సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునర్ సమీక్షించాలని కోరుతూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను.. పరిగణనలోకి తీసుకోకూడదంటూ ప్రభుత్వ అటార్నీ జనరల్ కేకే వేణు గోపాల్ బుధవారం కోర్టు ముందు చేసిన వాదన చిత్రంగా ఉంది. ‘రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పత్రాలను రక్షణ శాఖ నుంచి ఎవరో తస్కరించారు. అందులోని అంశాలను హిందూ ఆంగ్ల దిన పత్రిక ప్రచురిస్తే వాటిని ఆధారంగా చేసుకొని ప్రశాంత భూషణ్ పిటిషన్ దాఖలు చేశారు. అక్రమంగా సాధించిన డాక్యుమెంట్లను ఆధారం చేసుకున్నందున ఆ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకోకూడదు. పైగా ఆ డాక్యుమెంట్లలోని అంశాలను హిందూ పత్రిక ప్రచురించడం అనేది అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించడం అవుతుంది. ఆ మేరకు ఆ పత్రికపై చర్య తీసుకోవచ్చు’ అన్నది అటార్నీ జనరల్ చేసిన వాదన.
పిటిషన్‌లో సవాల్ చేసిన లేదా లేవనెత్తిన అంశాల్లో బలం ఉందా, లేదా ? అవి తప్పా, ఒప్పా ? అని వాదించాల్సిన అటార్నీ జనరల్, అవి దొంగలించినవి, అవి అక్రమంగా సంపాదించినవి అనడం చిత్రమే కాదు, అవివేకం కూడా. రఫేల్ పత్రాలను దొంగలించారంటే, ఆ లెక్కన ప్రశాంత్ భూషణ్ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలన్నీ నిజమని తేలినట్లే. పత్రిక మీద అధికార రహస్యాల చట్టం కింద చర్య తీసుకోమని సూచించడం అంటే కేంద్రానికి మద్దతుగా ఏదో దాస్తున్నట్లే లెక్క! మరో పక్క ఇది పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడమే.(రఫేల్ పత్రాలు చోరీ)
1923 నాటి చట్టం ఏమి చెబుతోంది?
భారత దేశానికి స్వాతంత్య్ర రాకముందు బ్రిటీష్ హయాంలో అంటే, 1923లో అధికార రహస్యాల చట్టం అమల్లోకి వచ్చింది. జాతీయ భద్రతా లేదా జాతీయ ప్రయోజనాల పరిరక్షణకు ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్లు నాటి నుంచి నేటి వరకు పాలకులు చెబుతున్నప్పటికీ ప్రభుత్వాలు ఇరుకున పడినప్పుడల్లా ఈ చట్టాన్ని ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయింది. పైగా 2005లో తీసుకొచ్చిన సమాచార హక్కుకు ఈ అధికార రహస్యాల చట్టం పూర్తి భిన్నంగా ఉంది. ఈ చట్టాన్ని సమీక్షించాల్సిందిగా ఎప్పటి నుంచో డిమాండ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వమే 2015లో చట్టం సమీక్షకు ఓ ప్యానెల్‌ను నియమించింది. ఆ ప్యానెల్ సమీక్ష ఎంతవరకు వచ్చిందో తెలియదు. ఇంకెంత కాలం పడుతుందో తెలియదు. ఈ నేపథ్యంలో రెండు చట్టాలు పరస్పరం భిన్నంగా ఉన్నందున ప్రభుత్వ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి.
గతంలో కేసులు
భారత సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని మిలిటెంట్లకు అందజేశారన్న ఆరోపణలపై ఓ కశ్మీర్ జర్నలిస్ట్‌పై అధికార రహస్యాల చట్టం కింద 2006లో కేసు పెట్టారు. దర్యాప్తు సందర్భంగా ఆ సమాచారం ఎంత మాత్రం రహస్యమైనది కాదని, అది ప్రజలందరికి అందుబాటులో ఉన్న సమాచారమేనని తేలింది. పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించిన కేబినెట్ నోట్‌ను బయట పెట్టినందుకు 1998లో కూడా ఓ జర్నలిస్టుపై ఈ చట్టం కింద కేసు పెట్టి వేధించారు.
అమెరికా సుప్రీం కోర్టు ఏమి తీర్పు ఇచ్చింది ?
‘వియత్నాంతో ఎన్నేళ్లు యుద్ధం చేసినా విజయం సాధించడం కష్టం. రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధం చేయక తప్పడం లేదు. వేలాది మంది యువకుల ప్రాణాలు వృథా అవుతున్నాయి. ప్రాణ నష్టంతోపాటు ఎంతో అర్థిక నష్టం జరుగుతోంది’ అన్న కీలక సమాచారం కలిగిన ప్రభుత్వ రహస్య డాక్యుమెంట్లు అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ కాలంలో అమెరికాలోని ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికకు దొరికాయి. వాటిని ప్రచురించాలా, వద్దా ? అని అప్పటి ఎడిటర్ ఇన్ చీఫ్ బెన్ బ్రాడ్లీ సంశయించారు. చివరకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రచురించాలని నిర్ణయించుకొని వరుసగా ప్రచురించారు. అందులో ఓ భాగాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కూడా ప్రచురించింది. జాతీయ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఆ రెండు పత్రికలపైనా అమెరికా ప్రభుత్వం ‘యూఎస్ ఎస్పనేజ్ యాక్ట్’ కింద కేసులు పెట్టింది. పత్రికా స్వేచ్ఛ ప్రకారం ఆ డాక్యుమెంట్లను ప్రచురించడంలో తప్పు లేదంటూ తొమ్మిది మంది సభ్యులు గల అమెరికా జ్యూరీ 6-3 తేడాతో మెజారిటీ తీర్పు చెప్పింది.
‘ది పోస్ట్’ పేరిట సినిమా
పత్రికల న్యాయపోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకొని హాలివుడ్ ప్రముఖ దర్శక, నిర్మాత స్టీవెన్ స్పీల్‌బెర్గ్ ‘ది పోస్ట్’ చిత్రాన్ని నిర్మించారు. 2017లో విడుదలైన ఈ చిత్రంలో పత్రికా సంపాదకుడిగా టామ్ హాంక్స్ నటించారు. పలు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు అందుకున్న ఈ సినిమా ఆస్కార్‌కు నామినేట్ అయినా అవార్డులు మాత్రం రాలేదు.
Comments
Please login to add a commentAdd a comment