సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ రంజన్ గొగోయ్‌పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీజేఐపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగి ఆరోపణల విచారణకు త్రిసభ్య ధర్మాసనం ఏరాటైంది. సీజేఐ ఆదేశం మేరకు ఏర్పాటైన ముగ్గరు సభ్యుల ఇన్‌హౌస్ ప్యానెల్‌కు జస్టిస్ శరత్అ రవింద్ బోబ్డే అధ్యక్షత వహిస్తారు. ఇందులో సీనియర్ జడ్జి ఎన్‌వీ రమణతో పాటు మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఇందిరా బెనర్జీ సభ్యులుగా ఉంటారు. ఈ మేరకు కమిటీ ఆరోపణలు చేసిన మహిళకు నోటీసులు జారీ చేసింది. అఫిడవిట్‌పై వివరణ ఇవ్వాలని కోరింది. ఏప్రిల్ 26 న జరిగే కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. అలాగే సంబంధిత అన్ని పత్రాలు, ఇతర మెటీరియల్‌తో సిద్ధంగా ఉండాలని కోర్టు సెక్రటరీని కూడా కోరింది.
కాగా తనను జస్టిస్ గొగోయ్ లైంగిక వేధించడంతో పాటు, అకారణంగా ఉద్యోగంనుంచి తొలగించారని ఆరోపిస్తూ సుప్రీం కోర్టు మాజీ మహిళా ఉద్యోగి ఒకరు 22మంది సుప్రీంకోర్టు కోర్టు జడ్జిలకు సమర్పించిన అఫిడవిట్ కలకలం రేసింది. దీనిపై ఏప్రిల్ 26, శుక్రవారం తొలి వాదనలు జరగనున్నాయి. మరోవైపు ఆరోపణలు ఎదుర్కొంటున్న చీఫ్ జస్టిస్ స్వయంగా అంతర్గత విచారణకు ఆదేశించడంపై విమర్శలు చెలరేగాయి. అయితే తనపై వచ్చిన లైంగిక ఆరోపణలను జస్టిస్ గొగోయ్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment