Lawyers strike
-
లాయర్లపై నిషేధం ఎత్తివేతకు సీజేఐ నో
న్యూఢిల్లీ: సమ్మెకు దిగిన న్యాయవాదులపై ఉన్న నిషేధం తొలగించాలన్న సూచనను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్ తిరస్కరించారు. అసలు సమ్మె ఎందుకు చేయాలని ఆయన ప్రశ్నించారు. నూతన సీజేఐ గౌరవార్థం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ గొగోయ్ మాట్లాడారు. ‘అసలు ఇది ఒక సమస్యే కాదు. అలాంటప్పుడు చట్ట బద్ధమా కాదా అన్న విషయం ఎందుకు? సమ్మె ఎందుకు చేశారు? ఆ అవసరమే లేదని నా నమ్మకం’ అని అన్నారు. లాయర్లు లేకుంటే కోర్టులు పనిచేయవు.. సమ్మె వల్ల ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు భంగం వాటిల్లినట్లే అని అన్నారు. ఆయన అభిప్రాయంతో కార్యక్రమంలో పాల్గొన్న జస్టిస్ అరుణ్ మిశ్రా ఏకీభవించారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ మనుగడ ప్రమాదంలో పడటం వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే సమ్మెకు బార్ అసోసియేషన్ మద్దతివ్వాలన్నారు. సమ్మెలో పాల్గొన్న లాయర్లపై ఉన్న 16 ఏళ్ల నిషేధాన్ని ఎత్తి వేయాలని బీసీఐ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా చేసిన సూచనపై వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ మోహన్ ఎం.శంతనగౌడర్ కూడా పాల్గొన్నారు. -
సమ్మె విరమించండి
► ఆ తర్వాతే సమస్య పరిష్కారానికి కృషి చేస్తా ► తెలంగాణ న్యాయవాదులతో సీజేఐ ► న్యాయాధికారుల నియామకాలు ఆపేయాలని విన్నవించిన లాయర్లు ► హైకోర్టు విభజనలో జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన సమ్మె విరమిస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ టీఎస్ ఠాకూర్ హామీ ఇచ్చారని తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తెలంగాణ న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఆయన అధికార నివాసంలో కలుసుకున్నారు. రాష్ట్రంలో న్యాయాధికారుల సస్పెన్షన్ తర్వాత ఏర్పడిన పరిస్థితులను వివరించినట్లు న్యాయవాద సంఘాల ప్రతినిధులు ఎం.రాజేందర్ రెడ్డి, జి.మోహన్‌రావు, జి.జితేందర్ రెడ్డి విలేకరులకు తెలిపారు. న్యాయాధికారుల నియామకాలను వెంటనే నిలిపివేయాలని, సస్పెన్షన్లు ఎత్తివేయాలని, హైకోర్టు విభజన సమస్యలో జోక్యం చేసుకోవాలని కోరామన్నారు. దాదాపుగా గంటసేపు జరిగిన సమావేశంలో తాము చెప్పిన విషయాలను ప్రధాన న్యాయమూర్తి సావధానంగా విన్నట్లు న్యాయవాదులు వివరించారు. కేంద్రం మార్గదర్శకాలు లేకుండా న్యాయాధికారుల నియామకాలు జరిగాయని వారు వివరించారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కేంద్రం ఒక కమిటీ వేసి నియామకాలు జరపాలన్న ప్రతిపాదనకు సీజేఐ కూడా అంగీకరించారన్నారు. ఈ విషయంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రితో చర్చిస్తానని చెప్పారన్నారు. నిరసన విరమించుకుంటేనే తాను జోక్యం చేసుకుంటానని, లేకుంటే తప్పడు సంకేతాలు వేళ్లే అవకాశం ఉందని ప్రధాన న్యాయమూర్తి సూచించినట్లు వారు వివరించారు. సీజేఐ సూచనపై హైదరాబాద్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
బెళగావి బంద్ హింసాత్మకం
ఆందోళనకారుల దాడిలో ఆరు బస్సులు ధ్వంసం బెంగళూరు : బెళగావిలో కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (కేఏటీ)ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు బుధవారం నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. జిల్లా న్యాయవాదుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బెళగావి నగరంలో బంద్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు చెలరేగి పోయి బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆరు బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆందోళనలు తీవ్రతరం కాకుండా నగరంలో పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. బెళగావిలో కర్ణాటక అడ్మినిష్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా జిల్లా న్యాయవాదుల సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తోంది. అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించక పోవడంతో బుధవారం బంద్ నిర్వహించి న్యాయవాదులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. బంద్ సందర్భంగా ఉదయం నుంచే బెళగావి నగరంలోని వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. అంతేకాక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సైతం సెలవు ప్రకటించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించాయి. ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూసివేయాల్సిందిగా కన్నడ సంఘాలకు చెందిన కొందరు ఆందోళనకారులు కార్యాలయాల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.