలస రాలేదు: ఫరీద్ సోదరుడు నాగాలాండ్‌కు వలస వచ్చినవారిని టార్గెట్ చేసిన గ్రూపులే ఫరీద్‌ను చంపేశాయని ఆయన సోదరుడు జమాలుద్దీన్ ఆరోపించారు. తన సోదరుడిని వారు జైలు నుంచి బయటకు తీసుకువచ్చిన సమయంలో పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. తాము బంగ్లాదేశ్ నుంచి వలస రాలేదని, తనతోపాటు మరో సోదరుడు కమాల్ ఖాన్ భారత సైన్యంలోని అస్సాం రెజిమెంట్‌లో పనిచేస్తున్నామని చెప్పారు.