law enforcement
-
మీరు చేయకపోతే.. మేమే స్టే విధిస్తాం
న్యూఢిల్లీ: వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులతో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతు ప్రతినిధులతో కేంద్రం జరుపుతున్న చర్చల ప్రక్రియ అత్యంత నిరుత్సాహపూరితంగా సాగుతోందని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అవసరమైతే వ్యవసాయ చట్టాల అమలుపై స్టే విధిస్తామని స్పష్టం చేసింది. సమస్య పరిష్కారం కోసం మరింత సమయం కావాలన్న కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తేల్చిచెప్పింది. సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం లభించే వరకు ఆ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని, ఆ చట్టాల అమలుపై అంత పట్టుదల ఎందుకని కేంద్రాన్ని ఘాటుగా ప్రశ్నించింది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపేయాలన్న తమ సూచనపై కేంద్రం ఇప్పటివరకు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఆ చట్టాల అమలును నిలిపేయండి. లేదంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ సిఫారసుల మేరకు మేమే స్టే విధించాల్సి వస్తుంది’అని హెచ్చరించింది. చట్టాలపై స్టే విధించాలనుకోవడం లేదని, వాటి అమలును మాత్రమే తాత్కాలికంగా నిలిపేసి, సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేయాలన్నది తమ ఉద్దేశమని పేర్కొంది. చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేస్తే.. కోర్టు ఏర్పాటు చేయనున్న కమిటీకి పరిష్కారం కనుగొనడం సులభమవుతుందని వివరించింది. కొత్త వ్యవసాయ చట్టాలు, రైతు ఆందోళనలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై నేడు(మంగళవారం) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం కీలక ఆదేశాలు ఇవ్వనుంది. సమస్య పరిష్కారం కోసం సూచనలు చేసేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. అమలుపై స్టే ఇవ్వలేరు విచారణ సందర్భంగా ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ప్రాథమికహక్కులకు భంగం కలిగిస్తోందనో, లేక రాజ్యాంగ పరిధిలో లేదనో కోర్టు భావిస్తేనే.. చట్టాల అమలుపై స్టే విధించడం సాధ్యమవుతుందని ఆయన వాదించారు. పిటిషనర్లు తమ వాదనల్లో ఈ అంశాలను లేవనెత్తలేదని గుర్తు చేశారు. దానికి స్పందించిన ధర్మాసనం.. ‘మీరు పరిష్కారం కనుగొనడంలో విఫలమైనందువల్లనే మేం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మీరు చేసిన చట్టాలు రైతుల ఆందోళనలకు కారణమయ్యాయి. ఆ సమస్యను మీరే పరిష్కరించాలి’అని వ్యాఖ్యానించింది. అసాధారణ పరిస్థితుల్లో తప్పిస్తే.. చట్టాలపై స్టే విధించడానికి తాము వ్యతిరేకమేనని పేర్కొంది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును సుప్రీంకోర్టు నిలిపివేసిన విషయాన్ని జస్టిస్ బోపన్న, జస్టిస్ రామసుబ్రమణియన్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం గుర్తు చేసింది. చట్టాల అమలుపై స్టే విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుల జాబితాను తమకు అందించాలని అటార్నీ జనరల్ వేణుగోపాల్‌ను కోరింది. వ్యవసా య చట్టాలను పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తు చేసింది. ఈ చట్టాలు ప్రయోజనకరమని పేర్కొనే ఒక్క పిటిషన్ కూడా తమ ముందుకు రాలేదని వ్యాఖ్యానించింది. ఆందోళనలు కొనసాగించవచ్చు ‘చట్టాల అమలును నిలిపివేసిన తరువాత కూడా ఆందోళనలను కొనసాగించుకోవచ్చు. ఆందోళనల గొంతు నులిమేశామన్న విమర్శలను మేం కోరుకోవడం లేదు’అని రైతు సంఘాల తరఫున హాజరైన న్యాయవాదులతో ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమస్య పరిష్కారం కోసం ఏర్పాటు చేసే కమిటీకి నేతృత్వం వహించేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోధా సహా రెండు, మూడు పేర్లను సూచించాలని ఇరువర్గాలను ధర్మాసనం కోరింది. సమస్య పరిష్కారానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, అందులో ప్రభుత్వ, రైతు సంఘాల ప్రతినిధులు కూడా సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రభుత్వం, రైతు ప్రతినిధుల మధ్య జనవరి 15న మరో విడత చర్చలు జరగనున్నాయని, ఆ లోపు ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని అటార్నీ జనరల్ వేణుగోపాల్ కోర్టును కోరారు. దీనిపై స్పందిస్తూ.. చర్చల విషయంలో ప్రభుత్వ తీరు సరిగ్గా ఉందని తాము భావించడం లేదని వ్యాఖ్యానించింది. చట్టాల అమలుపై స్టే విధిస్తే.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగే అవకాశముందని పేర్కొంది. ‘స్టే’తో లాభం లేదు వివాదాస్పద వ్యవసాయ చట్టాల అమలును కేంద్రం కానీ, సుప్రీంకోర్టు కానీ తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ.. ఆ చట్టాల రద్దు కోసం తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేతలు స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను తాము స్వాగతిస్తున్నామని, అయితే, చట్టాల అమలుపై స్టే విధించడం పరిష్కారం కాబోదన్నది తమ అభిప్రాయమని భారతీయ కిసాన్ యూనియన్ హరియాణా శాఖ అధ్యక్షుడు గుర్నామ్ సింగ్ చాదునీ పేర్కొన్నారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయడమొక్కటే ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. రాజ్యాంగవిరుద్ధమైన ఆ చట్టాలను సుప్రీంకోర్టు రద్దు చేయాలని ఇండియన్ ఫార్మర్స్ యూనియన్ అధ్యక్షుడు భోగ్ సింగ్ మాన్సా కోరారు. కొనసాగితే హింసాత్మకం.. రైతుల ఆందోళన ఎక్కువకాలం కొనసాగితే అది హింసాత్మకంగా మారే ప్రమాదముందని సుప్రీంకోర్టు ఆందోళన వెలిబుచ్చింది. ‘మనందరిపై బాధ్యత ఉంది. ఏ చిన్న సంఘటన అయినా హింసకు దారి తీయవచ్చు. అలాంటిది ఏదైనా జరిగితే మనమంతా బాధ్యులమవుతాం. ఎవరి మరణానికి కూడా మనం బాధ్యులం కాకూడదు’ అని వ్యాఖ్యానించింది. చట్టాలను ఉల్లంఘించేవారిని తాము కాపాడబోమని పేర్కొంది. పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఈ చట్టాలను రూపొందించిందని అసంతృప్తి వ్యక్తం చేసింది. రాజ్యాంగ విరుద్ధమని స్పష్టమైతేనే.. సాగు చట్టాలు అన్యాయమైనవని, ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తాయని, రాజ్యాంగ విరుద్ధమైనవని నిర్ధారణ అయితే చట్టాలపై కోర్టు స్టే విధించగలుగుతుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ విరుద్ధమని గట్టి ఆధారాలుంటే తప్ప పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడం సాధ్యం కాదని న్యాయ నిపుణుడు రాకేశ్ ద్వివేదీ స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ వాదన వినకుండానే ఒక నిర్ధారణకు వచ్చారు. పార్లమెంటు చేసిన చట్టాలపై స్టే విధించడానికి పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేయడం ప్రాతిపదిక కాకూడదు. ఎంపీల విజ్ఞతకు సంబంధించిన విషయమిది. కోర్టు పరిధిలో లేని అంశమిది’ అని ద్వివేదీ పేర్కొన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నారు కాబట్టి చట్టాలను నిలిపేయాలనడం సరికాదన్నారు. -
‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా నిర్ధారించేలా చట్టానికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ సవరణలపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని హోం మంత్రి అమిత్ షా గట్టిగా సమర్థించారు. ఉగ్రవాదుల కన్నా దర్యాప్తు సంస్థలు నాలుగడుగులు ముందుండాలంటే ఈ సవరణలు కచ్చితంగా అవసరమేనని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు)–2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులంతా బయటకు వెళ్లిపోవడంపై అమిత్ షా స్పందిస్తూ ‘మీ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి మీరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఓటింగ్‌కు దూరంగా వెళ్లిపోతున్నారు. దీనికి మేం ఏం చేయగలం?’ అన్నారు. సవరణ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఈ చట్టంతో సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అనడంపై అమిత్ షా స్పందిస్తూ ‘సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని 1967లో నాటి ప్రధాని ఇందిర ప్రభుత్వమే తెచ్చింది. అంటే సమాఖ్య స్ఫూర్తి కాంగ్రెస్ వల్లే, ఆనాడే దెబ్బతిన్నది’ అంటూ ఎదురుదాడి చేశారు. ఈ చట్టానికి తెచ్చిన సవరణలను, చట్టాన్ని తాము దుర్వినియోగం చేయబోమనీ, కేవలం ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేందుకే దీనిని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అలాగే కొంతమంది వ్యక్తులు సిద్ధాంతాల పేరుతో పట్టణ మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనీ, అలాంటి వారిపై ప్రభుత్వం ఎంతమాత్రమూ దయ చూపదని అమిత్ షా స్పష్టం చేశారు. ఒవైసీ ఒత్తిడితో నాటకీయ పరిణామాలు సవరణ బిల్లును ఆమోదించడానికి ఓటింగ్ జరపాలంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పట్టుబట్టడంతో సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సవరణలను వ్యతిరేకిస్తూ అప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సమయంలోనూ బిల్లును ఆమోదించడానికి ముందు ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ డిమాండ్ చేశారు. దీంతో ఆయన అనవసరంగా సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒవైసీ దూకుడుగా సమాధానమిస్తూ ‘ఓటింగ్ కోరడం నా హక్కు. అభ్యంతరం తెలపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు?’ అని అన్నారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 287 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, 8 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై కూడా ఓటింగ్ నిర్వహించాలని ఒవైసీ పట్టుబట్టగా..నిబంధనలను ప్రస్తావిస్తూ సభ్యులను నిల్చోబెట్టి సమర్థిస్తున్న వారెంత మంది, వ్యతిరేకిస్తున్న వారెంత మంది అని స్పీకర్ లెక్కించారు. అనంతరం బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం మొత్తాన్నీ నిల్చొనేలా చేశాను’ అని వ్యాఖ్యానించగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడేందుకు మేం సిద్ధమే. ఇప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిల్చున్నాం’ అని అన్నారు. సవరణ బిల్లులో ఏముంది? ‘ఉగ్రవాద, వినాశక కార్యకలాపాల నిరోధక చట్టం’ (టాడా), ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ (పొటా)లకు మార్పులు చేస్తూ ఈ ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)’ బిల్లులను కేంద్రం తెచ్చింది. ఈ సవరణలు ఏం చెబుతున్నాయంటే.. ► ఉగ్రవాదానికి పాల్పడిన లేదా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న, ఉగ్రవాద హింసాకాండకు ఏర్పాట్లు చేసిన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాదానికి ఇతరత్రా సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలను ఈ చట్టం కింద ఉగ్రవాదులుగా లేదా ఉగ్రవాద సంస్థలుగా కేంద్రం ప్రకటించవచ్చు. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే అధికారి.. నిందితుల ఆస్తులను జప్తు చేయాలంటే ముందుగా పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) అనుమతి తీసుకోవలసి ఉంది. తాజా సవరణల ప్రకారం.. కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారి దర్యాప్తు చేస్తున్న పక్షంలో ఆస్తుల జప్తుకోసం డీజీపీ అనుమతి కాకుండా, ఎన్ఐఏ డీజీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే కేసులను పోలీసులే దర్యాప్తు చేస్తుంటే డీజీపీ అనుమతి అవసరం. ► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ), అసిస్టెంట్ పోలీసు కమిషనర్ (ఏసీపీ), పై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. తాజా సవరణల ప్రకారం ఎన్ఐఏలోని ఇన్స్పెక్టర్ లేదా ఆ పై స్థాయి అధికారులు కూడా దర్యాప్తు చేపట్టవచ్చు. ► ప్రస్తుత చట్టానికి అనుబంధంగా తొమ్మిది అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత సవరణ కింద ఆ ఒప్పందాలతో పాటుమరో ఒప్పందాన్ని(ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఫర్ సప్రెషన్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ టెర్రరిజం–2005) కూడా చేర్చారు. ఇక నుంచి ఈ పది ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా పేర్కొంటారు. నేడు లోక్‌సభకు ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభలో గురువారం ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లును కూడా కేంద్రం చేర్చింది. ఆ సమయంలో కచ్చితంగా సభలో ఉండాలంటూ తమ ఎంపీలకు అధికార బీజేపీ ఇప్పటికే విప్ కూడా జారీ చేసింది. ఉన్నట్టుండి, ఏకకాలంలో ముమ్మారు తలాక్ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులను జైలుకు పంపేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో తనకున్న భారీ సంఖ్యబలంతో లోక్‌సభలో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. పార్లమెంటు సమాచారం ► ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమని న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ప్రసాద్ లోక్‌సభలో తెలిపారు. న్యాయ శాఖ పరిధిలోని టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయని స్పష్టం చేశారు. ► పశ్చిమ బెంగాల్ పేరును ‘బంగ్లా’గా మార్చేందుకు రాజ్యాంగానికి సవరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రాల పేర్లు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన అన్నారు. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్నందున, పేరు మార్చడాన్ని కేంద్రం తిరస్కరిస్తోందన్నారు. ► కశ్మీర్ యువత ఉగ్రవాదంవైపు వెళ్లడం 40 శాతం తగ్గిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. సరిహద్దు చొరబాట్లు 43 శాతం, ఉగ్ర చర్యలు 28 శాతం తగ్గాయన్నారు. యూపీఏ –2లో పోలిస్తే మావోయిస్టుల దాడులు 43 శాతం తగ్గాయని వెల్లడించారు. ► మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి, సంఘపరివార్ నేత శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్‌ల మృతిపై ప్రత్యేక విచారణ జరిపే ఆలోచనేదీ లేదని మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో తెలిపారు. ► భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దుల్లో కంచె నిర్మించే ప్రతిపాదనేమీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యలు పక్కాగా తీసుకుంటుండడంతో సరిహద్దు చొరబాట్లు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఇండో–పాక్ సరిహద్దులో 2069 కిలోమీటర్లకుగాను 2004 కిలోమీటర్ల కంచె పూర్తయిందన్నారు. ఇండో–బంగ్లా సరిహద్దులో 3326 కిలోమీటర్లకుగాను 2803 కిలోమీటర్ల కంచె పూర్తయిందని వెల్లడించారు. ► మూడేళ్లలో ఇస్రో వాణిజ్య విభాగం ద్వారా 239 శాటిలైట్లను ప్రయోగించి, రూ. 6,289 కోట్లు ఆర్జించినట్లు ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి జితేంద్ర సింగ్ లోక్‌సభలో తెలిపారు. ► భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రష్యా వెల్లడించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ లోక్‌సభలో తెలిపారు. 2014 నుంచి ఈ విషయమై రష్యాను అడుగుతూనే ఉన్నామని ఆయన తెలిపారు. ► విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలను తీర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2015 ఫిబ్రవరి నుంచి 2019 జూలై 18 వరకు 50,605 సమస్యలను నమోదు చేసుకోగా 44,360 సమస్యలను (దాదాపు 90 శాతం) తీర్చామన్నారు. అందులో 36,805 సమస్యలు గల్ఫ్ దేశాల నుంచే వచ్చాయన్నారు. ఎమ్‌ఏడీఏడీ పోర్టల్ ద్వారా సమస్యలను నమోదు చేయవచ్చన్నారు. -
అక్రమభద్దీకరణ
♦ కొత్తగూడెం నడిబొడ్డులో విలువైన భూమి హాంఫట్ ♦ 2 వేల గజాల విలువ సుమారు రూ.70 కోట్లు ♦ చట్టం అమలుకు అడ్డొస్తున్న చుట్టం..? క్రమబద్ధీకరణకు సంబంధించిన 373 జీఓ నిబంధనలను కొత్తగూడెం ‘సూపర్‌బజార్’లో తాకట్టుపెట్టారు. సింగరేణి లీజు.. రెవెన్యూ సహకారంతో అడ్డదారిలో రూ.70 కోట్ల విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేశారు. సింగరేణి భూముల్లో కమర్షియల్ భవనాలు నిర్మించొద్దనే నిబంధన ఉన్నా వాటికి ‘బంక్’కొట్టి స్థలాన్ని చేజిక్కించుకున్నారు. చట్టాన్ని ‘చుట్టం’గా చేసుకొని సాగిస్తున్న ఈ దందాపై కలెక్టర్‌కు ఫిర్యాదులు సైతం అందటం గమనార్హం. - కొత్తగూడెం తహసీల్దార్ విచారిస్తున్నారు.. సింగరేణి లీజుకు ఇచ్చిన భూమిలో కమర్షియల్ భవనాలు నిర్మించిన విషయమై విచారణ చేయాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించాం. ప్రస్తుతం ఈ సమస్య తహసీల్దార్ పరిధిలో ఉంది. ఆయన విచారణ చేస్తున్నారు. నాకు ఇప్పటి వరకు ఈ విచారణ వివరాలు తెలియలేదు. - ఎంవీ రవీంద్రనాథ్, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి కొత్తగూడెం: కొత్తగూడెంలో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అడ్డదారిలో క్రమద్ధీకరణ చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి స్థలాల్లో బోర్డులు పాతుతున్న రెవెన్యూ అధికారులు ఆ అ‘క్రమబద్ధీకరణ’ స్థలంలో కమర్షియల్ భవనాలను నిర్మిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. కార్మికులకు సౌకర్యాలకు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం అప్పట్లో ప్రైవేట్ ఆస్పత్రులు, పార్కులు, పాఠశాలలు, రిక్రియేషన్ క్లబ్‌లు, పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటుకు 99 ఏళ్లపాటు లీజుకిచ్చింది. పెట్రోల్ బంక్ నిర్వహణకు పట్టణంలో అత్యంత రద్దీ ప్రాంతం, వ్యాపార సముదాయమైన సూపర్‌బజార్ సెంటర్లో సర్వే నంబర్ 142లోని 2 వేల గజాల స్థలాన్ని 1960-70 దశకంలో కేటాయించింది. ఆ స్థలంలో పెట్రోల్ బంక్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. ప్రస్తుతం మరో భవన నిర్మాణం చేపడుతున్నారు. ఆ స్థలం, భవనాల విలువ మొత్తం 70 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. 373 జీఓ పేరు చెప్పి... 2005లో కొత్తగూడెంలోని స్థలాల క్రమద్ధీకరణకు ప్రభుత్వం 373 జీఓ జారీ చేసింది. ఆ జీఓను సాకుగా చూపిస్తూ నిబంధనలు తుంగలో తొక్కి రెండు వేల గజాల స్థలాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం లీజు గడువు ముగిసిన తర్వాత స్థలాన్ని సింగరేణి సంస్థకు అప్పగించాలి. కానీ ఇక్కడ లీజులో ఉన్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎలా క్రమద్ధీకరణ చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. 1984లో సింగరేణి యాజమాన్యం 315 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తూ 483 జీఓ జారీ చేసింది. క్రమబద్ధీకరణకు ఈ జీఓనే సాకుగా చూపిస్తున్నారు. లీజు గడువు పూర్తికాకముందు సర్వే నంబర్ 142లోని స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించే అవకాశం లేదు. కానీ రెవెన్యూ అధికారుల సహకారంతో నిబంధనలకు తిలోదకాలిచ్చి పెట్రోల్ బంక్ యాజమాన్యం ఆ స్థలాన్ని కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల వక్రభాష్యం.. సింగరేణి యాజమాన్యం లీజుకు ఇచ్చిన స్థలాలను 99 సంవత్సరాల పూర్తయ్యే వరకు అలా నే ఉంచాలి. లీజు కాలం పూర్తై తర్వాత 483 జీఓ ప్రకారం స్థలం రెవెన్యూ పరిధిలోకి వ స్తుంది. ఈ జీఓను అడ్డం పెట్టుకుంటున్న అధికారులు మాత్రం ఆ స్థలం నోటిఫైడ్ ఏరి యా కు తిరిగి అప్పగించారని, నోటిఫైడ్ ఏరి యా కమిటీ దానిని వారికి అప్పగించడంతోనే క్రమబద్ధీకరణ పట్టాలను జారీ చేశామని పేర్కొనడం గమనార్హం. కొత్తగూడెం 1986 నుంచి 1998 వరకు నోటిఫైడ్ ఏరియాగా ఉండగా, 1998లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ఒకవేళ నోటిఫైడ్ ఏరియా కమిటీ ప్రైవేట్ వ్య క్తులకు భూములు కేటాయించాలంటే.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం పాట నిర్వహించాల్సి ఉంది. ఇదేమి లేకుండానే దానిని యాజమాన్యానికి అప్పగించామని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. సింగరేణి యాజమాన్యం లీజుకు ఇచ్చిన భూములు మాత్రం లీజు గడువు పూర్తికాలేదని, ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పెట్రోల్‌బంక్ యాజమాన్యం లీజు పీరియడ్ పూర్తి కాకముందు స్థలం అప్పగిస్తే అది తిరిగి సింగరేణి యాజమాన్యం, లేదా రెవెన్యూ అధికారులకు అప్పగించాలి. కానీ నోటిఫైడ్ ఏరియాకు అప్పగించామని అధికారులు పేర్కొనడం గమనార్హం. ‘చుట్టం’ ముందు చట్టం ఎంత..? సింగరేణి లీజ్డ్ భూమిని గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ అక్రమంగా క్రమబద్ధీకరణ చేశారని ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారికి అదే శాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓ అధికారికి దగ్గర చుట్టం కావడంతో.. అక్రమ భూ బదలాయింపుపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినా తహసీల్దార్‌తోనే విచారణ చేయించడం, ఎలాంటి చర్యలూ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
న్యాయ పరిరక్షణలో పీపీలే కీలకం
జస్టిస్ ఎన్వీ రమణ సాక్షి, విజయవాడ: న్యాయాన్ని పరిరక్షించడంలో ప్రభుత్వ న్యాయవాదులు కీలకభూమిక పోషించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సూచించారు. శనివారం విజయవాడలో జరిగిన ‘అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’ తొలి సమావేశంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ... ప్రజలకు న్యాయవ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని, ఆ నమ్మకాన్ని ఏపీపీలు (అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు), న్యాయమూర్తులు వమ్ము చేయవద్దన్నారు. నిందితులకు శిక్ష పడటం అవసరమేనని, కానీ ఏపీపీలు తమ పరిధులు దాటవద్దన్నారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ బాధితులకు న్యాయంచేయాల్సిన బాధ్యత ఏపీపీలపై ఉందన్నారు. న్యాయ విచారణ ప్రాథమిక హక్కుగా గతం లో సుప్రీంకోర్టు అభిప్రాయపడిందన్నారు. హత్యలు, దోపిడీ, అత్యాచారాలు తదితర నేరాల్లో శిక్షలు తక్కువగా పడుతున్నాయన్నా రు. సత్వర న్యాయం జరగకపోతే బాధితులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకుంటారని, దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమవుతాయన్నారు. న్యాయవాదిగా ఉన్న రోజుల్లో... తాను న్యాయవాదిగా ఉన్న రోజుల్లో అయ్యప్పరెడ్డి వద్ద జూనియర్‌గా పనిచేశానని, ఒక కేసుకు ఇద్దరం హాజరుకాగా, ఏపీపీ కేసును సరిగా వాదించకపోవడాన్ని ఆయన తన దృష్టికి తీసుకువచ్చారని జస్టిస్ రమణ తెలిపా రు. అదే సందర్భంలో అయ్యప్పరెడ్డి తన అనుభవాన్ని నాకు చెబుతూ ‘ఒక కేసులో డిఫెన్సు న్యాయవాదిగా బాగా వాదించానని, అయితే ఏపీపీ వచ్చి ఈ కేసు నువ్వు గెలుస్తావా.. అని నన్ను ప్రశ్నించారు. నేను తప్పకుండా గెలుస్తానని చెప్పగా, ఏపీపీ తన జేబులోంచి ఒక కాగితం నాకు ఇచ్చారు. ఈ రోజు ‘బండెడు కట్టెలు’ పంపమని న్యాయమూర్తి పబ్లిక్ ప్యాసిక్యూటర్కు రాసిన చీటి అది. దీం తో కొద్దిగా నిరాశకు లోనైనా కేసు మాత్రం గెలిచా’ అని అయ్యప్పరెడ్డి వివరించినట్లు జస్టిస్ రమణ వెల్లడించారు. దక్షిణాదిలోనే కేసులు వేగవంతం... ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాదిలోనే కేసులు వేగవంతంగా నడుస్తున్నాయని జస్టిస్ రమణ తెలిపారు. తాను సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్న ఈ రెండేళ్ల కాలంలో 1984 నాటి కేసులు ఇప్పటికీ విచారణకు వస్తున్నాయన్నా రు. తెలుగు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్ని ఏడాది నుంచి మూడేళ్లులోపు పరిష్కారిస్తున్నారని తెలిపారు. జస్టిస్ జి.భవానీప్రసాద్, లా సెక్రటరీ దుర్గాప్రసాద్, ఇన్చార్జి డెరైక్టర్ఆఫ్ ప్రాసిక్యూషన్స్ సీసీ సుబ్రహ్మణ్యం, అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. -
చట్టం అమలు ఓ జోకైపోయింది: రాజమౌళి
మన దేశంలో చట్టాల అమలు అంటే ఓ పెద్ద జోకుగా మారిపోయిందని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీని అరికట్టాలంటూ ఎన్ని కోర్టులు చెబుతున్నా, ఎంత పటిష్ఠమైన చట్టాలున్నా కూడా బాహుబలి లాంటి సినిమాలు సైతం ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చేస్తున్నాయంటూ సాక్షి ఖన్నా అనే పాత్రికేయురాలు చేసిన ట్వీట్‌కు సమాధానంగా రాజమౌళి ఈ వ్యాఖ్యలు చేశారు. పైరసీని అరికట్టాలంటూ టాలీవుడ్‌లోని పలువురు హీరోలు, ఇతర ప్రముఖులు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ఇలా కామెంట్ చేశారు. Sadly, law enforcement is a joke In our country https://t.co/YAnqovSeBb — rajamouli ss (@ssrajamouli) September 3, 2015