ఆందోళనకారుల దాడిలో ఆరు బస్సులు ధ్వంసం
బెంగళూరు : బెళగావిలో కర్ణాటక అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ (కేఏటీ)ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో న్యాయవాదులు బుధవారం నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. జిల్లా న్యాయవాదుల సంఘం ఇచ్చిన పిలుపు మేరకు బెళగావి నగరంలో బంద్ నిర్వహిస్తున్న సమయంలో కొందరు ఆందోళనకారులు చెలరేగి పోయి బస్సులపై రాళ్లు రువ్వారు. దీంతో ఆరు బస్సులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నగరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక ఆందోళనలు తీవ్రతరం కాకుండా నగరంలో పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. బెళగావిలో కర్ణాటక అడ్మినిష్ట్రేషన్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలంటూ గత కొన్ని రోజులుగా జిల్లా న్యాయవాదుల సంఘం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తోంది.
అయితే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లభించక పోవడంతో బుధవారం బంద్ నిర్వహించి న్యాయవాదులు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. బంద్ సందర్భంగా ఉదయం నుంచే బెళగావి నగరంలోని వ్యాపార సముదాయాలు మూత పడ్డాయి. అంతేకాక ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సైతం సెలవు ప్రకటించారు. ఇక ప్రభుత్వ కార్యాలయాలు యధావిధిగా కార్యకలాపాలు నిర్వహించాయి. ప్రభుత్వ కార్యాలయాలను సైతం మూసివేయాల్సిందిగా కన్నడ సంఘాలకు చెందిన కొందరు ఆందోళనకారులు కార్యాలయాల్లోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు.
బెళగావి బంద్ హింసాత్మకం
Published Thu, Dec 4 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM
Advertisement
Advertisement