ఆరు రాష్ట్రాలు, రెండో యూటీల్లోని 58 లోక్‌సభ స్థానాల్లో ముగిసిన పోలింగ్
జూన్ 1న తుది విడతలో 57 స్థానాలకు పోలింగ్, 4న ఫలితాల వెల్లడి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శనివారం ఆరో విడతలో 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడపటి సమాచారం అందేసరికి 61.11 శాతం పోలింగ్ నమోదైంది. పశి్చమబెంగాల్లో అక్కడక్కడా చెదురుమదురు ఘటనలు, ఢిల్లీలో ఒకట్రెండుచోట్ల ఈవీఎంలు మొరాయించడం మినహా పోలింగ్ సజావుగా సాగింది. ఈ విడతలో కూడా బెంగాల్లోనే అత్యధికంగా 79.40 శాతం పోలింగ్ నమోదైంది.
జార్ఖండ్‌లో 63.76 శాతం, ఒడిశాలో 69.32, హరియాణాలో 60.06, ఢిల్లీలో 57.67, బిహార్లో 55.24, యూపీలో 54.03 శాతం పోలింగ్ జరిగింది. జమ్మూకశ్మీర్లోని అనంత్‌నాగ్–రాజౌరీ లోక్‌సభ స్థానంలో 54.15 శాతం పోలింగ్ జరగడం విశేషం. అక్కడ గత కొన్ని దశాబ్దాల్లో ఇదే అత్యధికం. దీంతో జమ్మూ కశీ్మర్‌లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అక్కడి 5 లోక్‌సభ స్థానాల్లో కలిసి 58 శాతం పోలింగ్ నమోదైంది.
ఇది గత 40 ఏళ్లలో అత్యధికమని ఈసీ పేర్కొంది. అక్కడి బారాముల్లా (59 శాతం), శ్రీనగర్ (34.4 శాతం) స్థానాల్లోనూ ఈసారి అత్యధిక పోలింగ్ నమోదైంది. ఒడిశాలో 6 లోక్‌సభ స్థానాలతో పాటు వాటి పరిధిలోని 42 అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరిగింది. శనివారంతో 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పరిధిలోని 486 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న చివరిదైన ఏడో విడతలో పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.
ఓటేసిన ప్రముఖులు
రాజధాని ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలకూ ఈ విడతలోనే పోలింగ్ జరిగింది. దాంతో ప్రముఖులంతా ఓటింగ్‌కు తరలివచ్చారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, కేంద్ర మంత్రులు ఎస్.జైశంకర్, హర్దీప్‌సింగ్ పురి, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వద్రా దంపతులు, హరియాణా సీఎం నయాబ్‌సింగ్ సైనీ తదితరులు ఓటు వేశారు. ప్రియాంక కూతురు మిరాయా తొలిసారి ఓటేశారు.
కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఆప్‌కు ఓటేయగా... ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దంపతులు కాంగ్రెస్‌కు ఓటేయడం విశేషం. సోనియా, రాహుల్ ఓటేసిన న్యూఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఆప్, కేజ్రీవాల్‌కు ఓటున్న చోట చాందినీచౌక్ స్థానంలో కాంగ్రెస్ బరిలో ఉండటమే ఇందుకు కారణం. ఢిల్లీలో రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తుండటం తెలిసిందే.
బెంగాల్లో బీజేపీ అభ్యరి్థపై దాడి!
బెంగాల్లోని ఝార్‌గ్రాంలో తృణమూల్ కార్యకర్తలు తన కాన్వాయ్‌పై దాడికి పాల్పడ్డారని బీజేపీ అభ్యర్థి ప్రణత్ తుడు ఆరోపించారు. తనతో పాటు భద్రతా సిబ్బందికి గాయాలైనట్టు తెలిపారు. బీజేపీ ఖుర్దా అసెంబ్లీ అభ్యర్థి, చిలికా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ జగ్‌దేవ్ తన అనుచరులతో పాటు ఓ పోలింగ్ బూత్‌లోకి చొరబడి ఈవీఎంను పగలగొట్టారు. పోలింగ్ అధికారిని తీవ్రంగా గాయపరిచారు. ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment