రాయచూరు రూరల్: రాష్ట్ర మంత్రివర్గంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజుకు పార్టీ అధిష్టానం మంత్రి పదవి కల్పించనున్నట్లు వార్తలు రావడంతో కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుంది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఎన్.ఎస్.బోసురాజు అసెంబ్లీ, విధాన పరిషత్ సభ్యుడు కాకపోయినా మంత్రివర్గంలో చోటు కల్పించడంపై అసంతృప్తి నెలకొంది.
జిల్లాలో వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్, మస్కి ఎమ్మెల్యే బసనగౌడ తుర్విహాళ, సింధనూరు ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి అసంతృప్తికి గురైనట్లు సమాచారం. ఎన్నికై న ప్రజాప్రతినిధులను కాదని, ఎమ్మెల్యే(ల్సీ) కాని వారిని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బోసురాజుకు అమాత్య పదవిని కేటాయించడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న తలెత్తుతోంది.
నాగేంద్రకు అమాత్యగిరి?
బళ్లారిఅర్బన్: వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలతో మమేకమై రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టిన యువనేత, గ్రామీణ ఎమ్మెల్యే బీ.నాగేంద్ర శనివారం బెంగళూరులో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు సమాచారం. సిద్దరామయ్య కేబినెట్‌లో సభ్యునిగా నాగేంద్ర పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడంతో పార్టీ శ్రేణుల్లో ముఖ్యంగా ఆయన అభిమానుల్లో సంబరాలు నిండాయి. తాజా ఎన్నికల్లో ఆయన ఏకంగా బీజేపీ కీలక నేత బీ.శ్రీరాములుపై అఖండ మెజార్టీతో జయభేరి మోగించడం సంచలనం రేకెత్తించింది. ఈ క్రమంలో ఆయనకు మంత్రి పదవి వరించిందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment