అక్రమభద్దీకరణ
♦ కొత్తగూడెం నడిబొడ్డులో విలువైన భూమి హాంఫట్
♦ 2 వేల గజాల విలువ సుమారు రూ.70 కోట్లు
♦ చట్టం అమలుకు అడ్డొస్తున్న చుట్టం..?
క్రమబద్ధీకరణకు సంబంధించిన 373 జీఓ నిబంధనలను కొత్తగూడెం ‘సూపర్‌బజార్’లో తాకట్టుపెట్టారు. సింగరేణి లీజు.. రెవెన్యూ సహకారంతో అడ్డదారిలో రూ.70 కోట్ల విలువైన స్థలాన్ని అన్యాక్రాంతం చేశారు. సింగరేణి భూముల్లో కమర్షియల్ భవనాలు నిర్మించొద్దనే నిబంధన ఉన్నా వాటికి ‘బంక్’కొట్టి స్థలాన్ని చేజిక్కించుకున్నారు. చట్టాన్ని ‘చుట్టం’గా చేసుకొని సాగిస్తున్న ఈ దందాపై కలెక్టర్‌కు ఫిర్యాదులు సైతం అందటం గమనార్హం. - కొత్తగూడెం
తహసీల్దార్ విచారిస్తున్నారు..
సింగరేణి లీజుకు ఇచ్చిన భూమిలో కమర్షియల్ భవనాలు నిర్మించిన విషయమై విచారణ చేయాల్సిందిగా తహసీల్దార్‌ను ఆదేశించాం. ప్రస్తుతం ఈ సమస్య తహసీల్దార్ పరిధిలో ఉంది. ఆయన విచారణ చేస్తున్నారు. నాకు ఇప్పటి వరకు ఈ విచారణ వివరాలు తెలియలేదు.
- ఎంవీ రవీంద్రనాథ్, కొత్తగూడెం రెవెన్యూ డివిజనల్ అధికారి
కొత్తగూడెం: కొత్తగూడెంలో కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని అడ్డదారిలో క్రమద్ధీకరణ చేయించుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి స్థలాల్లో బోర్డులు పాతుతున్న రెవెన్యూ అధికారులు ఆ అ‘క్రమబద్ధీకరణ’ స్థలంలో కమర్షియల్ భవనాలను నిర్మిస్తున్నా చర్యలు తీసుకోవడం లేదు. కార్మికులకు సౌకర్యాలకు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం అప్పట్లో ప్రైవేట్ ఆస్పత్రులు, పార్కులు, పాఠశాలలు, రిక్రియేషన్ క్లబ్‌లు, పెట్రోల్‌బంక్‌ల ఏర్పాటుకు 99 ఏళ్లపాటు లీజుకిచ్చింది. పెట్రోల్ బంక్ నిర్వహణకు పట్టణంలో అత్యంత రద్దీ ప్రాంతం, వ్యాపార సముదాయమైన సూపర్‌బజార్ సెంటర్‌లో సర్వే నంబర్ 142లోని 2 వేల గజాల స్థలాన్ని 1960-70 దశకంలో కేటాయించింది. ఆ స్థలంలో పెట్రోల్ బంక్ మాత్రమే నిర్వహించాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఇప్పటికే ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మించారు. ప్రస్తుతం మరో భవన నిర్మాణం చేపడుతున్నారు. ఆ స్థలం, భవనాల విలువ మొత్తం 70 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
373 జీఓ పేరు చెప్పి...
2005లో కొత్తగూడెంలోని స్థలాల క్రమద్ధీకరణకు ప్రభుత్వం 373 జీఓ జారీ చేసింది. ఆ జీఓను సాకుగా చూపిస్తూ నిబంధనలు తుంగలో తొక్కి రెండు వేల గజాల స్థలాన్ని రెగ్యులరైజేషన్ చేయించుకున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం లీజు గడువు ముగిసిన తర్వాత స్థలాన్ని సింగరేణి సంస్థకు అప్పగించాలి. కానీ ఇక్కడ లీజులో ఉన్న స్థలాన్ని రెవెన్యూ అధికారులు ఎలా క్రమద్ధీకరణ చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. 1984లో సింగరేణి యాజమాన్యం 315 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగిస్తూ 483 జీఓ జారీ చేసింది. క్రమబద్ధీకరణకు ఈ జీఓనే సాకుగా చూపిస్తున్నారు. లీజు గడువు పూర్తికాకముందు సర్వే నంబర్ 142లోని స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించే అవకాశం లేదు. కానీ రెవెన్యూ అధికారుల సహకారంతో నిబంధనలకు తిలోదకాలిచ్చి పెట్రోల్ బంక్ యాజమాన్యం ఆ స్థలాన్ని కాజేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అధికారుల వక్రభాష్యం..
సింగరేణి యాజమాన్యం లీజుకు ఇచ్చిన స్థలాలను 99 సంవత్సరాల పూర్తయ్యే వరకు అలా నే ఉంచాలి. లీజు కాలం పూర్తై తర్వాత 483 జీఓ ప్రకారం స్థలం రెవెన్యూ పరిధిలోకి వ స్తుంది. ఈ జీఓను అడ్డం పెట్టుకుంటున్న అధికారులు మాత్రం ఆ స్థలం నోటిఫైడ్ ఏరి యా కు తిరిగి అప్పగించారని, నోటిఫైడ్ ఏరి యా కమిటీ దానిని వారికి అప్పగించడంతోనే క్రమబద్ధీకరణ పట్టాలను జారీ చేశామని పేర్కొనడం గమనార్హం. కొత్తగూడెం 1986 నుంచి 1998 వరకు నోటిఫైడ్ ఏరియాగా ఉండగా, 1998లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేశారు. ఒకవేళ నోటిఫైడ్ ఏరియా కమిటీ ప్రైవేట్ వ్య క్తులకు భూములు కేటాయించాలంటే..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేలం పాట నిర్వహించాల్సి ఉంది. ఇదేమి లేకుండానే దానిని యాజమాన్యానికి అప్పగించామని పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది. సింగరేణి యాజమాన్యం లీజుకు ఇచ్చిన భూములు మాత్రం లీజు గడువు పూర్తికాలేదని, ఆ భూములను తిరిగి ప్రభుత్వానికి అప్పగించలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ పెట్రోల్‌బంక్ యాజమాన్యం లీజు పీరియడ్ పూర్తి కాకముందు స్థలం అప్పగిస్తే అది తిరిగి సింగరేణి యాజమాన్యం, లేదా రెవెన్యూ అధికారులకు అప్పగించాలి. కానీ నోటిఫైడ్ ఏరియాకు అప్పగించామని అధికారులు పేర్కొనడం గమనార్హం.
‘చుట్టం’ ముందు చట్టం ఎంత..?
సింగరేణి లీజ్డ్ భూమిని గతంలో ఇక్కడ పనిచేసిన ఓ తహసీల్దార్ అక్రమంగా క్రమబద్ధీకరణ చేశారని ఆరోపణలు ఉన్నాయి. సదరు అధికారికి అదే శాఖలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓ అధికారికి దగ్గర చుట్టం కావడంతో.. అక్రమ భూ బదలాయింపుపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్‌కు ఫిర్యాదులు అందినా తహసీల్దార్‌తోనే విచారణ చేయించడం, ఎలాంటి చర్యలూ లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.