తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి.. | Lost Dog Returns Home Travelling Alone For 250 Kilometers | Sakshi
Sakshi News home page

తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి..

Published Wed, Jul 31 2024 6:02 PM | Last Updated on Wed, Jul 31 2024 8:22 PM

Lost Dog Returns Home Travelling Alone For 250 Kilometers

బెంగళూరు : కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటాం. అయితే కుక్కల్లో విశ్వాసమే కాదు.. అమితమైన ప్రేమ కూడా చూపిస్తాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. సాధారణంగా పెంపుడు కుక్కలు ఒక వీధి దాటి మరో వీధికి వెళ్లి తిరిగి రావడమే చాలా అరుదు. అలాంటి ఓ కుక్క ఏకంగా వందల కిలోమీర్లు ప్రయాణించింది. కొండలు,గుట్టలు, వాగులు,వంకలు దాటి చివరికి గమ్య స్థానానికి చేరుకుంది. దీంతో కుక్క యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా పిలిచి ఊరబంతి పెట్టించాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  

కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ప్రతి ఏడాది మహారాష్ట్రలోని పండరీపూర్‌లో ఉన్న విఠల్ రుక్మిణి (విఠలుడి దేవాలయం) ఆలయానికి పాదయాత్ర చేస్తుంటారు.  

అలా ఓ ఏడాది పాదయాత్ర చేస్తున్న తన వెంట ఓ కుక్కని నడిచింది. అందుకే దానికి ‘మహారాజ్’ అని పేరు పెట్టాడు. తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే సమయంలో మహారాజ్‌ను తన వెంటే తీసుకుని వెళ్లేవారు.

అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది విఠల్‌ రుక్మిణి ఆలయ దర్శనానికి వెళ్లారు. జూన్ చివరి వారంలో పాదయాత్రగా వెళ్లిన కమలేష్‌కు మహారాష్ట పండరీపూర్‌కు వెళ్లిన తర్వాత మహారాజ్‌ తప్పి పోయింది. కుక్క గురించి స్థానికులను అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కమలేష్‌ తన  పాదయాత్ర ముగించుకుని జులై 14న ఇంటికి చేరుకున్నారు.

ఈ తరుణంలో దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించిన కుక్క మహారాజ్‌ తన యజమాని కమలేష్‌ వద్దకు చేరింది. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తోక ఊపుతూ ఇంటి ముందున్న ‘మహారాజ్’ను చూసి కమలేష్ కుంభార్‌ ఆనందం పట్టలేకపోయాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని తన గ్రామానికి అది చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండురంగ నాథుడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు భావించాడు. మహారాజ్‌ మెడలో పూల దండ వేసి హారతి ఇచ్చి తన ఇంట్లోకి స్వాగతం పలికాడు. గ్రామస్తులకు విందు కూడా ఇచ్చాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement