
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్(ఎన్‌ఎంసీ)ను ఏర్పాటు చేసే బిల్లుకు లోక్‌సభ సోమవారం ఆమోదం తెలిపింది. దీనివల్ల వైద్య విద్యారంగంలో పారదర్శకత ఏర్పడుతుందనీ, అనవసరమైన తనిఖీల ప్రహసనం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో ఏకీకృత విధానాలను తీసుకురానున్నారు. ఇందులోభాగంగా ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ పరీక్షను పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి అర్హత పరీక్షగా పరిగణిస్తారు.
అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదివి భారత్‌లో పీజీ కోర్సుల్లో చేరే విద్యార్థుల కోసం ఓ స్క్రీనింగ్ టెస్ట్‌ను నిర్వహించనున్నారు. ఈ స్క్రీనింగ్ పరీక్షకు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్(నెక్టŠస్)గా నామకరణం చేశారు. ఎన్‌ఎంసీ చట్టం వల్ల ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాల్లో 50 శాతం సీట్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూఎస్) విద్యార్థులకు అందుతాయని ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందిన మూడేళ్ల లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్‌ను నిర్వహిస్తామన్నారు.
పోంజి బిల్లుకు ఆమోదం: చిట్‌ఫండ్ పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టే ‘అనియంత్రిత డిపాజిట్ స్కీంల నిషేధ’ బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. పేద డిపాజిటర్ల సొమ్ముకు రక్షణ కల్పించడం, వసూలు చేసిన డబ్బును తిరిగిచ్చేలా చూడటం ఈ బిల్లు ఉద్దేశం. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే చట్ట విరుద్ధంగా వసూళ్లకు పాల్పడిన వారికి జరిమానా, జైలుశిక్ష పడనున్నాయి. ఈ విషయమై ఆర్థికమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ..‘ ‘చట్టంలోని లొసుగుల ఆధారంగా కొందరు వ్యక్తులు నిరుపేదలకు భారీవడ్డీ ఆశచూపి నగదును వసూలుచేస్తున్నారు.
తాజా బిల్లులో పోంజి పథకంతో పాటు స్నేహితులు, పరిచయస్తులు, బంధువుల నుంచి వసూలు చేసే రియల్‌ఎస్టేల్ సంస్థలపైనా చర్యలు తీసుకునేలా నిబంధనలు చేర్చాం. సంబంధిత వ్యక్తులకు ఏడా ది నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.2 లక్షల నుంచి రూ.50 కోట్ల వరకు జరిమానా విధించవచ్చు. పోంజి స్కీమ్‌లకు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 978 కేసులు నమోదు కాగా, వీటిలో 326 కేసులో పశ్చిమబెంగాల్‌లోనే నమోదయ్యాయి’ అని తెలిపారు. ఈ బిల్లును లోక్‌సభ జూలై 24న ఆమోదించింది.
‘ఉన్నావ్’ ప్రమాదంపై సభలో రగడ..
ఉన్నావ్ రేప్ బాధితురాలి కారును ఓ లారీ అనుమానాస్పద రీతిలో ఢీకొట్టడంపై ప్రతిపక్షాల ఆందోళనలతో రాజ్యసభ దద్దరిల్లింది. ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. బాధితురాలిని చంపే ప్రయత్నం జరిగింద ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులు యాదవ్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదాపడింది.
Comments
Please login to add a commentAdd a comment