Pandharpur
-
తప్పిపోయిన కుక్క.. 250 కిలోమీటర్లు ప్రయాణించి..
బెంగళూరు : కుక్కలను విశ్వాసానికి మారుపేరుగా చెబుతుంటాం. అయితే కుక్కల్లో విశ్వాసమే కాదు.. అమితమైన ప్రేమ కూడా చూపిస్తాయనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. సాధారణంగా పెంపుడు కుక్కలు ఒక వీధి దాటి మరో వీధికి వెళ్లి తిరిగి రావడమే చాలా అరుదు. అలాంటి ఓ కుక్క ఏకంగా వందల కిలోమీర్లు ప్రయాణించింది. కొండలు,గుట్టలు, వాగులు,వంకలు దాటి చివరికి గమ్య స్థానానికి చేరుకుంది. దీంతో కుక్క యజమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఊరంతా పిలిచి ఊరబంతి పెట్టించాడు. ప్రస్తుతం ఈ అరుదైన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని నిపాని తాలూకా యమగర్ని గ్రామానికి చెందిన కమలేష్ కుంభార్ ప్రతి ఏడాది మహారాష్ట్రలోని పండరీపూర్‌లో ఉన్న విఠల్ రుక్మిణి (విఠలుడి దేవాలయం) ఆలయానికి పాదయాత్ర చేస్తుంటారు. అలా ఓ ఏడాది పాదయాత్ర చేస్తున్న తన వెంట ఓ కుక్కని నడిచింది. అందుకే దానికి ‘మహారాజ్’ అని పేరు పెట్టాడు. తన ఇంట్లోనే పెంచుకుంటున్నాడు. పుణ్యక్షేత్రాలకు పాదయాత్రగా వెళ్లే సమయంలో మహారాజ్‌ను తన వెంటే తీసుకుని వెళ్లేవారు.అయితే ఎప్పటిలాగే ఈ ఏడాది విఠల్ రుక్మిణి ఆలయ దర్శనానికి వెళ్లారు. జూన్ చివరి వారంలో పాదయాత్రగా వెళ్లిన కమలేష్‌కు మహారాష్ట పండరీపూర్‌కు వెళ్లిన తర్వాత మహారాజ్ తప్పి పోయింది. కుక్క గురించి స్థానికులను అడిగినా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కమలేష్ తన పాదయాత్ర ముగించుకుని జులై 14న ఇంటికి చేరుకున్నారు.ఈ తరుణంలో దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణించిన కుక్క మహారాజ్ తన యజమాని కమలేష్ వద్దకు చేరింది. వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తోక ఊపుతూ ఇంటి ముందున్న ‘మహారాజ్’ను చూసి కమలేష్ కుంభార్ ఆనందం పట్టలేకపోయాడు. ఒంటరిగా 250 కిలోమీటర్లు ప్రయాణించి మహారాష్ట్ర నుంచి కర్ణాటకలోని తన గ్రామానికి అది చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయాడు. పాండురంగ నాథుడే ఆ కుక్కకు దారి చూపి తన ఇంటికి చేర్చినట్లు భావించాడు. మహారాజ్ మెడలో పూల దండ వేసి హారతి ఇచ్చి తన ఇంట్లోకి స్వాగతం పలికాడు. గ్రామస్తులకు విందు కూడా ఇచ్చాడు. -
ఏకాదశి ఉత్సవాల్లో సీఎం దంపతులు
ముంబైః ఆషాఢ ఏకాదశి ఉత్సవాలు మహరాష్ట్రలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్పవాల సందర్భంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, అయన భార్య అమృతా లు పండరపుర విఠల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏకాదశి సందర్భంగా ఆలయంలో నిర్వహించిన మహా పూజకు భక్తులు లక్షల్లో హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఆయన భార్య అమృతాలు పండరపుర విఠల్ దేవాలయాన్ని దర్శించారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా ప్రారంభమైన ఉత్సవాల్లో తెల్లవారుజామున మహాపూజ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి దంపతులు విఠలేశ్వరుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ మహారాష్ట్ర షోలాపూర్ జిల్లాలో కొలువైన పండరపుర విఠలుని ఏకాదశి దర్శనానికి లక్షల్లో భక్తులు క్యూ కట్టారు. ఆ విఠలేశ్వరుడు భక్తులందరినీ చల్లగా కాపాడాలని, ఆయన ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకున్నట్లు ఫడ్నవిస్ తెలిపారు. ఆషాఢ ఏకాదశి సందర్భంగా పండరపుర ఆలయంలో నిర్వహించే 'వారి' ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలలనుంచీ భక్తులు కాలినడకన వచ్చి స్వామిని దర్శించుకుంటారు. ఏకాదశి సందర్భంగా ముంబై 'వడాలా' లోని విఠల్ ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా స్వామిని దర్శించేందుకు వేలల్లో భక్తులు తరలివస్తారన్నఉద్దేశ్యంతో ముందుగానే ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ను మళ్ళించి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.