వాచ్‌డాగ్ పాత్ర పోషిస్తాం | TJAC will play watchdog role, kodandaram at steering committee meeting | Sakshi
Sakshi News home page

వాచ్‌డాగ్ పాత్ర పోషిస్తాం

Published Mon, Mar 28 2016 2:46 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

వాచ్‌డాగ్ పాత్ర పోషిస్తాం - Sakshi

వాచ్‌డాగ్ పాత్ర పోషిస్తాం

- ప్రజల పక్షాన పోరాడుతూ, ప్రజల గొంతుకగా నిలుస్తాం
- రాజకీయపార్టీలను కలుపుకోం, అంశాల ఆధారంగా కలిసి పనిచేస్తాం

- ఇరిగేషన్ పాలసీపై అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయం ప్రకటిస్తాం
- గ్రూప్-2లో రెండువేల పోస్టులు, త్వరలో డీఎస్సీ ప్రకటించాలి

- టీజేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్


సాక్షి, హైదరాబాద్:
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ(టి.జేఏసీ) రాష్ట్రంలో వాచ్‌డాగ్ పాత్రను పోషిస్తుందని చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్ తెలిపారు. ప్రజల ఆకాంక్ష సాధనకు ప్రజాస్వామ్యం సామాజిక న్యాయం పునాదిగా ప్రజల కేంద్రంగా ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ రాష్ట్ర పురోభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ జేఏసీ ప్రధాన కార్యాలయంలో స్టీరింగ్ కమిటీ సుదీర్ఘంగా సమావేశమైంది. ఇటీవలి కాలంలో జేఏసీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటకు వెళ్లిన నేపథ్యంలో.. తాజాగా జరిగిన స్టీరింగ్ కమిటీ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సమావేశానికి దాదాపు ఇరవైకి పైగా ప్రజా సంఘాలు వివిధ జేఏసీ నాయకులు హాజరై భవిష్యత్తు కార్యచరణపై చర్చించుకున్నారు. అనంతరం చైర్మన్ ప్రొ.ఎం.కోదండరామ్ జేఏసీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ఇక నుంచి జేఏసీ నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని ప్రకటించారు. ప్రజలు తమపై నమ్మకముంచి అనేక పిలుపులకు స్పందించి మద్దతుగా నిలిచారు కాబట్టి వారికి అండగా నిలుస్తామన్నారు. రాష్ట్రంలో సమస్యలు తలెత్తినప్పుడు ప్రభుత్వ లోటుపాట్లు ఎత్తిచూపాలని స్థూలంగా నిర్ణయించినట్లు చెప్పారు. రాష్ట్రంలో వాచ్‌డాగ్ పాత్రను పోషించడం కోసం టీ-జేఏసీ నిర్మాణాన్ని విస్తృత పరచాలని, అందుకోసం నిర్మాణాత్మక కమిటీలు వేయనున్నట్లు తెలిపారు.

జేఏసీ నుంచి ఇటీవలి కాలంలో పలు ఉద్యోగ సంఘాలు వెళ్లిపోవడాన్ని తప్పు పట్టడంలేదని, ప్రతీ సంఘానికి స్వేచ్ఛ ఉంటుందని, అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందన్నారు. అయితే వారు ఇన్నాళ్లు తమతో కలిసి నిర్వహించిన పాత్రను గుర్తు పెట్టుకుంటామన్నారు. అలాగే ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రయత్నాలోనైనా తమవంతు భాగస్వామ్యం నిర్వహిస్తామన్నారు.

రాజకీయపార్టీలను జేఏసీలోకి చేర్చుకోం..
తమ టీంను ఇక నుంచి టీ-జేఏసీగానే పిలవాలని కోదండరామ్ కోరారు. జేఏసీలోకి కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నింటినీ కలుపుకుంటామని, రాజకీయ పార్టీలను మాత్రం చేర్చుకోబోమన్నారు. అయితే అంశాల ఆధారంగా అవసరమైనప్పుడు రాజకీయపార్టీలతో కలిసి పనిచేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీయాంశంగా ఉన్న ఇరిగేషన్ పాలసీపై అధ్యయనం చేసిన తర్వాతనే తమ నిర్ణయం ప్రకటిస్తామన్నారు. దీనిపై అనుభవజ్ఞులైన వారితో చర్చించి అభిప్రాయం వ్యక్తంచేస్తామన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరువుపై అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని, అలాగే తమకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఎమ్మెల్యేలకు అందజేస్తామన్నారు. కరువు పరిస్థితుల నేపథ్యంలో పశువులకు మేత విషయమై త్వరలో రెవెన్యూమంత్రితో సమావేశమవుతామన్నారు.


గ్రూప్-2లో పోస్టులు పెంచాలి..
గ్రూప్-2లో కనీసం రెండు పోస్టులను ప్రకటించి భర్తీ చేయాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. అలాగే టీచర్ల నియామకానికి సంబంధించి డీఎస్సీని ప్రకటించాలని కోరారు. వయస్సు సడలింపుకు సంబంధించి ఎక్సైజ్ పోస్టులకు కూడా వర్తింప చేయాలని సూచించారు. అలాగే హెచ్‌సీయూ ఘటనలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జిని ఖండిస్తున్నట్లు తెలిపారు. వీసీ అప్పారావుపై కేసు విచారణ జరుగుతున్న సమయంలో తిరిగి పదవిలో చేరడం చాలా తప్పునిర్ణయమన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయడంతో పాటు నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలన్నారు. యూనివర్శిటీలలోకి సాయుధ పోలీసులు ప్రవేశించకుండా సుప్రీంకోర్టు నియమాలను భవిష్యత్తులో కచ్చితంగా అమలయ్యేలా ప్రభుత్వాలు చూడాలని విజ్ఞప్తి చేశారు.

జేఏసీ స్టీరింగ్ కమిటీకి హాజరైన వారు...
చైర్మన్ కోదండరామ్‌తో పాటు కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, కోఆర్డినేటర్- పిట్టల రవీందర్, విద్యుత్ జేఏసీ- కె.రఘు, అడ్వకేట్స్ జేఏసీ- నల్లపు ప్రహాద్, విద్యావంతుల వేదిక- గురిజాల రవీందర్‌రావు, డాక్టర్స్ జేఏసీ- డా.ప్రవీణ్, ఆర్‌ఎంపీ డాక్టర్స్ జేఏసీ- సి.శంకర్‌ముదిరాజ్, పీవోడబ్ల్యూ- వి.సంధ్య, టీడీఎఫ్-డి.పి.రెడ్డి, రిటైర్డ్ లెక్చరర్స్- జి.వెంకట్‌రెడ్డి, మాల మహానాడు- బైరి రమేష్, రైల్వే జేఏసీ- ముత్తయ్య, గ్రేటర్ హైదరాబాద్ జేఏసీ- కామగిరి ప్రకాశ్, నిజామాబాద్ జేఏసీ- గోపాల్ శర్మ, రంగారెడ్డి జేఏసీ- వెదిరె చెల్మారెడ్డి, ఆమెరికా టీడీఎఫ్- లక్ష్మణ్ అనుగు, బహ్రెన్ జేఏసీ- దే వేందర్‌రెడ్డి, ఆర్టీసీ జేఏసీ- గణేష్ పటేల్, ఉద్యోగుల సంఘం- మామిడి నారాయణ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement