
జస్టిస్ గొగోయ్
న్యూఢిల్లీ: సమ్మెకు దిగిన న్యాయవాదులపై ఉన్న నిషేధం తొలగించాలన్న సూచనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తిరస్కరించారు. అసలు సమ్మె ఎందుకు చేయాలని ఆయన ప్రశ్నించారు. నూతన సీజేఐ గౌరవార్థం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గొగోయ్ మాట్లాడారు. ‘అసలు ఇది ఒక సమస్యే కాదు. అలాంటప్పుడు చట్ట బద్ధమా కాదా అన్న విషయం ఎందుకు? సమ్మె ఎందుకు చేశారు? ఆ అవసరమే లేదని నా నమ్మకం’ అని అన్నారు.
లాయర్లు లేకుంటే కోర్టులు పనిచేయవు.. సమ్మె వల్ల ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు భంగం వాటిల్లినట్లే అని అన్నారు. ఆయన అభిప్రాయంతో కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ అరుణ్ మిశ్రా ఏకీభవించారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడటం వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే సమ్మెకు బార్ అసోసియేషన్ మద్దతివ్వాలన్నారు. సమ్మెలో పాల్గొన్న లాయర్లపై ఉన్న 16 ఏళ్ల నిషేధాన్ని ఎత్తి వేయాలని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా చేసిన సూచనపై వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌వీ రమణ, జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్ కూడా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment