హైదరాబాద్: రాష్ట్రంలో గుర్తింపులేని 28 కులాలను వెనకబడిన కులాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో గుర్తింపులేని కులాలకు గుర్తింపు, సామాజిక న్యాయం’అనే అంశంపై జాతీయ ఎంబీసీ, డీఎన్టీ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుర్తింపులేని 28 కులాలను బీసీ జాబితాలో చేర్చాలని బీసీ కమీషన్‌కు, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి టీజేఏసీ ఆధ్వర్యంలో త్వరలో వినతిపత్రాలు ఇస్తామని తెలిపారు.
సంఘం అధ్యక్షుడు సంగెం సూర్యారావు, ప్రొఫెసర్ ఐ.తిరుమలి, లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు పాండురంగారావు మాట్లాడుతూ సంచార జాతుల్లో బాగోతుల, గంజికూటి, రామజోగి, ఓడ్, గవిలి, బొప్పల వంటి కులాలు ఇప్పటికీ కనీసం గుర్తింపులేక కడుదీనమైన స్థితిలో జీవనం కొనసాగిస్తున్నాయని అన్నారు. వీరికి కుల సర్టిఫికెట్ ఇవ్వకపోవడంవల్ల పిల్లలను స్కూళ్లలో చేర్పించుకోలేక చదువుకు దూరమౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా కులాలకు చెందిన శ్రీనివాస్, సారయ్య, వెంకటనారాయణ, నరేందర్, పాండురంగచారి మాట్లాడుతూ ‘వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో కొన్ని కులాలకు గుర్తింపు ఇచ్చారు, తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని కులాలను గుర్తిస్తారని భావించాం. కాని నిరాశే ఎదురైంది’అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment