సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్ వెనుకబడిన తరగతులకు కాస్త ఊరటనిచ్చింది. గత రెండేళ్లుగా అరకొర నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం 2021–22 బడ్జెట్ కేటాయింపుల్లో కాస్త ప్రాధాన్యతనిచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వం రూ.5,522.09 కోట్లు ఖర్చు చేయనుంది. ఈమేరకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసింది. 2020–21 వార్షిక బడ్జెట్ కేటాయింపులతో పోలిస్తే 2021–22 వార్షిక బడ్జెట్‌లో రూ.1,618.51 కోట్లు అధికంగా కేటాయించింది. దీంతో బీసీ సంక్షేమ శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ పథకాలకు ఊపిరి అందించినట్లయింది.
కార్పొరేషన్లకు చేయూత.. ఫెడరేషన్లకు రిక్తహస్తం..
వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థ, అత్యంత వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార సంస్థలకు తాజా బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.500 కోట్లు దక్కాయి. ఈమేరకు నిధులు కేటాయించడంతో 2021–22 సంవత్సరంలో ఈ రెండు విభాగాల ద్వారా పథకాలను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సైతం అమలు చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వివిధ కులాలకు సంబంధించిన ఫెడరేషన్లకు మాత్రం ఈసారి బడ్జెట్‌లో నిధులు దక్కలేదు. కేవలం నిర్వహణ నిధులతో సరిపెట్టిన ప్రభుత్వం.. ప్రగతి పద్దులో మాత్రం ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం గమనార్హం.
కల్యాణలక్ష్మికి రూ.500 కోట్లు అదనం..
2021–22 సంవత్సరంలో కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించింది. 2020–21 బడ్జెట్‌లో కల్యాణ లక్ష్మి కింద రూ.1,350 కోట్లు కేటాయించగా.. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.1,850 కోట్లకు పెంచింది. క్షేత్రస్థాయి నుంచి బీసీ వర్గాల నుంచి దరఖాస్తుల సంఖ్య పెరగడం, లబ్ధిదారుల సంఖ్య కూడా భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కేటాయింపులు చాలడం లేదు. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో దాదాపు 40 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే తాజా బడ్జెట్‌లో రూ.500 కోట్లు అదనంగా కేటాయించడంతో బకాయిలన్నీ పరిష్కరించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే 2021–22 ఏడాదిలో కల్యాణలక్ష్మి పథకాన్ని బకాయిలు లేకుండా అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు.
ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలకు..
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్‌లో ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖలకు పెద్దపీట వేసింది. ఈ రెండు శాఖల ద్వారా కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలు సైతం అమలవుతుండగా.. వాటికి సరిపడా కేటాయింపులు చేస్తూనే మరిన్ని పథకాల అమలుకు నిధులు కేటాయించింది. వచ్చే సంవత్సరంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా రూ.5,587.97 కోట్లు, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.3,056.12 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఇక మైనార్టీ సంక్షేమ శాఖకు కూడా కేటాయింపులు కాస్త పెరిగాయి. 2020–21 వార్షికంలో రూ.1,138.45 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,606.39 కోట్లు కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment