58 స్థానాలకు శనివారం పోలింగ్
2019లో ఒక్కటీ నెగ్గని కాంగ్రెస్
40 స్థానాలు గెలుచుకున్న బీజేపీ
ఏడు విడతలుగా జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటిదాకా ఐదు దశల్లో 428 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మిగతా 115 లోక్‌సభ స్థానాలకు మే 25న ఆరు, జూన్ 1న ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. దాంతో 42 రోజుల సుదీర్ఘ పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఆరో విడతలో మొత్తం 58 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. హరియాణాలోని మొత్తం 10 సీట్లు, రాజధాని ఢిల్లీలోని 7 స్థానాలూ వీటిలో ఉన్నాయి.
ఈ 58 స్థానాల్లో 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 44 చోట్ల బరిలో దిగినా కనీసం ఒక్క సీటు కూడా నెగ్గలేకపోయింది. అధికార బీజేపీ మాత్రం 53 చోట్ల పోటీ చేసి ఏకంగా 40 స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం! అంతేగాక వాటిలో ఏకంగా 90 శాతం స్థానాల్లో 40 శాతం పై చిలుకు ఓట్లు సాధించింది! ఈ నేపథ్యంలో ఆ 40 స్థానాలనూ నిలబెట్టుకోవడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది.
కానీ ఆప్‌తో జతకట్టిన కాంగ్రెస్ నుంచి అధికార పార్టీ ఈసారి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. ఏడో విడతలో పోలింగ్ జరగనున్న పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తున్నా హరియాణా, ఢిల్లీల్లో మాత్రం ఇండియా కూటమి భాగస్వాములుగా బరిలో దిగాయి. హరియాణాలో 9, ఢిల్లీలో 3 చోట్ల కాంగ్రెస్, మిగతా స్థానాల్లో ఆప్ బీజేపీకి పెను సవాలు విసురుతున్నాయి. దీనికి తోడు హరియాణాలో రైతుల అసంతృప్తి బీజేపీకి మరింత ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది.
2019లో బీజేపీదే హవా!
ఆరో విడతలో పోలింగ్ జరుగుతున్న 58 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో బీజేపీయే పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆరు స్థానాల్లోనైతే ఏకంగా 35 శాతం పై చిలుకు మెజారిటీ సాధించడం విశేషం. అవి కర్నాల్ (6.6 లక్షల మెజారిటీ), ఫరీదాబాద్ (6.4 లక్షలు), వెస్ట్ ఢిల్లీ (5.8 లక్షలు), నార్త్ వెస్ట్ ఢిల్లీ (5.5 లక్షలు), ధన్‌బాద్ (4.9 లక్షలు), భివానీ (4.4 లక్షలు).
ఏ స్థానంలో అయినా మూడు వరుస ఎన్నికల్లో కనీసం రెండుసార్లు నెగ్గిన పార్టీని అక్కడ గట్టి పోటీదారుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. ఆ లెక్కన ఆరో విడత స్థానాల్లో బీజేపీ కనీసం 30 స్థానాల్లో గట్టి పోటీదారుగా ఉంది. కాంగ్రెస్‌కు మాత్రం అలాంటి స్థానం కేవలం హరియాణాలోని రోహ్‌తక్ మాత్రమే. అక్కడ కూడా 2009, 2014ల్లో నెగ్గినా 2019లో మాత్రం వెంట్రుకవాసిలో బీజేపీకి కోల్పోవడం విశేషం!
బీజేపీ కంచుకోటలు 5
ఆరో విడతలో పోలింగ్ జరగనున్న 58 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పదగ్గ సీటు ఒక్కటీ లేకపోవడం విశేషం. బీజేపీకి ఐదున్నాయి. బీజేపీ జార్ఖండ్‌లో ధన్‌బాద్, జెంషెడ్‌పూర్; బిహార్‌లో పూర్వీ చంపారన్, పశి్చమ చంపారన్, శివోహర్ స్థానాలను చాలా ఏళ్లుగా గెలుచుకుంటూ వస్తోంది. ఒడిశాలోని కటక్, ధెంకెనాల్, కియోంఝర్, పూరి స్థానాల్లో బీజేడీకి ఎదురు లేదు. అలాగే పశి్చమ బెంగాల్లో కాంథీ, తామ్లుక్ లోక్‌సభ స్థానాలు తృణమూల్ కంచుకోటలు.
ఆరో విడత స్థానాల్లో 2019లో 5 చోట్ల పోరు హోరాహోరీగా సాగింది. అయితే వాట న్నింట్లోనూ బీజేపీయే విజేతగా నిలవడం విశేషం! మఛ్‌లీషహర్ (యూపీ) నియోజకవర్గంలోనైతే బీజేపీ అభ్యర్థి భోలానాథ్ కేవలం 198 ఓట్ల (0.02 శాతం) మెజారిటీతో గట్టెక్కారు! శ్రావస్తి (యూపీ), రోహ్‌తక్ (హరియాణా), సంభాల్‌పూర్ (ఒడిశా), ఝార్‌గ్రాం (పశ్చిమ బెంగాల్) స్థానాలను కూడా బీజేపీ ఒక్క శాతం కంటే తక్కువ మెజారిటీతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. అయితే ఆరో విడత పోలింగ్ జరుగుతున్న 58 స్థానాలకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అంశముంది! వీటిలో మూడింట ఒక స్థానంలో ప్రజలు ప్రతి ఎన్నికలోనూ కొత్తవారిని గెలిపిస్తూ వస్తుండటం ఆసక్తికరం.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment