‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం | Lok Sabha passes anti-terror bill | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

Published Thu, Jul 25 2019 4:12 AM | Last Updated on Thu, Jul 25 2019 8:25 AM

Lok Sabha passes anti-terror bill - Sakshi

లోక్‌సభలో మాట్లాడుతున్న హోం మంత్రి అమిత్‌ షా

న్యూఢిల్లీ: ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ఉగ్రవాదులుగా నిర్ధారించేలా చట్టానికి సవరణలు చేసేందుకు ప్రభుత్వం తెచ్చిన బిల్లును లోక్‌సభ బుధవారం ఆమోదించింది. ఈ సవరణలపై ప్రతిపక్షాలు వ్యతిరేకత వ్యక్తం చేయగా, ప్రభుత్వ నిర్ణయాన్ని హోం మంత్రి అమిత్‌ షా గట్టిగా సమర్థించారు. ఉగ్రవాదుల కన్నా దర్యాప్తు సంస్థలు నాలుగడుగులు ముందుండాలంటే ఈ సవరణలు కచ్చితంగా అవసరమేనని ఆయన పేర్కొన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ బిల్లు)–2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో అమిత్‌ షా మాట్లాడారు. ఈ బిల్లుపై ఓటింగ్‌లో పాల్గొనకుండా ప్రతిపక్ష కాంగ్రెస్, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులంతా బయటకు వెళ్లిపోవడంపై అమిత్‌ షా స్పందిస్తూ ‘మీ ఓటు బ్యాంకును కాపాడుకోడానికి మీరు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు.

అందుకే ఓటింగ్‌కు దూరంగా వెళ్లిపోతున్నారు. దీనికి మేం ఏం చేయగలం?’ అన్నారు. సవరణ బిల్లుకు ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలు వీగిపోయాయి. ఈ చట్టంతో సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తున్నారని కాంగ్రెస్‌ ఎంపీ కార్తీ చిదంబరం అనడంపై అమిత్‌ షా స్పందిస్తూ ‘సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టాన్ని 1967లో నాటి ప్రధాని ఇందిర ప్రభుత్వమే తెచ్చింది. అంటే సమాఖ్య స్ఫూర్తి కాంగ్రెస్‌ వల్లే, ఆనాడే దెబ్బతిన్నది’ అంటూ ఎదురుదాడి చేశారు. ఈ చట్టానికి తెచ్చిన సవరణలను, చట్టాన్ని తాము దుర్వినియోగం చేయబోమనీ, కేవలం ఉగ్రవాదాన్ని వేళ్లతో సహా పెకలించేందుకే దీనిని ఉపయోగిస్తామని ఆయన తెలిపారు. అలాగే కొంతమంది వ్యక్తులు సిద్ధాంతాల పేరుతో పట్టణ మావోయిజాన్ని ప్రోత్సహిస్తున్నారనీ, అలాంటి వారిపై ప్రభుత్వం ఎంతమాత్రమూ దయ చూపదని అమిత్‌ షా స్పష్టం చేశారు.

ఒవైసీ ఒత్తిడితో నాటకీయ పరిణామాలు
సవరణ బిల్లును ఆమోదించడానికి ఓటింగ్‌ జరపాలంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ పట్టుబట్టడంతో సభలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వం తెచ్చిన సవరణలను వ్యతిరేకిస్తూ అప్పటికే వివిధ ప్రతిపక్ష పార్టీలు బయటకు వెళ్లిపోయాయి. ప్రతిపక్ష సభ్యుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. ఇలాంటి సమయంలోనూ బిల్లును ఆమోదించడానికి ముందు ఓటింగ్‌ నిర్వహించాలని ఒవైసీ డిమాండ్‌ చేశారు. దీంతో ఆయన అనవసరంగా సభా సమయాన్ని వృథా చేస్తున్నారంటూ ఇతర సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఒవైసీ దూకుడుగా సమాధానమిస్తూ ‘ఓటింగ్‌ కోరడం నా హక్కు. అభ్యంతరం తెలపడానికి, అడ్డుకోవడానికి మీరెవరు?’ అని అన్నారు.


దీంతో స్పీకర్‌ ఓం బిర్లా ఈ బిల్లుపై ఓటింగ్‌ నిర్వహించారు. 287 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేయగా, 8 మంది వ్యతిరేకించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రతిపాదించిన సవరణలపై కూడా ఓటింగ్‌ నిర్వహించాలని ఒవైసీ పట్టుబట్టగా..నిబంధనలను ప్రస్తావిస్తూ సభ్యులను నిల్చోబెట్టి సమర్థిస్తున్న వారెంత మంది, వ్యతిరేకిస్తున్న వారెంత మంది అని స్పీకర్‌ లెక్కించారు. అనంతరం బిల్లు ఆమోదం పొందింది. అనంతరం ఒవైసీ మాట్లాడుతూ ‘నేను ప్రభుత్వం మొత్తాన్నీ నిల్చొనేలా చేశాను’ అని వ్యాఖ్యానించగా, ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడేందుకు  మేం సిద్ధమే. ఇప్పుడూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిల్చున్నాం’ అని అన్నారు.

సవరణ బిల్లులో ఏముంది?
‘ఉగ్రవాద, వినాశక కార్యకలాపాల నిరోధక చట్టం’ (టాడా), ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ (పొటా)లకు మార్పులు చేస్తూ ఈ ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (సవరణ)’ బిల్లులను కేంద్రం తెచ్చింది. ఈ సవరణలు ఏం చెబుతున్నాయంటే..

► ఉగ్రవాదానికి పాల్పడిన లేదా ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్న, ఉగ్రవాద హింసాకాండకు ఏర్పాట్లు చేసిన, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన, ఉగ్రవాదానికి ఇతరత్రా సహకారం అందించిన వ్యక్తులు, సంస్థలను ఈ చట్టం కింద ఉగ్రవాదులుగా లేదా ఉగ్రవాద సంస్థలుగా కేంద్రం ప్రకటించవచ్చు.

► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను దర్యాప్తు చేసే అధికారి.. నిందితుల ఆస్తులను జప్తు చేయాలంటే ముందుగా పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (డీజీపీ) అనుమతి తీసుకోవలసి ఉంది. తాజా సవరణల ప్రకారం.. కేసులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అధికారి దర్యాప్తు చేస్తున్న పక్షంలో ఆస్తుల జప్తుకోసం డీజీపీ అనుమతి కాకుండా, ఎన్‌ఐఏ డీజీ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే కేసులను పోలీసులే దర్యాప్తు చేస్తుంటే డీజీపీ అనుమతి అవసరం.

► ప్రస్తుత చట్టం ప్రకారం ఉగ్రవాద కేసులను డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీఎస్పీ), అసిస్టెంట్‌ పోలీసు కమిషనర్‌ (ఏసీపీ), పై స్థాయి అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలి. తాజా సవరణల ప్రకారం ఎన్‌ఐఏలోని ఇన్‌స్పెక్టర్‌ లేదా ఆ పై స్థాయి అధికారులు కూడా దర్యాప్తు చేపట్టవచ్చు.

► ప్రస్తుత చట్టానికి అనుబంధంగా  తొమ్మిది అంతర్జాతీయ ఒప్పందాలు ఉన్నాయి. ఆ ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద చర్యలుగా నిర్ణయిస్తున్నారు. ప్రస్తుత సవరణ కింద ఆ ఒప్పందాలతో పాటుమరో ఒప్పందాన్ని(ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ ఫర్‌ సప్రెషన్‌ ఆఫ్‌ యాక్ట్స్‌ ఆఫ్‌ న్యూక్లియర్‌ టెర్రరిజం–2005) కూడా చేర్చారు. ఇక నుంచి ఈ పది ఒప్పందాల పరిధిలోకి వచ్చే కార్యకలాపాలను ఉగ్రవాద కార్యకలాపాలుగా పేర్కొంటారు.


నేడు లోక్‌సభకు ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు
లోక్‌సభలో గురువారం ఆమోదించాల్సిన బిల్లుల జాబితాలో వివాదాస్పద ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును కూడా కేంద్రం చేర్చింది. ఆ సమయంలో కచ్చితంగా సభలో ఉండాలంటూ తమ ఎంపీలకు అధికార బీజేపీ ఇప్పటికే విప్‌ కూడా జారీ చేసింది. ఉన్నట్టుండి, ఏకకాలంలో ముమ్మారు తలాక్‌ చెప్పి భార్యలకు విడాకులిచ్చే ముస్లిం పురుషులను జైలుకు పంపేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్‌ కాంగ్రెస్‌ తదితర ప్రతిపక్ష పార్టీలన్నీ ఈ బిల్లును పరిశీలన కోసం పార్లమెంటరీ కమిటీకి పంపాల్సిందేనని పట్టుబడుతున్నాయి. దీంతో తనకున్న భారీ సంఖ్యబలంతో లోక్‌సభలో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకున్నా, రాజ్యసభలో మాత్రం ప్రభుత్వానికి తిప్పలు తప్పేలా లేవు. 

పార్లమెంటు సమాచారం
► ఈవీఎంల ట్యాంపరింగ్‌  అసాధ్యమని న్యాయశాఖ మంత్రి రవి శంకర్‌ప్రసాద్‌ లోక్‌సభలో తెలిపారు.  న్యాయ శాఖ పరిధిలోని టెక్నికల్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాత్రమే వీటిని తయారుచేస్తున్నాయని స్పష్టం చేశారు.

► పశ్చిమ బెంగాల్‌  పేరును ‘బంగ్లా’గా మార్చేందుకు రాజ్యాంగానికి సవరణ  చేసే ప్రతిపాదన ఏదీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో చెప్పారు. రాష్ట్రాల పేర్లు మార్చాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆయన అన్నారు. బంగ్లా పేరు బంగ్లాదేశ్‌కు దగ్గరగా ఉన్నందున, పేరు మార్చడాన్ని కేంద్రం తిరస్కరిస్తోందన్నారు.

► కశ్మీర్‌ యువత ఉగ్రవాదంవైపు వెళ్లడం 40 శాతం తగ్గిందని హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో వెల్లడించారు. సరిహద్దు చొరబాట్లు 43 శాతం, ఉగ్ర చర్యలు 28 శాతం తగ్గాయన్నారు.   యూపీఏ –2లో పోలిస్తే మావోయిస్టుల దాడులు 43 శాతం తగ్గాయని వెల్లడించారు.

► మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి, సంఘపరివార్‌ నేత శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ల మృతిపై ప్రత్యేక విచారణ జరిపే ఆలోచనేదీ లేదని మంత్రి కిషన్‌రెడ్డి రాజ్యసభలో తెలిపారు.  

► భారత్‌తో సరిహద్దు పంచుకుంటున్న చైనా, నేపాల్, భూటాన్‌ సరిహద్దుల్లో కంచె నిర్మించే ప్రతిపాదనేమీ లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ రాజ్యసభలో తెలిపారు. భద్రతా చర్యలు పక్కాగా తీసుకుంటుండడంతో సరిహద్దు చొరబాట్లు పూర్తిగా తగ్గిపోయాయన్నారు. ఇండో–పాక్‌ సరిహద్దులో 2069 కిలోమీటర్లకుగాను 2004 కిలోమీటర్ల కంచె పూర్తయిందన్నారు. ఇండో–బంగ్లా సరిహద్దులో 3326 కిలోమీటర్లకుగాను 2803 కిలోమీటర్ల కంచె పూర్తయిందని వెల్లడించారు.  

 

► మూడేళ్లలో ఇస్రో వాణిజ్య విభాగం ద్వారా 239 శాటిలైట్లను ప్రయోగించి, రూ. 6,289 కోట్లు ఆర్జించినట్లు  ప్రధానమంత్రి కార్యాలయంలో సహాయమంత్రి జితేంద్ర సింగ్‌ లోక్‌సభలో తెలిపారు.

► భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీకి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని రష్యా వెల్లడించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్‌ లోక్‌సభలో తెలిపారు. 2014 నుంచి  ఈ విషయమై రష్యాను అడుగుతూనే ఉన్నామని ఆయన తెలిపారు.  

► విదేశాల్లో ఉంటున్న భారతీయుల సమస్యలను తీర్చడానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ లోక్‌సభలో తెలిపారు. విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2015 ఫిబ్రవరి నుంచి 2019 జూలై 18 వరకు 50,605 సమస్యలను నమోదు చేసుకోగా 44,360 సమస్యలను (దాదాపు 90 శాతం) తీర్చామన్నారు. అందులో 36,805 సమస్యలు గల్ఫ్‌ దేశాల నుంచే వచ్చాయన్నారు. ఎమ్‌ఏడీఏడీ పోర్టల్‌ ద్వారా సమస్యలను నమోదు చేయవచ్చన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement