steering committee meeting
-
AICC Steering Committee meet: చేతగానోళ్లు తప్పుకోండి
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలకు పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గట్టి హెచ్చరికలు చేశారు. ‘‘లెక్క లేకుండా ప్రవర్తించినా పర్లేదనేలా కొందరు వ్యవహరిస్తున్నారు. ఇది ఎంతమాత్రమూ సరికాదు. ఆమోదయోగ్యం అసలే కాదు. బాధ్యతలు సజావుగా నిర్వర్తించడం చేతగానివాళ్లు తప్పుకుని ఇతరులకు దారివ్వాల్సి ఉంటుంది’’ అంటూ కుండబద్దలు కొట్టారు. అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి దాకా నాయకులంతా జవాబుదారీతనంతో పని చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఆదివారం కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ తొలి భేటీలో మాట్లాడిన ఆయన, నేతలనుద్దేశించి పదునైన వ్యాఖ్యలు చేశారు. ‘‘పార్టీ పట్ల, దేశం పట్ల మనకున్న బాధ్యతల్లో అత్యంత ముఖ్యమైనది జవాబుదారీతనమే. పార్టీగా కాంగ్రెస్ పటిష్టంగా ఉండి ప్రజల అంచనాలను అందుకున్నప్పుడే మనం ఎన్నికల్లో నెగ్గగలం. దేశానికి, ప్రజలకు సేవ చేయగలం’’ అని అభిప్రాయపడ్డారు. ఈ దృష్ట్యా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్చార్జిలు తమ సొంత బాధ్యతలను, తమపై ఉన్న సంస్థాగత బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై మరింతగా దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ‘‘ప్రధాన కార్యదర్శులుగా, రాష్ట్రాల ఇన్చార్జిలుగా మీ బాధ్యతా పరిధిలో ఉన్న రాష్ట్రాల్లో కనీసం నెలకు 10 రోజులైనా పర్యటిస్తున్నారా? ప్రతి జిల్లా, ప్రతి యూనిట్లో పర్యటించారా? స్థానిక సమస్యలు తదితరాలపై లోతుగా ఆరా తీశారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి’’ అంటూ హితవు పలికారు. ‘‘మీ పరిధుల్లోని రాష్ట్రాల్లో జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీలు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యాయా? జిల్లా, బ్లాక్ స్థాయిల్లో వీలైనంత మంది కొత్తవారికి అవకాశాలిచ్చారా? ఐదేళ్లుగా ఎలాంటి మార్పులూ చేయని జిల్లాలు, బ్లాక్లున్నాయా? ప్రజా సమస్యలపై అవి నిత్యం గళమెత్తుతున్నాయా? ఐఏసీసీ పిలుపు మేరకు స్థానిక సమస్యలపై ఎన్నిసార్లు ఆందోళనలు, ధర్నాలు చేశాయి?’’ అంటూ ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రధాన కార్యదర్శులు, ఇన్చార్జిలు, పీసీసీ చీఫ్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులంతా కలిసి క్షేత్రస్థాయిలో 90 రోజుల పాటు కార్యచరణకు విస్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేయాలి’’ అని ఆదేశించారు. లేదంటే బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వహించనట్టేనని స్పష్టం చేశారు. ‘‘సంస్థాగత ప్రక్షాళనకు, భారీ జనాందోళనలకు మీరంతా తక్షణం బ్లూప్రింట్ సిద్ధం చేస్తారని ఆశిస్తున్నా. అలా చేసి 15 నుంచి 30 రోజుల్లో సమర్పించండి. వాటిపై నాతో చర్చించండి’’ అని ఆదేశించారు. స్టీరింగ్ కమిటీ నేతలు తదితరులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారన్నారు. జాతీయోద్యమంగా జోడో యాత్ర భారత్ జోడో యాత్ర కూడా భేటీలో చర్చకు వచ్చింది. యాత్ర చరిత్ర సృష్టిస్తోందంటూ ఖర్గే కొనియాడారు. ‘‘అధికార పార్టీ విద్వేష రాజకీయాలు, జనం నడ్డి విరుస్తున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక, సామాజిక అసమానతలపై నిర్ణాయాక పోరుగా యాత్ర రూపుదిద్దుకుంటోంది. ప్రజల భాగస్వామ్యంతో జాతీయ జనాందోళనగా మారింది. యాత్ర సాధించిన అతి పెద్ద విజయమిది’’ అన్నారు. దీన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రతి ఊరికీ తీసుకెళ్లడంలో కాంగ్రెస్ శ్రేణుల పాత్ర కీలకమంటూ కొనియాడారు. భేటీలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, సీనియర్ నేతలు కె.సి.వేణుగోపాల్, పి.చిదంబరం, ఆనంద్ శర్మ, మీరాకుమార్, అంబికా సోని, అశోక్ గెహ్లాట్, భూపేశ్ భగెల్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంకగాంధీ కూడా గైర్హాజరయ్యారు. మోదీ ప్రభుత్వంపై నిప్పులు ప్రజల ఆకాంక్షలపై, హక్కులపై మోదీ ప్రభుత్వం క్రూరంగా దాడి చేస్తోందంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘హిమాచల్, గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మోదీ చేసిన విద్వేషపు వ్యాఖ్యలు దేశాన్ని మరింతగా విభజించాయి. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మన భూభాగాన్ని ఆక్రమించాలన్న చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టే దిక్కు లేదు. ఈ సమస్యల నుంచి దేశాన్ని వారిని కాపాడాల్సిన గురుతర బాధ్యత కాంగ్రెస్‌పై ఉంది’’ అన్నారు. ఫిబ్రవరిలో కాంగ్రెస్ ప్లీనరీ మార్చి నుంచి ‘చేయీ చేయీ కలుపుదాం’ కాంగ్రెస్ 85వ ప్లీనరీని వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించాలని స్టీరింగ్ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఫిబ్రవరి ద్వితీయార్ధంలో జరిగే ఈ మూడు రోజుల ప్లీనరీలో పార్టీ అధ్యక్షునిగా ఖర్గే ఎన్నికకు ఆమోదముద్ర పడనుంది. ముగింపు నాడు భారీ బహిరంగ ఉంటుందని పార్టీ నేత కె.సి.వేణుగోపాల్ మీడియాకు వెల్లడించారు. జనవరి 26న రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రను ముగించాలని భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చేయీ చేయీ కలుపుదాం’ పేరుతో యాత్ర స్ఫూర్తిని మార్చి 26 దాకా దేశవ్యాప్తంగా కొనసాగించాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఇందులో భాగంగా గ్రామ, బ్లాక్, జిల్లా స్థాయిల్లో పాదయాత్రలు జరుగుతాయి. ప్రియాంకగాంధీ వధ్రా సారథ్యంలో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు రాష్ట్రాల స్థాయిలో ర్యాలీలు నిర్వహిస్తారు. జోడో యాత్ర ముగిశాక మోదీ ప్రభుత్వంపై రాహుల్ చార్జిషీట్ విడుదల చేయనున్నారు. -
వాచ్డాగ్ పాత్ర పోషిస్తాం
- ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తాం - రాజకీయపార్టీలను కలుపుకోం, అంశాల ఆధారంగా కలిసి పనిచేస్తాం - ఇరిగేషన్ పాలసీపై అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తాం - గ్రూప్-2లో రెండువేల పోస్టులు, త్వరలో డీఎస్సీ ప్రకటించాలి - టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టి.జేఏసీ) రాష్ట్రంలో వాచ్డాగ్ పాత్రను పోషిస్తుందని చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష సాధనకు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పునాదిగా ప్రజల కేంద్రంగా ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. ఇటీవలి కాలంలో జేఏసీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. తాజాగా జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశానికి దాదాపు ఇరవైకి పైగా ప్రజా సంఘాలు వివిధ జేఏసీ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యచరణపై చర్చించుకున్నారు. అనంతరం చైర్మన్ ప్రొ.ఎం.కోదండరామ్ జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక నుంచి జేఏసీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ప్రజలు తమపై నమ్మకముంచి అనేక పిలుపులకు స్పందించి మద్దతుగా నిలిచారు కాబట్టి వారికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తిచూపాలని స్థూలంగా నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో వాచ్డాగ్ పాత్రను పోషించడం కోసం టీ-జేఏసీ నిర్మాణాన్ని విస్తృత పరచాలని, అందుకోసం నిర్మాణాత్మక కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. జేఏసీ నుంచి ఇటీవలి కాలంలో పలు ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవడాన్ని తప్పు పట్టడంలేదని, ప్రతీ సంఘానికి స్వేచ్ఛ ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందన్నారు. అయితే వారు ఇన్నాళ్లు తమతో కలిసి నిర్వహించిన పాత్రను గుర్తు పెట్టుకుంటామన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రయత్నాలోనైనా తమవంతు భాగస్వామ్యం నిర్వహిస్తామన్నారు. రాజకీయపార్టీలను జేఏసీలోకి చేర్చుకోం.. తమ టీంను ఇక నుంచి టీ-జేఏసీగానే పిలవాలని కోదండరామ్ కోరారు. జేఏసీలోకి కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుంటామని, రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోబోమన్నారు. అయితే అంశాల ఆధారంగా అవసరమైనప్పుడు రాజకీయపార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న ఇరిగేషన్ పాలసీపై అధ్యయనం చేసిన తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దీనిపై అనుభవజ్ఞులైన వారితో చర్చించి అభిప్రాయం వ్యక్తంచేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని, అలాగే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు మేత విషయమై త్వరలో రెవెన్యూమంత్రితో సమావేశమవుతామన్నారు. గ్రూప్-2లో పోస్టులు పెంచాలి.. గ్రూప్-2లో కనీసం రెండు పోస్టులను ప్రకటించి భర్తీ చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. అలాగే టీచర్ల నియామకానికి సంబంధించి డీఎస్సీని ప్రకటించాలని కోరారు. వయస్సు సడలింపుకు సంబంధించి ఎక్సైజ్ పోస్టులకు కూడా వర్తింప చేయాలని సూచించారు. అలాగే హెచ్‌సీయూ ఘటనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నట్లు తెలిపారు. వీసీ అప్పారావుపై కేసు విచారణ జరుగుతున్న సమయంలో తిరిగి పదవిలో చేరడం చాలా తప్పునిర్ణయమన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. యూనివర్శిటీలలోకి సాయుధ పోలీసులు ప్రవేశించకుండా సుప్రీంకోర్టు నియమాలను భవిష్యత్తులో కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వాలు చూడాలని విజ్ఞప్తి చేశారు. జేఏసీ స్టీరింగ్ కమిటీకి హాజరైన వారు... చైర్మన్ కోదండరామ్‌తో పాటు కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కోఆర్డినేటర్- పిట్టల రవీందర్, విద్యుత్ జేఏసీ- కె.రఘు, అడ్వకేట్స్ జేఏసీ- నల్లపు ప్రహాద్, విద్యావంతుల వేదిక- గురిజాల రవీందర్రావు, డాక్టర్స్ జేఏసీ- డా.ప్రవీణ్, ఆర్ఎంపీ డాక్టర్స్ జేఏసీ- సి.శంకర్‌ముదిరాజ్, పీవోడబ్ల్యూ- వి.సంధ్య, టీడీఎఫ్-డి.పి.రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్స్- జి.వెంకట్‌రెడ్డి, మాల మహానాడు- బైరి రమేష్, రైల్వే జేఏసీ- ముత్తయ్య, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ- కామగిరి ప్రకాశ్, నిజామాబాద్ జేఏసీ- గోపాల్ శర్మ, రంగారెడ్డి జేఏసీ- వెదిరె చెల్మారెడ్డి, ఆమెరికా టీడీఎఫ్- లక్ష్మణ్ అనుగు, బహ్రెన్ జేఏసీ- దే వేందర్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ- గణేష్ పటేల్, ఉద్యోగుల సంఘం- మామిడి నారాయణ ఉన్నారు.